- ఏసుక్రీస్తు బోధనలు ఇప్పటికీ, ఎప్పటికీ మానవాళికి మార్గదర్శకాలన్న సీఎం
- శాంతి దూత ఇచ్చిన సందేశం మనందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్న రేవంత్
- రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని పిలుపు
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రిస్టియన్ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచంలోని మానవాళికి మార్గదర్శకమని అన్నారు. అన్ని మతాల సారాంశం మనవత్వమేనని అన్నారు. ఇతరుల పట్ల ప్రేమ, సహనం, శాంతి, సేవాభావం వంటి గొప్ప గుణాలను ఆచరించాలని, శాంతి దూత ఇచ్చిన సందేశం మనందరికీ ఆదర్శంగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు.
ఏసు ప్రభువు బోధనలను అనుసరించి అన్ని మతాల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. క్రిస్టియన్ మైనార్టీల సర్వతోముఖావృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు. క్రిస్టియన్ సోదరులు సంతోషంతో, ఆనందోత్సహాలతో క్రిస్మస్‌ను జరుపుకోవాలన్నారు. క్రీస్తు అనుసరించిన మార్గాన్ని అనుసరిస్తూ సమాజ అభివృద్ధి కోసం అందరూ పాటుపడాలని సూచించారు. రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
క్రైస్తవ బంధువులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు…డిప్యూటీ సీఎం భట్టి

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు, క్రైస్తవ బంధువులందరికీ హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు…నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన యేసు క్రీస్తు బోధనలు విశ్వమానవాళికి మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు . విశ్వ మానవులకు ప్రేమ సౌభాతత్వం పంచిన ఏసుక్రీస్తు మార్గం ప్రతి ఒక్కరికి అనుసరణీయమని పేర్కొన్నారు .
అన్ని మతాల సారాంశం మానవత్వమేనని ఆయన ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూచిగా నిలుస్తోందన్నారు .
శాంతి సహనం కరుణ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని బోధించిన జీసస్ మాటలు సదా అనుసరించాల్సిన మార్గం. ఏసుక్రీస్తు నేర్పిన మార్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం సర్వమత హితంగా పరిపాలన చేస్తుంది. అన్ని మతాల ప్రజల అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం స్థిర సంకల్పంతో కట్టుబడి పని చేస్తుందన్నారు . క్రిస్టియన్ మైనారిటీల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు . క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులు ఆనందంగా వేడుకగా ఈ పండుగను జరుపుకోవాలని మనస్పూర్తిగా మరొక్కసారి కోరుకుంటన్నట్లు పేర్కొన్నారు…
చంద్రబాబు, పవన్ కల్యాణ్, జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు

- సర్వ మానవాళికి మేలు కలగాలని ప్రభువును ప్రార్థిద్దామన్న చంద్రబాబు
- ప్రేమ, శాంతి, సద్భావన అనేవి క్రీస్తు అందించిన సుగుణాలన్న పవన్
- క్రీస్తు బోధనలు మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయన్న జగన్
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘సర్వ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన యుగకర్త యేసు క్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగ దినం. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు నా శుభాకాంక్షలు. ప్రేమ మార్గంలో ఎవరి మనసునైనా జయించవచ్చునని తన జీవితం ద్వారా నిరూపించిన క్రీస్తు మార్గంలో నడుస్తూ సాటి మనిషికి మేలు చేయడమే మన ముందున్న కర్తవ్యం. ప్రేమ, కరుణ, సహనం, దయ, త్యాగ గుణాలను అలవాటు చేసుకుని జీవితాన్ని శాంతిమయం చేసుకుందాం. సర్వ మానవాళికి మేలు కలగాలని ప్రభువును ప్రార్థిద్దాం’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఈ క్రిస్మస్ మానవాళి జీవితాల్లో ప్రేమ, శాంతి నింపాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ప్రేమ, శాంతి, సద్భావన అనేవి క్రీస్తు మానవాళికి అందించిన సుగుణాలని చెప్పారు. ఏసుక్రీస్తు మార్గాన్ని అనుసరించే క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు.
ప్రేమ, కరుణ, క్షమ, సహనం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని జగన్ చెప్పారు. మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారని అన్నారు. క్రీస్తు బోధనలు మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.