- విజయసాయి రాజీనామాను ఆమోదించిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కడ్
- రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మట్‌లో అందజేయడంతో వెంటనే ఆమోదం
- ఈ మేరకు బులెటిన్ విడుదల చేసిన రాజ్యసభ సెక్రటరీ జనరల్
విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ ఆమోదించారు. విజయసాయి తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మట్ లో అందజేయడంతో ఆ రాజీనామాను ఉప రాష్ట్రపతి వెంటనే ఆమోదించారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ బులెటిన్ విడుదల చేశారు.
కాగా రాజీనామా చేసిన తరువాత విజయసాయి మీడియాతో మాట్లాడుతూ… పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేశానని అన్నారు. ఇక భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడనని, పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు. తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా అప్రూవర్‌గా మారలేదని చెప్పిన విజయసాయి వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియవని పేర్కొన్నారు.
అదే సమయంలో కేసుల నుంచి బయటపడడానికే తాను రాజీనామా చేశానంటూ వస్తున్న విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు. ఎవరి చేతో కేసులు మాఫీ చేయించుకోవాల్సిన పరిస్థితుల్లో తాను లేనని చెప్పారు.
జగన్ కేసులో అప్రూవర్ గా మారాలని నాపై ఒత్తిడి చేశారు: విజయసాయి రెడ్డి

మీడియాతో మాట్లాడుతూ విజయసాయి కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ అధినేత జగన్ కేసులో అప్రూవర్ గా మారాలని తనపై ఎంతోమంది ఒత్తిడి చేశారని విజయసాయి తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకినాడ పోర్టు అంశంలో తనపై కేసు నమోదు చేశారని చెప్పారు. తనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారని తెలిపారు. కేవీ రావుతో తనకు సంబంధాలు లేవని చెప్పారు. విక్రాంత్ రెడ్డిని కేవీ రావు వద్దకు తాను పంపించలేదని అన్నారు. సీఐడీ తనను విచారణకు పిలవలేదని తెలిపారు.
తన రాజీనామాతో కూటమికే లాభమని చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకుంటే తాను బలహీనుడిగా మారుతానని… అలాంటప్పుడు రాజీనామా చేస్తే తనను కేసుల నుంచి ఎందుకు తప్పిస్తారని ప్రశ్నించారు. న్యూస్ ఛానల్ పెట్టే అంశంపై పునరాలోచన చేస్తానని చెప్పారు. బెంగళూరు, విజయవాడలో ఒక్కొక్క ఇల్లు, వైజాగ్ లో ఒక అపార్ట్ మెంట్… ఇవే తన ఆస్తులని తెలిపారు. బీజేపీ ఎంపీ పదవి గురించి కానీ, గవర్నర్ పదవి గురించి కానీ తనకు ఎవరి నుంచి ఎలాంటి హామీలు లేవని చెప్పారు.
తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి నిన్న ఎక్స్ వేదికగా వెల్లడించారు. అలాగే తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఈ రోజు రాజ్యసభ చైర్మన్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు.
విజయసాయిరెడ్డిని 2016లో వైసీపీ రాజ్యసభకు పంపించింది. 2022లో వైసీపీ అధినేత జగన్ మరోసారి విజయసాయిరెడ్డికి రాజ్యసభ అవకాశం ఇచ్చారు. ఆయన పదవీ కాలం 2028 వరకు ఉంది. కానీ మూడేళ్ల ముందే ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
రాజీనామాకు కారణం వ్యక్తిగతమే.. విజయసాయి రెడ్డి స్పష్టీకరణ

- జగన్ తో అన్నీ మాట్లాడాకే రాజీనామా చేశానన్న మాజీ ఎంపీ
- తన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారని వెల్లడి
- రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానని వివరణ
పదవుల కోసమో, కేసుల మాఫీ కోసమో తాను ఎంపీ పదవికి రాజీనామా చేయలేదని మాజీ ఎంపీ, వైసీపీ నేత విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి కారణం పూర్తిగా వ్యక్తిగతమని వివరణ ఇచ్చారు. దైవాన్ని నమ్మే వ్యక్తిగా అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం తనకు తెలియదన్నారు. కేసులను ధైర్యంగా ఎదుర్కొంటానని, దేనికీ ఎవరికీ భయపడబోనని తేల్చిచెప్పారు. శనివారం ఉదయం రాజ్యసభ చైర్మన్ (ఉపరాష్ట్రపతి)కి రాజీనామా పత్రం అందించానని, ఆయన ఆమోదం తెలిపారని విజయసాయి రెడ్డి తెలిపారు. రాజీనామా గురించి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తో ఫోన్ లో మాట్లాడానని చెప్పారు. అన్నీ వివరంగా మాట్లాడాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
ఇకపై తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. వైఎస్ కుటుంబంతో తనకు మూడు తరాలుగా అనుబంధం ఉందని గుర్తుచేశారు. వైఎస్ కుటుంబంతో తనకు ఎన్నడూ విభేదాలు లేవని, ఆ కుటుంబానికి తాను ఎన్నడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని తెలిపారు. నిరంతరం తాను పార్టీ కోసమే పనిచేశానని చెప్పారు. తన రాజీనామాపై జరుగుతున్న తప్పుడు ప్రచారం ఆపాలని విజయసాయి రెడ్డి మీడియాకు విజ్ఞప్తి చేశారు. కేవీ రావుతో తనకెలాంటి పరిచయం లేదని, ఎక్కడైనా ఎదురుపడితే నమస్కారం అంటే నమస్కారం అని పలకరించుకోవడం వరకేనని తెలిపారు.
తాను రాజకీయాల్లోకి ప్రవేశించిన రోజులు వేరు.. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు వేరని విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి, పార్టీకి తాను న్యాయం చేయలేననే భావనతోనే రాజీనామా చేశానని చెప్పారు. తనకన్నా మెరుగ్గా పనిచేసే నేత తన స్థానంలోకి వస్తే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందనే ఉద్దేశమే తప్ప వేరే కారణంలేదన్నారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో నమోదైన కేసులో ఈడీ తనను ఏ2 గా చేర్చించిందని చెప్పారు. ఆ కేసును తాను చట్టపరంగానే డీల్ చేస్తానని వివరించారు.
‘నా పిల్లల సాక్షిగా చెబుతున్నా.. కాకినాడ పోర్ట్ వ్యవహారంలో నాకు సంబంధం లేదు’ అని అన్నారు. ప్రస్తుతం తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేశానని, వైసీపీ పార్టీకి ఇంకా రాజీనామా చేయలేదని తెలిపారు. నేడో రేపో పార్టీకి కూడా రాజీనామా చేస్తానని విజయసాయి రెడ్డి వివరించారు. బెంగళూరులో ఒక ఇల్లు, విజయవాడలో ఉన్న రెండు ఇళ్లల్లో ఒకటి మాత్రమే తనదని, విశాఖపట్నంలో ఓ అపార్ట్ మెంట్ ఉందని.. ఇవికాకుండా తనకు ఎలాంటి ఆస్తులు లేవని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.
సమస్యలు ఉంటే చర్చించుకుందామని విజయసాయి రెడ్డికి చెప్పాను: వైసీపీ ఎంపీ గురుమూర్తి

