- గ్రూప్-1 మెయిన్స్ కోసం పటిష్ఠ బందోపస్త్ ఏర్పాటు చేశామన్న డీజీపీ
- పరీక్షలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడి
- నిరసన పేరుతో రోడ్ల పైకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడతామంటే కుదరదని వ్యాఖ్య
కోర్టు ఆదేశాల ప్రకారమే గ్రూప్-1 పరీక్షలు జరుగుతాయని, హైకోర్టు ఆదేశాలపై అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చునని తెలంగాణ డీజీపీ జితేందర్ వెల్లడించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… గ్రూప్-1 మెయిన్స్ కోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
కోర్టు ఆదేశాల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని, కానీ నిరసన పేరుతో రోడ్లపైకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. శాంతిభద్రతలను రక్షించాలనే నిన్న గ్రూప్ -1 అభ్యర్థుల ఆందోళనను అరికట్టామన్నారు.
ముత్యాలమ్మ దేవాలయం ఘటనపై విచారణ జరుగుతోంది
సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయం ఘటనపై దర్యాఫ్తు కొనసాగుతోందన్నారు. నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేసు విచారణ సాగుతోందని, అందరూ సంయమనం పాటించాలని కోరారు. సికింద్రాబాద్ ఘటనపై ఆందోళనలు సరికాదన్నారు. అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు సిబ్బందికి నివాళులు అర్పిస్తామన్నారు.