హుజురాబాద్ అసెంబ్లీ పై చకా చకా ఫైల్ …ఖాళీ అయినట్లు ఈసీకి సమాచారం
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టు నోటిఫికేషన్ జారీ
ఎమ్మెల్యేగా ఈటల రాజీనామా
ఆమోదం తెలిపిన స్పీకర్ పోచారం
త్వరలోనే రానున్న ఉపఎన్నిక ప్రకటన
ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ చేసిన రాజీనామాను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈటల రాజీనామా ఆమోదం అనంతరం శాఖాపరమైన చర్యలు చోటుచేసుకున్నాయి. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచారి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆయన రాజీనామా చేసిన కొన్ని గంటలలోనే చకా చకా ఫైల్ పరుగులు పెట్టింది . అసెంబ్లీ కార్యాలయానికి స్పీకర్ రాకుండానే ఫైల్ తెప్పించుకొని ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. స్పీకర్ ఆమోదాన్ని ఢిల్లీలోని ఎన్నకల సంఘ కార్యాలయానికి సమాచారం అందించారు.
ఈటల రాజీనామాపై ఎన్నికల సంఘానికి సమాచారం అందించారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచారి ఎన్నికల సంఘానికి నివేదించారు. త్వరలోనే దీనిపై ఈసీ నిర్ణయం తీసుకుని ఉపఎన్నిక ప్రకటన చేయనుంది.
ఇవాళ ఈటల తన రాజీనామా పత్రాన్ని సమర్పించిన వెంటనే పరిణామాలు వేగంగా చోటుచేసుకున్నాయి. అసెంబ్లీ కార్యదర్శి వెంటనే ఫైలు రూపొందించి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి పంపించగా, ఆయన వెంటనే ఆమోదం తెలిపారు. సాధారణంగా ఓ సభ్యుడు రాజీనామా చేసినప్పుడు అసెంబ్లీ స్పీకర్ ఆ సభ్యుడితో మాట్లాడాల్సి ఉంటుంది. అయితే ఈటల స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేయడంతో, స్పీకర్ పోచారం నేరుగా ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తోంది. ఇదంతా కొన్ని గంటల్లోనే జరిగిపోయింది.