రోహిత్‌శర్మ లావుగా ఉంటాడు.. అదృష్టం కొద్దీ కెప్టెన్ అయ్యాడు..
- రోహిత్‌శర్మ ఒక సాధారణ ఆటగాడన్న షమా మహ్మద్
- సచిన్, కపిల్, ద్రవిడ్, ధోనీ, కోహ్లీ కంటే గొప్పవాడు కాదన్న కాంగ్రెస్ నాయకురాలు
- దేశానికి ప్రపంచకప్ అందించిన వ్యక్తిని పట్టుకుని అంతమాట అంటారా? అంటూ బీజేపీ ఫైర్
భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్‌శర్మపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతను లావుగా ఉంటాడని, అతడి ప్రదర్శన ఏమాత్రం ఆకట్టుకునేలా ఉండదని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఆకట్టుకోలేని కెప్టెన్ అతడేనని, బరువు తగ్గాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. బీజేపీ నేతలతోపాటు క్రికెట్ అభిమానుల కూడా ఆమె వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నారు.
సోషల్ మీడియా యూజర్ ఒకరు రోహిత్‌శర్మను ‘ప్రపంచస్థాయి ఆటగాడు’ అని కీర్తించాడు. దీనికి షమా స్పందిస్తూ.. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, కపిల్‌దేవ్ వంటి భారత దిగ్గజాలతో పోలిస్తే అతడెంత అని పేర్కొంటూ యూజర్ వ్యాఖ్యలను తోసి పుచ్చారు. ‘‘అతడి ప్రపంచస్థాయి ఏమిటి? ఒక సాధారణ కెప్టెన్. టీమిండియాకు కెప్టెన్‌గా ఉండే అదృష్టం పొందిన ఒక సాధారణ ఆటగాడు’’ అని పేర్కొన్నారు.
వెంటనే స్పందించిన బీజేపీ.. ప్రపంచకప్ విన్నర్‌పై ఇవేం మాటలంటూ దుమ్మెత్తి పోసింది. బాడీ షేమింగ్ తగదని హితవు పలికింది. కాంగ్రెస్ తీరే అంత అని, దశాబ్దాలుగా అది క్రీడాకారులను అవమానిస్తూనే ఉందని కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలో చేరిన రాధిక ఖేరా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీపైనా ఆమె విరుచుకుపడ్డారు. రోహిత్‌శర్మ తన జట్టును ప్రపంచకప్ విజయం వైపు నడిపిస్తే.. రాహుల్‌గాంధీ తన సొంత పార్టీని ఒక తాటిపైకి తీసుకురాలేక గందరగోళానికి గురవుతున్నారని విమర్శించారు. దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన క్రికెటర్‌ను లక్ష్యంగా చేసుకోవడం మాని కాంగ్రెస్ ఔచిత్యం, విశ్వసనీయత, ఎన్నికల విధానంపై దృష్టి సారించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్‌కు రాధిక సూచించారు.
కెప్టెన్ రోహిత్‌పై కాంగ్రెస్ నేత బాడీ షేమింగ్ వ్యాఖ్యలు.. స్పందించిన బీసీసీఐ!

భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్‌శర్మపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహ్మద్ బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారు. అతను లావుగా ఉంటాడని, బరువు తగ్గాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అతడి ప్రదర్శన ఏమాత్రం ఆకట్టుకునేలా ఉండదని, దేశ చరిత్రలో ఆకట్టుకోలేని కెప్టెన్ అతడేనని, అదృష్టం కొద్దీ కెప్టెన్ అయ్యాడంటూ ఆమె తన ఎక్స్ (ట్విట్టర్) పోస్టులో రాసుకొచ్చారు.
