జాతీయ వార్తలు

ఉగ్రదాడిపై బీబీసీ తప్పుడు కథనాలు… తీవ్రంగా స్పందిస్తూ లేఖ రాసిన కేంద్ర ప్రభుత్వం!

  • పహల్గామ్ దాడిపై వక్రీకరించే కథనం రాసిన బీబీసీ
  • ఉగ్రదాడిని ‘మిలిటెంట్ దాడి’గా పేర్కొన్న బీబీసీ
  • బీబీసీ ఇండియా హెడ్‌కు కేంద్ర విదేశాంగ శాఖ లేఖ

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన భీకర ఉగ్రదాడికి సంబంధించి ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ ప్రచురించిన ఒక కథనంపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ దాడిని ‘మిలిటెంట్ దాడి’గా అభివర్ణించడాన్ని తప్పుబడుతూ, బీబీసీ పక్షపాత ధోరణిని ప్రదర్శిస్తోందని ఆక్షేపించింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ, బీబీసీ ఇండియా విభాగాధిపతి జాకీ మార్టిన్‌కు లేఖ రాసింది.

“కశ్మీర్‌లో దాడి తర్వాత పాకిస్థాన్ వీసాలను భారత్ రద్దు చేసింది” అనే శీర్షికతో బీబీసీ ప్రచురించిన కథనంలో, పహల్గామ్ ఘటనను ఉగ్రవాద చర్యగా పేర్కొనడానికి బదులుగా “మిలిటెంట్ దాడి” అని ప్రస్తావించడంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఇది వాస్తవాలను వక్రీకరించడమేనని, బాధితుల పట్ల అగౌరవాన్ని సూచిస్తుందని లేఖలో పేర్కొంది. ఉగ్రదాడి తీవ్రతను తగ్గించి చూపించే ప్రయత్నం చేశారని విమర్శించింది.

వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలని బీబీసీకి సూచిస్తూ, ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన దాడికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా విదేశాంగ శాఖ తమ లేఖతో పాటు పంపింది. ఆ రోజు పట్టపగలు, రద్దీగా ఉన్న ప్రాంతంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి.

అంతర్జాతీయ మీడియా సంస్థలు పహల్గామ్ దాడి విషయంలో ఇలా వివాదాస్పద పదజాలం వాడటం ఇదే మొదటిసారి కాదు. కొద్ది రోజుల క్రితం, అమెరికాకు చెందిన ‘ది న్యూయార్క్ టైమ్స్’ పత్రిక కూడా ఈ దాడిని ‘మిలిటెంట్ దాడి’గానే అభివర్ణించింది. దీనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు రావడంతో పాటు, అమెరికా విదేశాంగ శాఖ కూడా జోక్యం చేసుకుని అది ‘ఉగ్రవాద దాడి’ అని స్పష్టం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు బీబీసీ కూడా అదే బాటలో నడవడంపై భారత ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

పహల్గామ్ దాడి విషయంలో బీబీసీ అనుసరిస్తున్న వైఖరి, వారి ఉద్దేశాలను నిశితంగా పరిశీలిస్తున్నామని విదేశాంగ శాఖ వర్గాలు స్పష్టం చేసినట్లు సమాచారం. ఉగ్రవాదం వంటి సున్నితమైన అంశాలపై వార్తా కథనాలు ప్రచురించేటప్పుడు అంతర్జాతీయ మీడియా సంస్థలు మరింత బాధ్యతాయుతంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని భారత్ ఆశిస్తోంది. 

పహల్గామ్ ఉగ్రదాడిపై అభ్యంతరకర పోస్టులు.. ఫోక్ సింగర్ నేహాసింగ్‌పై దేశద్రోహం కేసు

Neha Singh Rathore Booked for Sedition
  • నేహాసింగ్‌పై పిర్యాదు చేసిన ప్రతాప్‌సింగ్ అనే వ్యక్తి
  • భారత జాతీయ సమగ్రతకు ముప్పు వాటిల్లేలా ఆమె పోస్టులు పెట్టారని ఆరోపణ
  • బీఎన్ఎస్ కింద పలు అభియోగాలు నమోదు
  • సమాచార సాంకేతిక చట్టం కింద కూడా కేసు నమోదు చేసిన పోలీసులు

పహల్గామ్ ఉగ్రదాడి ఘటన అనంతరం సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జానపద గాయని నేహాసింగ్ రాథోడ్‌పై లక్నో పోలీసులు దేశద్రోహ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అభయ్ ప్రతాప్‌సింగ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నేహాసింగ్ తన ఎక్స్ ఖాతాలో జాతీయ సమగ్రతపై ప్రతికూల ప్రభావం చూపే కొన్ని అభ్యంతరకర పోస్టులు పెట్టినట్టు పేర్కొన్నారు. మతం ఆధారంగా ఒక సమాజంపై మరో సమాజాన్ని రెచ్చగొట్టేలా పదేపదే ప్రయత్నించారని ఆరోపించారు. 

గాయని నేహాసింగ్‌పై లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద ఆమెపై పలు అభియోగాలు నమోదయ్యాయి. వాటిలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రశాంతతకు భంగం కలిగించడం, భారతదేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతకు హాని కలిగించడం వంటివి ఉన్నాయి. ఆమెపై సమాచార సాంకేతిక చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.  

Related posts

 పక్షులపై ప్రేమ.. తమిళనాడులోని ఈ గ్రామస్థుల దీపావళి అందరికీ ఆదర్శం!

Ram Narayana

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధింపు…

Ram Narayana

పండంటి కాపురాన్ని కూల్చిన టమాటా.. ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఇల్లాలు

Drukpadam