పోసానిని పోలీసులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి…
ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో స్వయంగా విచారించిన ఎస్పీ
పోలీసుల విచారణలో పోసాని కృష్ణమురళి ఆసక్తికర సమాధానాలు!
తెలియదు, గుర్తులేదు, లవ్యూ రాజా అంటూ సమాధానాల దాటవేత

- ఓబులవారిపల్లె పీఎస్‌లో పోసానిని విచారించిన పోలీసులు
- ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో విచారణ
- రైల్వేకోడూరు కోర్టుకు తరలించి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన పోలీసులు
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి విచారణ ముగిసింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో సుమారు 9 గంటల పాటు పోసానిని విచారించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆయన దాటవేసే ప్రయత్నం చేసినట్లు సమాచారం.
విచారణ అనంతరం పోలీస్ స్టేషన్‌లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రైల్వే కోడూరు కోర్టుకు తరలించి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిన్న హైదరాబాద్‌లో అరెస్టు చేసి, ఆంధ్రప్రదేశ్‌కు తరలించిన విషయం తెలిసిందే.
సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జనసేన రాయలసీమ జోన్ కన్వీనర్ జోగిమణి ఫిర్యాదు మేరకు పోసానిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా జోగిమణి మాట్లాడుతూ… తమ నాయకుడు పవన్ కుటుంబ సభ్యుల గురించి పోసాని అనుచితంగా మాట్లాడుతుంటే… తాము కూడా అలాగే మాట్లాడాలనుకున్నామని, అయితే అలా మాట్లాడొద్దని పవన్ సూచించారని తెలిపారు. సంస్కారం అడ్డొచ్చి తాము అలా మాట్లాడలేదని… పోసాని ప్రవర్తన సరిగా లేకపోవడం వల్లే ఆయనపై ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని చెప్పారు.
పవన్ పై పోసాని చేసిన వ్యాఖ్యలు విని ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపానని జోగిమణి తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా పోసానిపై ఎన్నో ఫిర్యాదులు చేశామని… అప్పుడు తమ ఫిర్యాదులు తీసుకోలేదని చెప్పారు. ఇష్టానుసారం మాట్లాడడం సమంజసం కాదని… నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు.
మరోవైపు పీఎస్ లోకి వెళుతున్న సమయంలో… ‘పోసానిగారూ… మీ అరెస్ట్ గురించి ఏమైనా చెపుతారా?’ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… ఆయన సమాధానం ఇవ్వకుండా నమస్కారం పెడుతూ లోపలకి వెళ్లిపోయారు. ఓబులవారిపల్లె పీఎస్ వద్దకు పెద్ద సంఖ్యలో వైసీపీ వర్గీయులు చేరుకున్నారు. వీరందరినీ పీఎస్ నుంచి దూరంగా పోలీసులు పంపించారు. మరోవైపు పోసాని భార్య కుసుమలతకు వైసీపీ అధినేత జగన్ ఫోన్ చేసి పరామర్శించారు.
సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్ కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే పీఎస్ వద్ద ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. పీఎస్ వద్ద వాహనం దిగి లోపలకు వెళుతుండగా అకస్మాత్తుగా డ్రైవర్ వాహనాన్ని ముందుకు కదిలించాడు. దీంతో, వాహనం తగిలి పోసాని కిందకు పడపోబోయారు.
అయితే పక్కనే ఉన్న పోలీసులు పట్టుకోవడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. పోసాని సహా పోలీసు అధికారులు డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన పోలీస్ స్టేషన్ లోకి వెళ్లిపోయారు. పీఎస్ లో పోసాని విచారణ ఇంకా కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను దూషించారంటూ జనసేన నేత మణి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు… పోసానిని అరెస్ట్ చేశారు.
పోసాని కృష్ణమురళికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని డాక్టర్ గురుమహేశ్ తెలిపారు. పోలీసుల విచారణకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఆటంకం లేదని వెల్లడించారు. పోసానికి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు.
పోసాని కృష్ణమురళిని కలిసేందుకు ఆయన తరఫు న్యాయవాది నాగిరెడ్డి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. కానీ, పోలీసులు అనుమతించలేదు. అధికారుల అనుమతి లేకుండా లోనికి పంపించలేమని సీఐ చెప్పడంతో ఆయన వెనుదిరిగారు.
స్థానిక వైసీపీ నేత శ్రీనివాసులు తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. పోసానిని చూడాలని పోలీసులను కోరారు. అయితే, విధులకు ఆటంకం కలిగించవద్దని పోలీసులు చెప్పడంతో ఆయన వెనుదిరిగారు.