అలాగే సచిన్, ద్రావిడ్, ధోనీ, కోహ్లీ, కపిల్‌దేవ్ వంటి భారత దిగ్గజాలతో పోలిస్తే అతడెంత అని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. బీజేపీ నేతలతో పాటు క్రికెట్ అభిమానులు కూడా ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
తాజాగా బీసీసీఐ కూడా హిట్‌మ్యాన్‌పై షమా మహ్మద్ బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై స్పందించింది. టీమిండియా సారథిపై ఆమె వ్యాఖ్యలు దురదృష్టకరమని పేర్కొంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ ఇది చాలా దురదృష్టకరం అని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకురాలి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
ఒక అంతర్జాతీయ టోర్నమెంట్ జరుగుతున్న వేళ బాధ్యతాయుతమైన వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. ఆటగాళ్లందరూ అద్భుతంగా ఆడుతున్నారని దాని ఫలితాలు కూడా చూస్తున్నామని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు వ్యక్తిగతంగా ఆటగాడిపైనా లేదా జట్టుపై ప్రతికూల ప్రభావాన్ని చూపించి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత ప్రచారం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సైకియా హితవు పలికారు.
మరోవైపు తాను చేసిన వ్యాఖ్యలను షమా మహ్మద్ సమర్థించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. అది తాను చేసిన సాధారణ ట్వీట్ అని, రోహిత్‌ను బాడీ షేమ్ చేసే ఉద్దేశం తనకు లేదని పేర్కొన్నారు. తన అభిప్రాయం ప్రకారం రోహిత్ కొంచెం అధిక బరువు ఉన్నాడని మాత్రమే తాను చెప్పానని అన్నారు.
“ఇది ఒక క్రీడాకారుడి ఫిట్‌నెస్ గురించి ఒక సాధారణ ట్వీట్. ఇది బాడీ షేమింగ్ కాదు. ఒక క్రీడాకారుడు ఫిట్‌గా ఉండాలని నేను ఎప్పుడూ నమ్ముతాను. అతను కొంచెం అధిక బరువుతో ఉన్నాడని నేను భావించాను. అందుకే నేను దాని గురించి ట్వీట్ చేశాను. ఎటువంటి కారణం లేకుండా నాపై విమర్శల దాడి జరిగింది. నేను అతనిని మునుపటి కెప్టెన్లతో పోల్చి వ్యాఖ్యలు చేయడానికి నాకు హక్కు ఉంది. అలా చెప్పడంలో తప్పేముంది? ఇది ప్రజాస్వామ్యం” అని ఆమె అన్నారు.
రోహిత్ శర్మ లావుగా ఉన్నాడన్న కాంగ్రెస్ మహిళా నేత వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు చేసిన మాజీ స్పోర్ట్స్ జర్నలిస్టు, కాంగ్రెస్ మహిళా నాయకురాలు షామా మహ్మద్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. రోహిత్ శర్మ చాలా లావుగా ఉన్నాడని, ఆయన బరువు తగ్గాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. కపిల్ దేవ్, సచిన్, గంగూలీ, ధోనీ, ద్రావిడ్, కోహ్లీలతో పోలిస్తే సాధారణ ఆటగాడని కూడా అన్నారు. రోహిత్ శర్మ ఆకారంపై మాట్లాడిన కాంగ్రెస్ నాయకురాలిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ 90 ఎన్నికల్లో ఓడిపోయినా రాహుల్ గాంధీ కెప్టెన్సీ వారిని ఆకట్టుకుంటోందని, కానీ రోహిత్ శర్మ కెప్టెన్సీ మాత్రం ఆకట్టుకునేలా లేదా? అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి ఎద్దేవా చేశారు. అయినా రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేసే మీకు కెప్టెన్సీ విలువ ఏం తెలుస్తుందని చురక అంటించారు.
రాహుల్ గాంధీ నాయకత్వంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడుసార్లు డకౌట్ అయిందని బీజేపీ మరో నేత షెహజాద్ పానావాలా అన్నారు. డకౌట్ అయిన వాళ్లు రోహిత్ శర్మ గురించి మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు.
తాను చేసిన వ్యాఖ్యలను షామా మహ్మద్ సమర్థించుకున్నారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ తనకు ఉందని, రోహిత్ శర్మ ఫిట్‌నెస్ గురించి తాను సాధారణ ట్వీట్ మాత్రమే చేశానని, అది బాడీ షేమింగ్ కాదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక క్రీడాకారుడు ఫిట్‌గా ఉండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని అన్నారు. రోహిత్ శర్మ బరువు ఉన్నాడు కాబట్టే తాను ట్వీట్ చేశానని పేర్కొన్నారు.