నెల రోజుల్లోనే హెల్త్ కార్డులు అందిస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి
ప్రజలందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి… గురువారం విద్యానగర్ లోని దుర్గాబాయ్ దేశ్ ముఖ్ రెనెవా క్యాన్సర్ ఆసుపత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెలరోజుల్లోనే ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. సామాన్య ప్రజలకు కూడా మెరుగైన వైద్యసేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. సాధారణ ప్రజలు అనారోగ్యం పాలైన ప్రతిసారి టెస్టులకే వేల రూపాయల ఖర్చు అవుతోందని, ఇది సామన్యులకు మరింత భారంగా మారుతోందని తెలియజేశారు. హెల్త్ కార్డులు ఉండటం వలన హెల్త్ ప్రొఫైల్ సులువుగా అర్థమయ్యి చికిత్స సులభం అవుతుందని సీఎం అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ ముందు చూపు వల్లే దేశంలో వైద్య రంగం గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. క్యాన్సర్ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన చాలా తక్కువని.. క్యాన్సర్ వ్యాధికి వైద్య సదుపాయాలు మన దగ్గర తక్కువగా ఉన్నాయని, చికిత్సకు అయ్యే ఖర్చు మాత్రం సామాన్యులకు అందుబాటులో లేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మరిన్ని క్యాన్సర్ ఆసుపత్రులు ఏర్పాటు జరగాలని, సామాన్యులకు కూడా క్యాన్సర్ చికిత్సలు అందుబాటులోకి రావాలని సీఎం ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.