- ప్రధాని మోదీపై మధు యాష్కీ తీవ్ర విమర్శలు
- అదానీకి పనికొచ్చే విధంగా ప్రభుత్వ సంస్థలను మార్పు చేశారని విమర్శ
- విదేశీ పర్యటనలకు అదానీని తీసుకెళ్తున్నారని మండిపాటు
వ్యాపారవేత్తల సహకారంతోనే మోదీ మళ్లీ అధికారంలోకి వచ్చారని తెలంగాణ కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధు యాష్కీ గౌడ్ అన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రముఖ వ్యాపారవేత్త అదానీకి పనికొచ్చే విధంగా మార్పు చేశారని ఆయన విమర్శించారు. జీవీకే గ్రూప్స్, అంబుజా సిమెంట్స్, ఎన్డీటీవీ వీటన్నింటిపై ఈడీ దాడి చేసిందని… ఆ తర్వాత ఈ కంపెనీలన్నీ అదానీ పరమయ్యాయని మండిపడ్డారు. అల్ట్రాటెక్ సిమెంట్ పై అదానీ కామెంట్ చేశారని… ఆ తర్వాత ఆ సంస్థపై సీబీఐ దాడులు చేసిందని దుయ్యబట్టారు.
అదానీ కంపెనీల్లో ఎస్బీఐ, ఎల్ఐసీ కంపెనీలు షేర్లు కొనుగోలు చేస్తున్నాయని… ఎవరి ఒత్తిడితో ఇది జరుగుతోందని మధు యాష్కీ ప్రశ్నించారు. దీనిపై విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. విదేశీ పర్యటనలకు వెళ్తున్న మోదీ అదానీని కూడా వెంట తీసుకెళ్తున్నారని… అక్కడ కాంట్రాక్టులు ఇప్పిస్తున్నారని మండిపడ్డారు. అంబానీ, అదానీల వ్యాపారాలకు మోదీ పూర్తిగా అండగా ఉంటున్నారని… మాట వినని కార్పొరేట్ సంస్థలను ఈడీ, ఐటీ రెయిడ్స్ తో బెదిరిస్తున్నారని చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కృష్ణపట్నంపోర్ట్, జీవీకే గ్రూప్స్ లను ఇప్పటికే బెదిరించారని తెలిపారు.
మోదీ వ్యతిరేక విధానాలపై ఈడీ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలను చేపడతామని మధు యాష్కీ హెచ్చరించారు. దేశ సంపదను అదానీ బయట దేశాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ, అదానీ, సెబీ ఛైర్మన్ ముగ్గురూ దేశ సంపదను దోచేస్తున్నారని అన్నారు. దీనిపై వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.