తెలంగాణ వార్తలు

ఎల్కతుర్తి సభలో కాంగ్రెస్ పై కేసీఆర్ నిప్పులు …ఛత్తీస్ ఘడ్ లో ఆపరేషన్ కాగర్ ఆపాలని డిమాండ్ …ఇందుకోసం కేంద్రానికి లేఖ …

కాంగ్రెస్ పార్టీ అప్పుడూ విలనే… ఇప్పుడూ విలనే: ఎల్కతుర్తి సభలో కేసీఆర్

  • బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం
  • ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ
  • హాజరైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా తెలంగాణకు అసలైన విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీయేనని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.

తెలంగాణ ఉద్యమ చరిత్రను, కాంగ్రెస్ పార్టీ పాత్రను కేసీఆర్ తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు. “తెలంగాణ హైదరాబాద్ స్టేట్‌గా ఉన్నప్పుడు, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా ఆంధ్రతో కలిపింది కాంగ్రెస్ పార్టీ, ఆనాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ” అని కేసీఆర్ ఆరోపించారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడినప్పుడు, నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చి చంపిందని ఆయన విమర్శించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్, టీడీపీ నేతల వైఖరిని కూడా కేసీఆర్ తప్పుబట్టారు. “ఆనాడు కాంగ్రెస్, టీడీపీలలో ఉన్న నాయకులు పదవుల కోసం పెదవులు మూశారే తప్ప, ఏనాడూ తెలంగాణ కోసం నోరు తెరిచి కొట్లాడలేదు. గులాబీ జెండా ఎగిరే వరకు కనీసం తెలంగాణ సోయిని కూడా వారు ప్రదర్శించలేకపోయారు” అని అన్నారు. బీఆర్ఎస్ బిడ్డలే తెలంగాణ కోసం పదవులను త్యాగం చేశారని, కానీ కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం తెలంగాణను ఆగం చేశారని కేసీఆర్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసనసభలో ‘తెలంగాణ’ పదాన్నే నిషేధించారని, స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే ప్రణయ్ భాస్కర్ ‘తెలంగాణ’ అంటే.. దాన్ని కూడా నేరంగా పరిగణించే ప్రయత్నం జరిగిందని వివరించారు.

2001 తర్వాత తెలంగాణ ఉద్యమం పుంజుకున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసిందని కేసీఆర్ ఆరోపించారు. “మన బలాన్ని, ఊపును చూసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని నమ్మబలికి, 14 సంవత్సరాలు ఏడిపించారు. వాళ్ల మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు కాంగ్రెస్ గొంతు పట్టుకుంటే తప్ప దిగిరాలేదు. ప్రకటన చేసి మళ్లీ వెనక్కి వెళ్లారు. సకల జనుల సమ్మె, సాగర హారాలు, వంటా వార్పులు వంటి అనేక పోరాటాల తర్వాత, రాజకీయ అవసరాల రీత్యానే తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చారు” అని కేసీఆర్ అన్నారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతిని కేసీఆర్ వివరించారు. “ప్రజలు మాకు అధికారం ఇచ్చింది అనుభవించడానికి కాదు, బాధ్యతగా తీసుకున్నాం. ఒకప్పుడు వెనుకబడిన, ఎగతాళి చేయబడ్డ ప్రాంతంగా ఉన్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. రూ. 90 వేలుగా ఉన్న తలసరి ఆదాయాన్ని రూ. 3.50 లక్షలకు పెంచాం. జీఎస్‌డీపీలో దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా నిలిపాం. అనేక పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నాం” అని కేసీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ వేదికగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ, తమ ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించారు.

ఎల్కతుర్తి సభలో కాంగ్రెస్ పై కేసీఆర్ నిప్పులు …ఛత్తీస్ ఘడ్ లో ఆపరేషన్ కాగర్ ఆపాలని డిమాండ్ …ఇందుకోసం కేంద్రానికి లేఖ …

ఛత్తీస్ ఘడ్ లో ఆపరేషన్ పేరుతో మనుషులను చంపడం ప్రజాస్వామ్యం కాదని అన్నారు …వారితో చర్చలు జరపడాన్ని ఆపరేషన్ కాగర్ ఆపాలని కేసీఆర్ డిమాండ్ చేశారు …ఇందుకోసం కేంద్రానికి లేఖ రాద్దామా…? అని సభికులను ప్రశ్నించారు …అందరు ముక్త కంఠంతో ఆమోదం తెలిపారు …

సభకు లక్షలాదిగా జనం…

బీఆర్ యస్ స్వర్ణోత్సవ సభకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చారు ..

ఎల్కతుర్తి సభలో రామాయణం చెప్పిన కేసీఆర్

KCRs Ramayana Analogy at BRS Silver Jubilee

తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిని వివరిస్తూ, కేసీఆర్ రామాయణంలోని ఓ ఘట్టాన్ని ఉదహరించారు. రావణ సంహారం తర్వాత లంకను చూసి, అది సువర్ణమయంగా ఉందని, అయోధ్యకు బదులు అక్కడే ఉండి పరిపాలన చేద్దామని లక్ష్మణుడు సహా పలువురు సూచించగా, శ్రీరాముడు అంగీకరించలేదని కేసీఆర్ తెలిపారు. “జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి” అన్న సూక్తిని గుర్తు చేస్తూ, కన్నతల్లిని, జన్మభూమిని మించిన స్వర్గం లేదని, అందుకే రాముడు అయోధ్యకు తిరిగి వచ్చారని వివరించారు. అదే స్ఫూర్తితో, వలసవాదుల కబంధ హస్తాల్లో నలిగిపోతున్న, ఆత్మహత్యలు, వలసలతో నిండిన తెలంగాణ విముక్తి కోసం, స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా తాను ఒక్కడినే బయలుదేరి ఉద్యమానికి శ్రీకారం చుట్టానని కేసీఆర్ పేర్కొన్నారు.

25 ఏళ్ల క్రితం ఎగిరిన గులాబీ జెండా ప్రస్థానంలో ఎన్నో అవమానాలు, ఎగతాళి, అవహేళనలు ఎదుర్కొన్నామని కేసీఆర్ అన్నారు. “మఖలో పుట్టింది పుబ్బలో పోతుంది” అని కొందరు అన్నా, అనేక మంది త్యాగాలు, వందలాది మంది బలిదానాలు, అద్భుతమైన ఉద్యమాలతో యావత్ తెలంగాణ ఏకతాటిపై నిలిచిందని తెలిపారు. ఒకానొక దశలో తెలంగాణ మొత్తం బరిగీసి నిలబడి తమ రాష్ట్రం తమకు కావాలని డిమాండ్ చేసే పరిస్థితిని సృష్టించామని, చివరికి రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఆయన గుర్తు చేశారు.

ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన తర్వాత, పదేళ్ల పాటు అద్భుతమైన పాలన అందించి, అందరూ బిత్తరపోయేలా, ఆశ్చర్యపోయేలా తెలంగాణను నిర్మాణం చేసుకున్నామని కేసీఆర్ తెలిపారు. పార్టీ 25 ఏళ్ల సుదీర్ఘ చరిత్రను పురస్కరించుకుని వరంగల్‌లో రజతోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా వరంగల్ గడ్డ ప్రాశస్త్యాన్ని కేసీఆర్ కొనియాడారు. రాణి రుద్రమ ఏలిన వీరగడ్డ, సమ్మక్క సారక్కల పోరాటాలకు నెలవైన నేల, బమ్మెర పోతన కవిత్వ మాధుర్యాన్ని పంచిన జీవగడ్డ అయిన వరంగల్ నేలకు వందనం చేస్తున్నానని చెప్పారు. 

ఈ రాత్రి మీ డైరీల్లో రాసుకోండి… మళ్లీ వచ్చేది మేమే: కేసీఆర్

KCRs Stern Warning to Telangana Police

 బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ పోలీసులకు తీవ్ర స్థాయిలో హెచ్చరిక జారీ చేశారు. తమ పార్టీ శ్రేణులపై అన్యాయంగా, అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తూ, పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వ్యవహార శైలిని తప్పుబట్టారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని కేసీఆర్ విమర్శించారు. “ఈ రోజు సభ పెట్టుకుంటే ఎన్ని అడ్డంకులు సృష్టించారు? సభకు బస్సులు ఇచ్చిన ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారు. ఆర్టీఏ, పోలీసు అధికారులతో అడుగడుగునా చెక్‌పోస్టులు పెట్టి, ట్రాఫిక్ జామ్ చేశారు. దీనివల్ల లక్షలాది మంది హన్మకొండ, హుజూరాబాద్, సిద్దిపేట వైపు రోడ్లపైనే ఆగిపోయారు” అని కేసీఆర్ ఆరోపించారు. ఇంత కక్ష సాధింపు చర్యలా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుందని కేసీఆర్ నొక్కి చెప్పారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్లు ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతున్నారని, వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. “పోలీసు మిత్రులకు నేను ఒక్కటే మనవి చేస్తున్నా. మీరెందుకు అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారు? మీకు ఏం సంబంధం? మీ డ్యూటీ మీరు చేయండి” అంటూ పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. “ఈ రోజు రాత్రి మీ డైరీల్లో రాసి పెట్టుకోండి. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు. అది ఎవడి తరమూ కాదు” అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.

బీఆర్ఎస్ శ్రేణులపై ఎక్కడైనా అన్యాయంగా కేసులు పెడితే ఊరుకునేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. పార్టీకి బలమైన లీగల్ సెల్ ఉందని, కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. “న్యాయస్థానాలు ఉన్నాయి, అక్కడ పోరాటం చేద్దాం. మీకు అండగా కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. నేను కూడా దీనిని వదిలిపెట్టను. ఎవరేంటో తేలుస్తాం” అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ రకంగా అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన సూచించారు.

ఎల్కతుర్తి సభ: రేవంత్ సర్కారుపై కేసీఆర్ విసుర్లు

KCR Attacks Revanth Reddy Govt

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేసిందని, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించిందని విమర్శించారు. “ఏమేమి చెప్పిరి.. ఎన్నెన్ని చెప్పిరి.. అబ‌ద్ధాలు చెప్ప‌డంలో కాంగ్రెస్‌ వాళ్లను మించినోళ్లు లేరు” అని ఆయన వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం రైతు బంధు కింద రూ.10,000 ఇస్తే, కాంగ్రెస్ రూ.15,000 ఇస్తామని చెప్పిందని, అలాగే పింఛన్లను రూ.2,000 నుంచి రూ.4,000కు పెంచుతామని, ఇంట్లో ఇద్దరు అర్హులుంటే ఇద్దరికీ ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని ఆరోపించారు.

దివ్యాంగులకు తమ ప్రభుత్వం రూ.4,000 పింఛన్ ఇస్తే, దానిని రూ.6,000 చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని కేసీఆర్ గుర్తు చేశారు. ఆడపిల్లలకు స్కూటీలు, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా కార్డులు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. డిసెంబర్ 9న ఒకే కలంపోటుతో రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి, ఇంతవరకు అమలు చేయలేదని దుయ్యబట్టారు. వరి ధాన్యం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామన్న హామీ కూడా నెరవేరలేదని విమర్శించారు. తమ బీఆర్ఎస్ ప్రభుత్వం నష్టం వచ్చినా తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇవ్వడంలో విఫలమైందని అన్నారు.

కల్యాణలక్ష్మి కింద తాము ఇచ్చే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అదనంగా ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, ఆ హామీ ఏమైందని కేసీఆర్ నిలదీశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు 420 హామీలు ఇచ్చారని, సిగ్గు లేకుండా బాండ్ పేపర్లు కూడా రాసిచ్చారని, కానీ వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. “హామీలు ఎలా అమలు చేస్తారని అడిగితే.. చేసి చూపిస్తాం, మాది పెద్ద పార్టీ అని జబ్బలు చరిచారు. కానీ చేసి చూపించలేదు” అని కేసీఆర్ అన్నారు.

ఉచిత బస్సు పథకం వల్ల మహిళల మధ్య గొడవలు జరుగుతున్నాయే తప్ప పెద్దగా ఉపయోగం లేదని, ఆ పథకం తమకు వద్దని మహిళలే అంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ పైన, తనపైన నిందలు వేస్తున్నారని, అడ్డగోలు మాటలతో ప్రజలను ఘోరంగా మోసం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారానికి ఢిల్లీ నుంచి డూప్లికేట్ గాంధీలు కూడా వచ్చారని ఆయన ఎద్దేవా చేశారు.

Related posts

జ‌ర్న‌లిస్టులకు కేటాయించిన‌ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా… 38 ఎక‌రాల భూమి చుట్టూ కంచె నిర్మాణం

Ram Narayana

తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్ అరెస్ట్… తీవ్రంగా స్పందించిన కేటీఆర్

Ram Narayana

ముఖ్యమంత్రికి లేఖ రాసి… చెట్టుకు వేలాడుతూ యువకుడి నిరసన!

Ram Narayana