Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

సకాలంలో గుర్తిస్తే క్యాన్సర్‌తో ప్రమాదం లేదు…

సకాలంలో గుర్తిస్తే క్యాన్సర్‌తో ప్రమాదం లేదు
వలంట్రీ సేవలే కమ్యూనిస్టులకు బలం
ప్రకాశ్‌ ప్రాజెక్ట్స్‌ అధినేత బత్తినేని ప్రకాశ్‌, స్వాతి…

ప్రభుత్వమే విద్యావైద్యాన్ని బాధ్యతగా తీసుకోవాలి
కమ్యూనిస్టు నేపథ్యంతోనే బత్తినేని కుటుంబం సేవలు
సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు…

బీవీకే- ప్రకాశ్‌ ప్రాజెక్ట్స్‌-తానా ఆధ్వర్యంలో గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ ఉచిత క్యాన్సర్‌ నిర్ధారణ శిబిరానికి
విశేష స్పందన…

300కు పైగా మందికి క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు…

సకాలంలో గుర్తిస్తే క్యాన్సర్‌తో ఎలాంటి ప్రమాదం లేదని ప్రకాశ్‌ ప్రాజెక్ట్స్‌ అధినేత బత్తినేని ప్రకాశ్‌, డైరెక్టర్‌ బత్తినేని స్వాతి అన్నారు. క్యాన్సర్‌ మహమ్మారీ ఏటేటా విస్తరిస్తోందని తెలిపారు. సీపీఐ(ఎం) టూటౌన్‌ కమిటీ, బోడేపూడి విజ్ఞాన కేంద్రం (బీవీకే)- ప్రకాశ్‌ ప్రాజెక్ట్స్‌-తానా ఆధ్వర్యంలో గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌, హైదరాబాద్‌ వారిచే శనివారం ఖమ్మంలోని మంచికంటి భవన్‌లో నిర్వహించిన ఉచిత క్యాన్సర్‌ నిర్ధారణ శిబిరానికి విశేష స్పందన లభించింది. 300కు పైగా మందికి క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కమ్యూనిస్టు నేపథ్యంతో అభ్యుదయ భావాలతో బత్తినేని కుటుంబం ఆదర్శనీయంగా సేవలు అందిస్తోందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు. నెలనెలా ఉచిత మెడికల్‌ క్యాంప్‌లో భాగంగా ఈసారి క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రతినెలా ఏడుచోట్ల శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బీవీకే ఆధ్వర్యంలో ఏడేళ్లుగా హెల్త్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా సమయంలో 45 రోజుల పాటు ఐసోలేషన్‌ సెంటర్‌ నిర్వహించడం, హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి మందులు, ఆహారపదార్థాలు అందించినట్లు వివరించారు. నెలనెలా నిర్వహించే ఏడు శిబిరాల్లో రూ.100కే రూ.3 నుంచి రూ.4వేల విలువ చేసే మందులను అందిస్తున్నట్లు తెలిపారు.
కమ్యూనిస్టు నేపథ్యం…అభ్యుదయభావాలున్న బత్తినేని కుటుంబం
కమ్యూనిస్టు నేపథ్యం… అభ్యుదయ భావాలున్న బత్తినేని నాగప్రసాద్‌, నీరజ, భీమవరపు పుల్లారావు కుటుంబాలు ఆదర్శవంతమైన సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మంలో ఐటీ హబ్‌ రావడానికి బత్తినేని ప్రకాశ్‌, రాకేశ్‌లు కూడా కారణమని అన్నారు. ప్రకాశ్‌ ప్రాజెక్ట్స్‌ ద్వారా రెండువేల మంది ఐటీ పరంగా ఉపాధి పొందుతున్నారని తెలిపారు.
వలంట్రీ సేవలే కమ్యూనిస్టులకు బలం: ప్రకాశ్‌, స్వాతి
కమ్యూనిస్టులు వలంట్రీ సేవల్లో ముందుంటారని ప్రకాశ్‌ ప్రాజెక్ట్స్‌ అధినేత బత్తినేని ప్రకాశ్‌, డైరెక్టర్‌ స్వాతి అన్నారు. 90వ దశకంలో ప్రతీ ఐదుగురిలో ఒకరు క్యాన్సర్‌ బారిన పడినట్లు వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసిందన్నారు. పరిస్థితి ఇలానే ఉంటే క్యాన్సర్‌లేని ఇల్లంటూ ఉండదన్నారు. ‘ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ దాన్‌ క్యూర్‌’ (నివారణ కంటే నిరోధం ఉత్తమం) అన్నారు. 40 ఏళ్లకు పైగా వయస్సు పైబడిన ప్రతీ మహిళా ప్రతీ రెండేళ్లకోసారి క్యాన్సర్‌ టెస్టు చేయించుకోవాలని సూచించారు. 