pop francies
అంతర్జాతీయం

సంప్రదాయానికి భిన్నంగా పోప్ ఫ్రాన్సిస్ చివరి కోరిక

  • వాటికన్ వెలుపల తన అంత్య క్రియలు జరగాలన్న పాప్  ఫ్రాన్సిస్
  • సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో తన సమాధి వుండాలని కోరిక
  • ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేసిన పాప్  ఫ్రాన్సిస్

క్యాథలిక్ చర్చిల అధినేత పోప్ ఫ్రాన్సిస్ సంప్రదాయానికి భిన్నంగా తన చివరి కోరిక కోరుకున్నారు. తన అంత్యక్రియలకు సంబంధించి ఆయన కీలకమైన విషయాన్ని వెల్లడించారు. రోమ్‌లోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో తన సమాధి వుండాలన్నారు. 88 ఏళ్ళ  పోప్ ఫ్రాన్సిస్ నిన్న కన్ను మూసిన సంగతి తెలిసిందే. అయితే, శతాబ్దాలుగా వస్తున్న వాటికన్ సంప్రదాయానికి భిన్నంగా, తన మరణానంతరం భౌతికకాయాన్ని వాటికన్ నగరం వెలుపల రోమ్‌లోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో ఖననం చేయాలని కోరుకున్నారు. 2023 డిసెంబర్ 12న మెక్సికన్ టెలివిజన్ వార్తా సంస్థ ‘ఎన్+’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.  బాసిలికాతో ఆయనకున్న ప్రత్యేక అనుబంధం వల్ల ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. సాధారణంగా, మరణించిన పోప్‌ల భౌతిక కాయాలను వాటికన్ నగరంలోని సెయింట్ పీటర్స్ బాసిలికా నేలమాళిగల్లో ఖననం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, పోప్ ఫ్రాన్సిస్ ఈ సంప్రదాయాన్ని అనుసరించ కూడదని నిర్ణయించుకున్నారు. తన అంత్యక్రియల ఏర్పాట్లను సరళతరం చేయాలనే ఉద్దేశ్యంతో, వాటికి సంబంధించిన విషయాలను ఆర్చ్ బిషప్ డీగో జియోవని రవేలీతో ఇప్పటికే చర్చించినట్లు పోప్ ఫ్రాన్సిస్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రోమ్‌లోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికాతో పోప్ ఫ్రాన్సిస్‌కు గాఢమైన అనుబంధం ఉంది. ముఖ్యంగా, ఆ చర్చిలో కొలువైన ‘సేలస్ పోపులి రోమని’గా ప్రసిద్ధి చెందిన మేరీమాత, బాల ఏసు చిత్రాన్ని ఆయన ఎంతగానో ఆరాధిస్తారు. పోప్ హోదాలో విదేశీ పర్యటనలకు వెళ్లే ముందు, తిరిగి వచ్చిన తర్వాత ఆయన తప్పకుండా ఈ చిత్రం ముందు ప్రార్థనలు చేస్తుంటారు. ఈ ప్రత్యేక బంధమే తన చివరి విశ్రాంతి స్థలంగా బాసిలికాను ఎంచుకోవడానికి కారణమని తెలుస్తోంది. చారిత్రకంగా చూస్తే, పోప్‌లను వాటికన్ వెలుపల ఖననం చేయడం చాలా అరుదు. 1903లో మరణించిన పోప్ లియో-13 భౌతికకాయాన్ని మాత్రం ఆయన కోరిక మేరకు రోమ్‌లోని సెయింట్ జాన్ లేటరన్ బాసిలికాలో ఖననం చేశారు. ఇక సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో ఇప్పటివరకు ఆరుగురు పోప్‌ల అంత్యక్రియలు జరిగాయి. చివరిసారిగా 1669లో పోప్ క్లెమెంట్-9ను అక్కడ ఖననం చేశారు. సుమారు మూడున్నర శతాబ్దాల తర్వాత, పోప్ ఫ్రాన్సిస్ తన చివరి కోరిక ద్వారా మళ్లీ బాసిలికాకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు.

Related posts

ప్రపంచ సంపన్నుల కోసం యూఏఈ, అమెరికాల ఆకర్షణీయ వీసా పథకాలు

Ram Narayana

నిజ్జర్ హత్య కేసులో భారత్ సహకరిస్తేనే వాణిజ్య ఒప్పందాలపై చర్చలు ఉంటాయి: కెనడా

Ram Narayana

భారత్ తో కెనడా రహస్య చర్చలు?

Ram Narayana