Pok madrasas
జాతీయ వార్తలు

పీఓకే లో 1000కి పైగా మదర్సాల మూసి వేత

  • కనీసం10 రోజులు సెలవులు ప్రకటించిన స్థానిక అధికార యంత్రాంగం
  • భారత్ దాడులు చేయొచ్చనే భయంతోనే ఈ చర్యలని కథనాలు

పాక్ ఆక్రమిత కశ్మీర్ ( పీఓకే )లో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్థానిక అధికార యంత్రాంగం శుక్రవారం దాదాపు 1000కి పైగా మదర్సాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కనీసం10 రోజుల పాటు ఈ మదర్సాలకు సెలవులు ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇటీవల కశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయక పౌరులపై జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో భారత్ ప్రతీకార దాడులకు దిగవచ్చని, ముఖ్యంగా గతంలో ఉగ్రవాద స్థావరాలుగా ఆరోపణలు ఎదుర్కొన్న మదర్సాలను లక్ష్యంగా చేసుకోవచ్చని పాకిస్థాన్ భయపడుతున్నట్లు సమాచారం. 2019 లో బాలా కోట్‌పై భారత వైమానిక దళం జరిపిన దాడుల తరహాలోనే ఇప్పుడు కూడా దాడులు జరగవచ్చని స్థానికులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి, ప్రభుత్వ ఆదేశాల మేరకే మదర్సాలను మూసి వేసినట్లు ధృవీకరించారు. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ ఇప్పటికే గిల్గిత్, స్కర్డులకు వెళ్లే పలు దేశీయ విమాన సర్వీసులను రద్దు చేసింది. ఉత్తర ప్రాంతాలకు వెళ్లే ఇతర విమానాలను కూడా ముందు జాగ్రత్త చర్యగా తాత్కాలికంగా నిలిపి వేసినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా భారత్ మీదుగా వచ్చే విదేశీ విమానాలపై కఠిన నిఘా పెట్టినట్లు పాక్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (సీఏఏ) వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, మతపరమైన సంస్థల ముసుగులో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని భారత్ ఆరోపిస్తోంది. పహల్గామ్ దాడి వెనుక పాక్ హస్తం ఉందని కూడా ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను పాకిస్థాన్ ఖండించింది. సింధు జలాల ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకుని భారత్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ఎదురుదాడికి దిగింది. తమపై దాడికి ప్రయత్నిస్తే తక్షణమే గట్టిగా బదులిస్తామని పాకిస్థాన్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి భారత్‌ను హెచ్చరించారు. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ సైనిక విన్యాసాలను కూడా ముమ్మరం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

అమెరికాకు పంజాబ్ యూనివర్సిటీ షాక్.. క్యాంపస్‌లో యూఎస్ బ్రాండ్స్ కోక్, పెప్సీ అమ్మకాల బంద్!

Ram Narayana

ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు…

Ram Narayana

చీఫ్ జస్టిస్ కొడుక్కి.. కూలీ కొడుక్కి ఒకే న్యాయమా?: మాజీ సీజేఐ గవాయ్

Ram Narayana