30 ఏళ్లుగా తమ అమ్మమ్మ బ్రెస్ట్‌ క్యాన్సర్‌కు వైద్యం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉన్నట్లు స్వాతి తెలిపారు. కాబట్టి సకాలంలో గుర్తించడం వల్ల క్యాన్సర్‌తో ప్రమాదం లేదని తెలిపారు. క్యాన్సర్‌కు భయపడాల్సిన అవసరం లేదని ప్రకాశ్‌ ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌ భీమవరపు పుల్లారావు అన్నారు. రసాయనాలతో కూడిన ఆహారాలు, రంగులతో మిళితమైన ఫాస్ట్‌ఫుడ్స్‌, కూల్‌డ్రిరక్స్‌ వంటివే క్యాన్సర్‌కు ప్రధాన కారకాలని వివరించారు.
క్యాన్సర్‌ మహమ్మారిని తరిమేద్దాం: నీరజ
క్యాన్సర్‌ మహమ్మారి కారణంగా తమ అత్తగారు 49 ఏళ్ల వయస్సులోనే కాలం చేశారని ఎన్‌ఆర్‌ఐ పేరెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు బత్తినేని నీరజ అన్నారు. తమ నానమ్మ లాంటి పరిస్థితి మరొకరికి రాకూడదనే తమ కుమారులు ప్రకాశ్‌, రాకేష్‌ బత్తినేని చారిటబుల్‌ ట్రస్టు ద్వారా హెల్త్‌క్యాంప్‌లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 1983 సంవత్సరంలో తమ నాన్న మధిర మాజీ ఎమ్మెల్యే బోడేపూడి వెంకటేశ్వరరావుతో కలిసి కమ్యూనిస్టు పార్టీకి సేవలందించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ప్రతీ 9 మందిలో ఒకరు క్యాన్సర్‌ బారినపడినట్లు డాక్టర్‌ యలమంచిలి రవీంద్రనాథ్‌ తెలిపారు. సకాలంలో గుర్తిస్తే 40 శాతం కేసులను నివారించవచ్చని తెలిపారు. తీసుకునే ఆహారం, పొగ పీల్చడం, ఆల్కాహాల్‌ తీసుకోవడం, జీవనశైలిలో మార్పులే క్యాన్సర్‌ను పెంచిపోషిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒకే ఒక క్యాన్సర్‌ హాస్పిటల్‌ ఉండటం శోచనీయమన్నారు. మహిళలు ప్రతినెలా బ్రస్ట్‌ టెస్టు చేసుకోవాలని కిమ్స్‌ హాస్పిటల్‌ వైద్యులు రజిత తెలిపారు. నెలసరి వచ్చాక నిపుల్‌ నుంచి తెల్లగా లేదా పచ్చగా ఏదైనా కారుతుందంటే కచ్చితంగా టెస్టు చేయించుకోవాలని సూచించారు. ప్రీ క్యాన్సర్‌ స్టేజీలోనే గుర్తిస్తే జబ్బును నయం చేసుకోవచ్చని తెలిపారు. 50 సంవత్సరాలకు పైబడిన పురుషులు బ్లడ్‌ టెస్టు ద్వారా క్యాన్సర్‌ను నిర్ధారణ చేసుకోవచ్చని ఆరోగ్య హాస్పిటల్‌ డాక్టర్‌ సుధాకర్‌ చెప్పారు.
బీవీకే జనరల్‌ మేనేజర్‌ వై.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రేస్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ సంజయ్‌, కార్పొరేటర్‌ మిక్కిలినేని మంజుల, సీపీఐ(ఎం) రాష్ట్రకమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్‌, మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.విక్రమ్‌, జిల్లా కమిటీ సభ్యులు పారుపల్లి రaాన్సీ, మాదినేని రమేశ్‌, టూటౌన్‌ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్‌, జనత ఆస్పత్రి డాక్టర్‌ సి.భారవి, వైద్యులు రంజిత్‌, పిల్లలమర్రి సుబ్బారావు, ఎస్‌కే అఫ్జల్‌, గోవిందరావు, రామారావు, పడగాల నాగేశ్వరరావు, వాసిరెడ్డి వీరభద్రం, మాజీ కౌన్సిలర్‌ నర్రా రమేష్‌, నాయకులు పామర్తి వాసు, ఎం.సుబ్బారావు, వెంకన్నబాబు పాల్గొన్నారు.

Related posts

రాయల నాగేశ్వరరావు నివాసానికి పొంగులేటి …

Ram Narayana

భాదితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం …సీఎల్పీ నేత భట్టి …ప్రతిపక్షాలది కడుపు మంట మంత్రి పువ్వాడ …

Ram Narayana

మా కార్యకర్తలకు తెలియకుండా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలున్నాయి: మంత్రి పొంగులేటి భావోద్వేగం

Ram Narayana

Leave a Comment