- 40 నిమిషాలపాటు పలు అంశాలపై చర్చ
- కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించిన నారా లోకేశ్
- రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నారంటూ అమిత్ షాకు కృతజ్ఞతలు
కేంద్ర హోమంత్రి అమిత్ షాతో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదివారం భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలను అమిత్ షాకు నారా లోకేశ్ వివరించారు. ఇక రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నందుకు అమిత్ షాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమస్యలు అధిగమించి రాష్ట్రం బలమైన శక్తిగా ఎదిగేందుకు కేంద్ర సహాయం ఉంటుందని ఈ సందర్భంగా అమిత్ షా భరోసా ఇచ్చారు.
కాగా అమిత్ షాతో భేటీపై ఎక్స్ వేదికగా మంత్రి లోకేశ్ స్పందించారు. కేంద్ర మంత్రితో చాలా మంచి సమావేశం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిణామాలను ఆయనకు వివరించానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ని ఆర్థిక శక్తి కేంద్రంగా తిరిగి నిలపడానికి, తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి అమిత్ షా నిబద్ధతతో ఉన్నారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం మార్గదర్శకత్వం చేస్తున్న అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపానని ఆయన చెప్పారు.