నితీష్ కుమార్ రెడ్డి శతకం పులకించిన ఇండియా …తండ్రి ఆనంద బాష్పాలు …
స్టేడియంలోనే ఉన్న తండ్రి
టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో ఆల్‌రౌండర్ శతకం
176 బంతులు ఎదుర్కొని 105 పరుగులు సాధించిన యువకెరటం
స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చిన టీమిండియా ఆటగాళ్లు
భావోద్వేగానికి గురైన నితీశ్ తండ్రి ముత్యాల రెడ్డి
ముగిసిన మూడవ రోజు ఆట.. భారత స్కోరు 358/9
తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి మరోసారి సత్తా చాటాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్‌లోని ప్రతిష్ఠాత్మక ఎంసీజీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో శతకం సాధించాడు. భారత జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో 176 బంతులు ఎదుర్కొని 105 పరుగులు సాధించాడు. ఇందులో 10 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. స్కాట్ బోలాండ్ ఓవర్‌లో బౌండరీ కొట్టి తనదైన శైలిలో శతకం పూర్తి చేసుకున్నాడు.
అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో నితీశ్ కుమార్ రెడ్డికి ఇదే తొలి సెంచరీ కావడంతో టీమిండియా ఆటగాళ్లు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఇతర ప్లేయర్లు అందరూ నిలబడి చప్పట్లు కొట్టారు. ఈ యువ ఆల్‌రౌండర్‌ను అభినందిస్తూ స్టేడియంలోని ప్రేక్షకులు కూడా చప్పట్లు కొట్టారు. టీమిండియా తీవ్ర కష్టాల్లో ఉన్న సమయంలో ఆడిన ఈ ఇన్నింగ్స్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.
అద్భుతమైన ఈ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ నమోదు చేసిన అతిపిన్న భారత క్రికెటర్లలో ఒకడిగా నితీశ్ కుమార్ రెడ్డి నిలిచాడు. 21 సంవత్సరాల 216 రోజుల వయసులో నితీశ్ శతకం నమోదయింది. అతడి కంటే ముందు సచిన్ టెండూల్కర్ (18 ఏళ్ల 256 రోజులు), రిషబ్ పంత్ (21 సంవత్సరాల 92 రోజులు) ఉన్నారు.
నితీశ్ సెంచరీపై తండ్రి భావోద్వేగం
నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీపై తండ్రి ముత్యాల రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. మైదానంలోనే ఉన్న ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో మాట్లాడుతూ ఆనంద బాష్పాలు కా ర్చారు. ‘‘మా కుటుంబానికి ఇది చాలా ప్రత్యేకమైన రోజు. మా జీవితంలో ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోలేము. నా కొడుకు 14-15 సంవత్సరాల వయసు నుంచే చక్కగా ఆడుతున్నాడు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్నాడు. నాకు ఇది చాలా ప్రత్యేకమైన అనుభూతి’’ అని అన్నారు. కాగా, నితీశ్ కుమార్ 99 పరుగుల వద్దకు చేరుకున్నప్పుడు భారత జట్టు 9 వికెట్లు కోల్పోయినప్పుడు ఎలా అనిపించిందని ప్రశ్నించగా… చాలా టెన్షన్ పడ్డానని ముత్యాలరెడ్డి చెప్పారు.
ముగిసిన మూడవ రోజు ఆట
కాగా, నితీశ్ రెడ్డి సెంచరీ పూర్తయిన వెంటనే వెలుతురు సరిగా లేకపోవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఆ కొద్దిసేపటికే మూడవ రోజు ఆట పూర్తయింది. ఆట ముగిసే సమయానికి భారత స్కోరు 358/9గా ఉంది. క్రీజులో నితీశ్ కుమార్ రెడ్డి 105, మహ్మద్ సిరాజ్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ మరో 116 పరుగులు వెనుకబడి ఉంది.
నితీశ్ కుమార్ రెడ్డిపై సీఎం చంద్రబాబు, విక్టరీ వెంకటేశ్ ప్రశంసల జల్లు
విశాఖపట్నం యువకుడికి అభినందనలు అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్
దేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేయాలంటూ ఆకాంక్షించిన ముఖ్యమంత్రి
అద్భుత ప్రదర్శన చేశాడంటూ విక్టరీ వెంకటేశ్ ప్రశంసల జల్లు
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్‌బోర్న్‌లోని ప్రతిష్ఠాత్మక ఎంసీజీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో అద్భుతమైన శతకం సాధించిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిపై ప్రశంసలు జల్లు కురుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడా నితీశ్‌కు అభినందనలు తెలిపారు.
‘‘నాలుగో టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధించిన విశాఖపట్నం యువకుడు కె. నితీశ్ కుమార్ రెడ్డికి నా అభినందనలు. టెస్టు మ్యాచ్‌లలో ఈ ఘనత సాధించిన భారతీయ క్రికెటర్లలో మూడో అతి పిన్న వయస్కుడు కూడా కావడం మరింత సంతోషం కలిగిస్తోంది. రంజీలో ఆంధ్రా తరపున ఎన్నో విజయాలు సాధించిన నితీశ్ కుమార్ రెడ్డి… అండర్ 16లో కూడా అద్భుత విజయాలు అందుకున్నాడు. ఇలాంటి సెంచరీలు మరిన్ని సాధించాలని, భారత క్రికెట్ జట్టుకు చక్కటి ప్రదర్శన చేసి దేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
విక్టరీ వెంకటేశ్ ప్రశంసలు
ఇక క్రికెట్‌ను ఎంతగానో ఇష్టపడే టాలీవుడ్ అగ్రనటుడు విక్టరీ వెంకటేశ్ కూడా నితీశ్ కుమార్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘‘అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ సాధించాడు. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తొలి టెస్ట్ సిరీస్‌లోనే నితీశ్ అద్భుత ప్రదర్శన చాలా గర్వంగా ఉంది’’ అంటూ వెంకటేశ్ పేర్కొన్నాడు.
నితీశ్… నువ్వు సాధించబోయే అనేక సెంచరీలకు ఇది నాంది: వీవీఎస్ లక్ష్మణ్
జట్టు కష్టాల్లో ఉన్న వేళ తిరుగులేని పట్టుదల కనబర్చిన యంగ్ బ్యాటర్
డియర్ నితీశ్… ఎంత చక్కగా ఆడావు అంటూ లక్ష్మణ్ స్పందన
ఆస్ట్రేలియా గడ్డపై నితీశ్ సాధించిన ఘనత పట్ల భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు. డియర్ నితీశ్… ఎంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడావు అని అభినందించాడు.
“జట్టు కష్టాల్లో ఉన్న వేళ అమోఘమైన ఆటతీరుతో ఆకట్టుకున్నావు. ఆస్ట్రేలియాలో టెస్టు సెంచరీ సాధించిన పిన్న వయస్కులైన భారత క్రికెటర్లలో నువ్వు మూడోవాడివి. నేను కచ్చితంగా చెప్పగలను… నువ్వు సాధించబోయే అనేక సెంచరీలకు ఇవాళ్టి శతకమే నాంది. భయం అనేది లేకుండా నువ్వు ఆడిన స్ట్రోక్ ప్లే, నీ సానుకూల దృక్పథాన్ని ఎంతో ఆస్వాదించాను. ఇక ముందు కూడా ఇలాగే ఆడాలి. దేవుడి ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి” అంటూ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు.
నితీశ్ కుమార్ ఫిఫ్టీ సెలబ్రేషన్ పై మైత్రీ మూవీ మేకర్స్ స్పందన
ఆసీస్ తో నాలుగో టెస్టులో నితీశ్ కుమార్ సూపర్ బ్యాటింగ్
తొలి ఫిఫ్టీనే సెంచరీగా మార్చుకున్న తెలుగుతేజం
‘తెలుగుబిడ్డ నుంచి వైల్డ్ ఫైర్ కొట్టుడు’ అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్
ఆంధ్రా క్రికెట్ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా టూర్ కోసం టీమిండియాకు ఎంపికైనప్పుడు… చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు. అయితే, ఈ టెస్టు సిరీస్ లో నితీశ్ స్కోర్లు చూస్తే ఆ సందేహాలు అన్నీ పటాపంచలు అయిపోతాయి. 41, 38 (నాటౌట్), 42, 42, 16, 105 (బ్యాటింగ్)…. ఇవీ మనవాడి బ్యాటింగ్ గణాంకాలు. బౌలింగ్ లోనూ తన వంతుగా 3 వికెట్లు తీశాడు.
, ఫిఫ్టీ సాధించిన అనంతరం నితీశ్ కుమార్ రెడ్డి పుష్ప స్టయిల్లో ‘తగ్గేదే లే’ అని బ్యాట్ తో సెలబ్రేట్ చేసుకోవడం అందరినీ అలరించింది. కామెంటేటర్లు కూడా “పుష్పా” అంటూ వ్యాఖ్యానించారు.
ఇక, నితీశ్ కుమార్ రెడ్డి అర్ధసెంచరీ సెలబ్రేషన్ పై పుష్ప, పుష్ప-2 చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది. ‘తెలుగు బిడ్డ నుంచి వైల్డ్ ఫైర్ కొట్టుడు’ అంటూ ట్వీట్ చేసింది. నితీశ్ ‘తగ్గేదే లే’ సెలబ్రేషన్ తాలూకు వీడియోను కూడా పంచుకుంది.
నితీశ్ కుమార్ రెడ్డికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నగదు బహుమతి
బీజీటీలో అద్భుతంగా రాణిస్తున్న తెలుగు కుర్రాడు
మెల్బోర్న్ టెస్టులో టాప్‌క్లాస్ బ్యాటింగ్‌తో తొలి టెస్టు సెంచరీ నమోదు
తాజాగా రూ. 25 లక్షల నగదు బహుమతి ప్రకటించిన ఏసీఏ
ఈ మేరకు ఏసీఏ ప్రెసిడెంట్, ఎంపీ కేశినేని శివనాథ్ ప్రకటన
అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో తొలి టెస్టు సెంచరీ చేసిన నితీశ్ కుమార్ రెడ్డికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నగదు బహుమతి ప్రకటించింది. ఏసీఏ ప్రెసిడెంట్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకం ప్రకటించారు. త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ నగదు బహుమతిని అందజేస్తామన్నారు.
ఈ సందర్భంగా, బీజీటీలో నితీశ్ రెడ్డి ఆల్‌రౌండర్ షోతో అదరగొడుతున్నాడని ఏసీఏ ప్రెసిడెంట్ మెచ్చుకున్నారు. నేటి యువతకు నితీశ్ ఆదర్శమని, ఇలాంటి యువ క్రికెటర్లను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్ లు ఆడేలా విశాఖ స్టేడియంను తీర్చిదిద్దుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అంతేగాక ఏపీకి కూడా ఐపీఎల్ టీమ్‌ను సిద్ధం చేసేలా ఏసీఏ ఆలోచన చేస్తోందన్నారు. ఇక దేశంలోనే అత్యాధునిక వసతులతో కూడిన స్టేడియంను రాజధాని అమరావతిలో నిర్మిస్తామని కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
మొదటి టెస్టు నుంచే నన్ను ఆకట్టుకున్నాడు: నితీశ్ టెస్టు సెంచరీపై సచిన్ స్పందన
సర్వత్రా ప్రశంసల వర్షం
నితీశ్ ను అభినందించిన సచిన్
ప్రశాంతంగా ఆడుతూనే టెంపర్ మెంట్ చూపిస్తున్నాడని కితాబు
నితీశ్ ఘనతపై భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా స్పందించాడు. నితీశ్ ఆడిన ఈ ఇన్నింగ్స్ గుర్తుండిపోతుందని ట్వీట్ చేశాడు.
“నితీశ్ నన్ను మొదటి నుంచి ఆకట్టుకున్నాడు. ప్రశాంతంగా ఆడుతూనే, తన టెంపర్ మెంట్ ను చూపిస్తున్నాడు. ఇవాళ తన ఆటతీరును ఉన్నతస్థాయికి తీసుకెళ్లి సిరీస్ లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక, వాషింగ్టన్ సుందర్ శక్తిమేర అద్భుతంగా ఆడి సహకారం అందించాడు… ఇద్దరూ బాగా ఆడారు” అంటూ సచిన్ అభినందించాడు.
భారత క్రికెట్ దిగ్గజం గవాస్కర్ స్టాండింగ్ ఒవేషన్…
నితీశ్ కుమార్ రెడ్డి బౌండరీతో శతకం పూర్తి చేయగానే కామెంట్రీ బాక్స్ లో ఉన్న భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చాడు. ఉత్సాహంతో ఉరకలేస్తూ కామెంట్రీ చెప్పాడు. సూపర్బ్ ఇన్నింగ్స్.. భారత క్రికెట్‌కు దొరికిన మరో యంగ్ టాలెంట్ అంటూ ప్రశంసించాడు. గ్రేట్ టాలెంట్, టెంపర్ మెంట్‌ల కలయిక అని కితాబిచ్చాడు. ఇలాంటి సెంచరీలు నితీశ్ రెడ్డి మరిన్ని సాధించాలని లిటిల్ మాస్టర్ ఆకాంక్షించాడు.