జాతీయ వార్తలు

అనారోగ్యంతో ఉన్నా బాధ్యతను మరువని మన్మోహన్.. నాడు వీల్ చెయిర్ లో రాజ్యసభకు వెళ్లిన వైనం

Manmohan Singh Reached Parliament In Wheelchair To Vote Against Modi Governments Bill
  • 2023లో ఢిల్లీ సర్వీస్ బిల్లును తెచ్చిన మోదీ సర్కార్
  • అప్పటికే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ప్రధాని
  • పెద్దగా ప్రయోజనం లేదని తెలిసీ బాధ్యతగా సభకు వచ్చారన్న మోదీ

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ గురువారం రాత్రి తుదిశ్వాస వదిలిన విషయం తెలిసిందే. దేశానికి సుదీర్ఘకాలంపాటు వివిధ హోదాలలో సేవలందించిన మన్మోహన్ సింగ్ బాధ్యతకు, విధినిర్వహణలో ఆయన చూపే కచ్చితత్వానికి తార్కాణంగా నిలిచే సంఘటన 2023 లో చోటుచేసుకుంది. గతేడాది ఆగస్టు 7న కేంద్రంలోని మోదీ సర్కారు ఢిల్లీ సర్వీసెస్ బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లును ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ప్రతిపక్షాలు అన్నీ వ్యతిరేకించాయి.

ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేయడానికే కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చిందని ఆరోపించాయి. బిల్లుపై ఓటింగ్ జరగాలంటూ పట్టుబట్టాయి. దీంతో ఉభయ సభలలో ఓటింగ్ జరిగింది. నాడు మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇండియా కూటమి పిలుపు మేరకు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయడానికి వీల్ చెయిర్ లోనే సభకు వచ్చారు. అప్పటికే అనారోగ్యంతో వుండి, నడిచే పరిస్థితి లేనప్పటికీ సభకు వచ్చి బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు.

రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మెజారిటీ ఉందని తెలిసి, తాను ఓటేసినా పెద్దగా ప్రయోజనం లేదని తెలిసీ మన్మోహన్ సభకు రావడం గమనార్హం. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ నాడు సభలో ప్రస్తావిస్తూ.. రాజ్య సభ సభ్యుడిగా తన బాధ్యతను నిర్వహించేందుకు వీల్ చెయిర్ లో సభకు వచ్చిన మన్మోహన్ సింగ్ పై ప్రశంసలు కురిపించారు. ఈ బిల్లు విషయంలో ప్రభుత్వం మాటే నెగ్గుతుందని మన్మోహన్ సింగ్ కు తెలుసని, అయినా బాధ్యతగా వచ్చి ఓటేసి సభ్యులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. మన్మోహన్ సింగ్ కోలుకుని తామందరికీ మార్గదర్శకం చేయాలంటూ సభలో మోదీ ప్రార్థించారు.

ఉపాధి హామీ పథకం మన్మోహన్ ఘనతే!

RTI RTE NREGA landmarks in Manmohan Singh legacy
  • 2004 లో ప్రధానిగా గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభం
  • చారిత్రాత్మక సమాచార హక్కును తీసుకొచ్చిందీ ఆయనే
  • మన్మోహన్ పాలనలో ఆహార భద్రత చట్టం

మన్మోహన్ సింగ్ పదేళ్ల పాలనలో నాటి యూపీఏ ప్రభుత్వం పలు చారిత్రాత్మక చట్టాలు చేసింది. అందులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు లేని సమయంలో కూలీలకు ఉపాధి కల్పించడం కోసం ఈ పథకానికి రూపకల్పన చేశారు. 2004లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. వంద రోజుల పాటు వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించింది. సోనియా గాంధీ నేతృత్వంలోని జాతీయ సలహా మండలిలో ఈ పథకం రూపుదిద్దుకుంది.

దీంతో పాటు సమాచార హక్కును యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లను 2005లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ అమలులోకి తెచ్చారు. విద్యారంగంలోనూ మన్మోహన్ కీలక సంస్కరణలు అమలు చేశారు. ఎడ్యుకేషన్ లో ఓబీసీ రిజర్వేషన్ అమలు చేసింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వమే. 2009 లో లోక్ సభ ఎన్నికల వేళ మెగా ఫార్మ్ లోన్ ప్యాకేజీ ప్రకటించారు. అంతకుముందు ఆహార భద్రత చట్టం (ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్) ను మన్మోహన్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు అమలులోకి తెచ్చింది.

‘మౌన ప్రధాని’గా మన్మోహన్ సింగ్‌పై విపక్షాల ముద్ర.. పదవి నుంచి దిగిపోయాక ఇచ్చిన సమాధానం ఇదే

People say I was a silent Prime Minister but i met press regularly says Manmohan Singh
  • మీడియాతో మాట్లాడడానికి భయపడిన ప్రధానిని కాదన్న మన్మోహన్
  • విదేశీ పర్యటనల సమయంలో ప్రతిసారీ ప్రెస్‌తో మాట్లాడానంటూ 2018లో స్పందన
  • ‘ఛేంజింగ్ ఇండియా’ పుస్తకావిష్కరణలో మన్మోహన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

దేశ ఆర్థిక వ్యవస్థ సంస్కర్త, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. వరుసగా రెండు పర్యాయాలు ప్రధానిగా చిరస్మరణీయ సేవలు అందించారు. అయితే, ఆయన పదవిలో కొనసాగినంత కాలం ‘మౌనముని’, ‘మౌన ప్రధాని’ అంటూ ప్రతిపక్షాలు విమర్శించేవి. ఈ తరహా వ్యాఖ్యలను పట్టించుకోకుండా దేశాభివృద్ధిలో ఆయన తనదైన బలమైన ముద్ర వేశారు. ప్రధానిగా మొదటి పర్యాయంలోనే ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. పదవి నుంచి దిగిపోయిన నాలుగేళ్ల తర్వాత 2018లో తొలిసారి మౌనముని విమర్శలపై స్పందించారు. ఆరు సంపుటాలుగా ఆయన రచించిన ‘ఛేంజింగ్ ఇండియా’ పుస్తకావిష్కరణలో మాట్లాడారు.

ప్రెస్‌తో మాట్లాడడానికి భయపడే ప్రధానిని కాదు
‘‘నన్ను మౌన ప్రధాని అన్నారు. వాస్తవాలు ఏమిటో ఈ పుస్తకాలు తెలియజేస్తాయని భావిస్తున్నాను. ప్రెస్‌తో మాట్లాడటానికి భయపడిన ప్రధానమంత్రిని కాదు. నేను క్రమం తప్పకుండా మీడియాతో మాట్లాడాను. నేను చేపట్టిన ప్రతి విదేశీ పర్యటన సమయంలో మీడియాతో మాట్లాడాను. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో ప్రెస్ కాన్ఫరెన్స్‌‌లలో పాల్గొన్నాను. వాటి ఫలితాలను కూడా పుస్తకంలో వివరించాను’’ అని మన్మోహన్ సింగ్ గట్టి సమాధానం ఇచ్చారు.

కాగా, 2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వంలో దశాబ్ద కాలం పాటు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా కొనసాగారు. అంతకుముందు మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా కూడా చిరస్మరణీయ సేవలు అందించారు. 1991లో ఆర్థిక సంస్కరణల ద్వారా ప్రపంచ మార్కెట్‌లో భారత ఆర్థిక వ్యవస్థను ఒక భాగంగా మార్చివేశారు. దీంతో దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడి వృద్ధిబాట పట్టింది. అందుకే ఆధునిక భారతదేశ ఆర్థిక రూపశిల్పిగా మన్మోహన్ సింగ్ గుర్తింపు పొందారు.

ఒబామా పుస్తకంలో మన్మోహన్ సింగ్ ప్రస్తావన.. ఏం రాశారంటే..!

When Obama Praised Manmohan Singh In His Memoir
  • అసాధారణ ప్రతిభావంతుడు, నిజాయతీపరుడని కొనియాడిన ఒబామా
  • భారతీయుల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచిస్తారని ప్రశంసలు
  • లక్షలాది మందిని పేదరికం నుంచి బయటపడేశారని మన్మోహన్ పై పొగడ్తలు

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పుస్తకంలో మన్మోహన్ సింగ్ పేరును ప్రస్తావించారు. ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ పేరుతో ఒబామా తన జ్ఞాపకాలను పుస్తకరూపంలో తీసుకురాగా.. అందులో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రస్తావనా ఉంది. మన్మోహన్ ను అత్యంత అసాధారణ ప్రతిభ కలిగిన వ్యక్తిగా ఒబామా పేర్కొన్నారు. ఆలోచనాపరుడు, నిజాయతీ కలిగిన వ్యక్తి అని ప్రశంసలు కురిపించారు.

నిరంతరం భారతీయుల సంక్షేమం కోసమే ఆలోచించారని, పాటుపడ్డారని ఒబామా పేర్కొన్నారు. ప్రతిభావంతుడైన ఆర్థికవేత్తగా, ప్రధానిగా ఆయన చేపట్టిన సంస్కరణలతో భారత్ లో లక్షలాది మంది పేదరికం నుంచి బయటపడ్డారని కొనియాడారు. తెలివైన, ఆలోచనాత్మకమైన, కపటం లేని నిజాయతీతో కూడిన వ్యక్తిత్వం మన్మోహన్‌ సింగ్ సొంతమని ఒబామా తన పుస్తకంలో రాసుకున్నారు.

Related posts

1971 యుద్ధ వీరుడు డీకే పారుల్కర్ కన్నుమూత…

Ram Narayana

శివరాత్రి వేడుకల్లో సద్గురుతో డీకే.. సొంత పార్టీలో విమర్శలు!

Ram Narayana

భారతీయుల ఇళ్లలో 34,600 టన్నుల బంగారం!

Ram Narayana