- రాజీనామా చేయవద్దని విజయసాయిని కోరానన్న గురుమూర్తి
- ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో విజయసాయి చెప్పడం లేదని వెల్లడి
- పార్టీలోకి మళ్లీ తిరిగి రావాలని కోరానన్న వైసీపీ ఎంపీ
రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ కడ్ ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. రాజ్యసభ ఛైర్మన్ ను కలవడానికి ముందే విజయసాయి నివాసానికి వెళ్లి అయనను కలిశారు వైసీపీ ఎంపీ గురుమూర్తి.
ఈ సందర్భంగా మీడియాతో గురుమూర్తి మాట్లాడుతూ… రాజీనామా చేయవద్దని విజయసాయిని తాను కోరానని చెప్పారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో విజయసాయి చెప్పడం లేదని తెలిపారు. ఏవైనా చిన్నిచిన్ని లోపాలు, సమస్యలు ఉంటే చర్చించుకుని పరిష్కరించుకుందామని చెప్పానని వెల్లడించారు. 2029 ఎన్నికల్లో అందరం కలిసి పోటీ చేసేందుకు సమాయత్తమవుదామని చెప్పానని తెలిపారు. పార్టీలోకి తిరిగి రావాలని, రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని చెప్పారు.
విజయసాయి రెడ్డి రాజీనామా అంశం.. ఢిల్లీకి పిల్లి సుభాష్ చంద్రబోస్

- రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు విజయసాయి ప్రకటన
- ఒత్తిడితో రాజీనామా చేస్తానని చెప్పి ఉండొచ్చన్న సుభాష్ చంద్రబోస్
- వ్యాపారాలు ఉన్నవారికి ఒత్తిడి ఉంటుందని వ్యాఖ్య
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన వైసీపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆయన వెల్లడించారు. తన నిర్ణయం వెనుక ఎవరి ఒత్తిడి లేదని, ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని చెప్పారు. ఇకపై వ్యవసాయం చూసుకుంటానని తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ ఆదేశాలతో వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరారు. ఆయన మాట్లాడుతూ… ఒత్తిడితోనే రాజీనామా చేస్తానని విజయసాయి చెప్పి ఉండొచ్చని అన్నారు. వ్యాపారాలు ఉన్నవారికి ఒత్తిడి ఉంటుందని చెప్పారు.
విజయసాయిరెడ్డి రాజీనామాపై చంద్రబాబు రియాక్షన్

- పార్టీపై నమ్మకం లేకపోతే ఎవరైనా వెళ్లిపోతారన్న చంద్రబాబు
- పార్టీ పరిస్థితి కూడా ముఖ్యమని వ్యాఖ్య
- ఇది వైసీపీ వ్యక్తిగత అంశమన్న సీఎం
రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంపై ఏపీ ముఖ్యమంత్రి స్పందించారు. దావోస్ పర్యటన వివరాలను వెల్లడించేందుకు ఈరోజు చంద్రబాబు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయి రాజీనామా అంశాన్ని మీడియా ప్రతినిధులు లేవనెత్తగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎవరికైనా నమ్మకం ఉంటేనే పార్టీలో ఉంటారని… లేకపోతే వెళ్లిపోతారని చంద్రబాబు అన్నారు. పార్టీ పరిస్థితి కూడా చాలా ముఖ్యమని అన్నారు. ఇది వైసీపీ వ్యక్తిగత అంశమని చెప్పారు. వ్యక్తిగత కోపంతో వ్యవస్థలను నాశనం చేసిన పరిస్థితి ఏపీలో తప్ప దేశంలో మరెక్కడా లేదని అన్నారు. రాజకీయాల్లో ఉండేందుకు అర్హత లేని వ్యక్తులు వస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు.