కర్నూల్ జిల్లాలోని దేవరగట్టు కర్రల సమరోత్సవానికి సిద్దమవుతోంది. ప్రతియేటా దసరా పండుగ సందర్భంగా నిర్వహించే బన్ని ఉత్సవానికి కర్నూల్ జిల్లా దేవరగట్టులో మాళ మల్లేశ్వరస్వామి ఆలయంలో అన్ని ఏర్పాట్లు జరిగాయి.
దసరా రోజున దేవరగట్టు కొండపై మాళమ్మ మల్లేశ్వరుల కళ్యాణం మహోత్సవం అనంతరం.. ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవడానికి 3 గ్రామాల ప్రజలు ఓ వైపు, 5 గ్రామాల ప్రజలు మరోవైపుగా మొత్తం 8 గ్రామాల ప్రజలు కర్రలతో తలపడతారు. దీన్నే బన్ని ఉత్సవం లేదా కర్రల సమరం అంటారు. కాగా ఈ ఉత్సవానికి ప్రభుత్వం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తుంది.
అలాగే సమరంలో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు 500 పడకల తాత్కాలిక అసుపత్రిని కూడా ఏర్పాటు చేశారు. దీంతోపాటు నిరంతర విద్యుత్ సదుపాయం, తాగునీరు సదుపాయం ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా.. 148 మందిని బైన్డొవర్ చేసినట్టు కర్నూల్ ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు.