భారాస అధినేత కేసీఆర్ మనసంతా విషంతో నిండిపోయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆయన ప్రసంగం మొత్తంలో కాంగ్రెస్‌ను విలన్‌లా చిత్రీకరించడం తప్ప ఇంకేమీ లేదని విమర్శించారు. మంచి సలహాలు, సూచనలు ఇస్తారేమోనని కేసీఆర్ ప్రసంగం విన్నామని, అందులో ఏమీ లేదని ఎద్దేవా చేశారు. భారాస రజతోత్సవాల సందర్భంగా ఎల్కతుర్తిలో కేసీఆర్ చేసిన ప్రసంగంపై పొంగులేటి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తీరును తప్పు బట్టారు. గత సీఎం పరిపాలన వల్ల ధనిక రాష్ట్రం అప్పులపాలైందన్నారు. అప్పులున్నా .. ప్రజలకు సంక్షేమం అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ను విలన్‌గా చిత్రీకరిస్తున్నారని కడుపంతా విషం నింపుకొని కేసీఆర్ మాట్లాడటం బాధ కలిగించిందని పేర్కొన్నారు. రెండు సార్లు భారాసకు అధికారం ఇస్తే.. ఎలా కొల్ల గొట్టారో ప్రజలు గమనించారన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మంచి సలహాలు ఇస్తారని ఎదురుచూశామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఐదారు పర్యాయాలు అసెంబ్లీ జరిగినప్పటికీ, కేవలం రెండుసార్లే కేసీఆర్ వచ్చారని, అధికారంలో ఉన్నప్పుడు సచివాలయానికి కూడా కేసీఆర్ వెళ్లలేదని అన్నారు. కేసీఆర్ దొర మాదిరిగా పరిపాలిస్తే .. మా ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు అందుబాటులో ఉందని చెప్పారు. ప్రజలకు కాంగ్రెస్ అందిస్తున్న మంచి పాలన చూసి తట్టుకో లేక కేసీఆర్ విషం కక్కారన్నారు. గతంలో వరి వేస్తే ఉరి అని చెప్పి, కేసీఆర్ మాత్రం 150 ఎకరాల్లో వరి వేశారన్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. గత భారాస ప్రభుత్వం కాంట్రాక్టర్లకు రూ.82 వేల కోట్లు బకాయిలు పెట్టిందన్నారు. సర్పంచులకు కాంగ్రెస్ బకాయిలు పెట్టిందని కేసీఆర్ అంటున్నారు కానీ, మా ప్రభుత్వం వచ్చాక సర్పంచులే లేరన్నారు. మా ప్రభుత్వంలో సర్పంచులు ఒక్క రూపాయి పని కూడా చేయ లేదన్నారు. అధికారంలోకి రావాలని కేసీఆర్ పగటికలలు కంటున్నారనిఅన్నారు. భారాస సభకు ఆటంకాలు సృష్టించామని కేసీఆర్ ఆరోపించారు. సభకు అసలు ఆటంకం సృష్టించ లేదని, మేం ఇబ్బంది పెట్టి ఉంటే సభ జరిగేదా? ఆ పార్టీ నేతలు అడిగినన్ని బస్సులను సభకు పంపాంమని చెప్పారు. గత సీఎం పరిపాలన వల్ల ధనిక రాష్ట్రం అప్పులపాలైందని శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు.
previous post
next post