- తారస్థాయికి చేరిన మంచు ఇంట వివాదం
- పోలీసుల ముందే ఇరువర్గాల బౌన్సర్ల వీరంగం
- మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేసిన సమయంలో కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయని పోలీసులు
- పోలీసుల తీరును తప్పుబట్టిన మంచు మనోజ్
టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఇంట నెలకొన్న వివాదం నేపథ్యంలో పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీస్తోంది. జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద మంచు మనోజ్, మంచు విష్ణు బౌన్సర్ల మధ్య తోపులాట, దాడులు జరుగుతున్నా.. పోలీసులు చోద్యం చూస్తూ నిలబడ్డారు.
ప్రైవేట్ బౌన్సర్లు మీడియా ప్రతినిధుల పట్ల ఇష్టారీతిన వ్యవహరించినా పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. మోహన్ బాబు ఓ మీడియా ప్రతినిధి నుంచి మైకు లాగేసుకుని దాడి చేసినప్పుడు పోలీసులు కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం పోలీసుల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం.
ఇక మనోజ్ గేటు తోసుకుంటూ లోపలికి వెళ్లినప్పుడు, దాడులు జరిగినప్పుడు మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి, పహాడిషరిఫ్ ఇన్‌స్పెక్టర్ గురువారెడ్డి అక్కడే ఉన్నారు. ఆదివారం ఉదయం నుంచి వివాదం నడుస్తున్నా పరిస్థితులను అంచనా వేయకుండా అప్రమత్తంగా వ్యవహరించకపోవడం.. చివరకు దాడులకు వెళ్లేంత వరకూ ఎదురుచూడడం అనేది పోలీసుల నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది.
మంచు మనోజ్ కూడా పోలీసుల తీరును తప్పుబట్టారు. అవతలివర్గం కోసం కొత్త వ్యక్తులు లోపలికి వస్తున్నా అడ్డుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఇక మంగళవారం రాత్రి అప్పటికప్పుడు మహేశ్వరం అదనపు డీసీపీ సత్యనారాయణ మోహన్ బాబు ఇంటికి రావడం, హడావుడిగా సిబ్బందిని మోహరించడం జరిగింది. ఆ తర్వాత పరిస్థితులపై ఆరా తీశారు.