- ఉద్యోగ సంఘాల సమరంపై తీవ్ర ఆగ్రహం
- ‘ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు? మీకు బాధ్యత లేదా?’అని సూటి ప్రశ్న
నన్ను కోసినా నెలకు తెలంగాణ ఆదాయం రూ. 18,500 కోట్లే వస్తుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం పోరు బాట పడతామని ప్రభుత్వ ఉగ్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ చేసిన ప్రకటనపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు సమరం అని ప్రకటించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు? మీకు బాధ్యత లేదా?’ అని ఉద్యోగ సంఘాల నాయకులను ప్రశ్నించారు. ఇవాళ హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం మీడియాతో మాట్లాడుతూ.. రూ. 100 పెట్రోల్ రూ.200 చేయమంటారా ? రూ. 30 బియ్యం రూ. 60 చేద్దామా ? బోనస్‌లు, జీతాల పెంపు ఎలా చేయాలో ఉద్యోగ సంఘాలే చెప్పాలన్నారు. 11 శాతం మిత్తికి అప్పు తెచ్చిన కేసీఆర్ రాష్ట్రాన్ని దివాళా తీయించి తీసి ఫామ్‌హౌస్‌లో పడుకున్నాడని విమర్శించారు. ఏదైనా సమస్య ఉంటే చర్చలకు రావాలని, అంతేకాని రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారవద్దని సూచించారు.
నెలకు రూ. 7 వేల కోట్ల అసలు, వడ్డీ
గడిచిన పదేళ్లలో ఏ ప్రభుత్వ ఉద్యోగి ఒకటో తేదీన జీతాలు తీసుకోలేదన్నారు. ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారి పోయిందన్నారు. ఈ 16 నెలల కాలంలో తాము రూ. 1.58 లక్షల కోట్ల అప్పులు తెస్తే కేసీఆర్ చేసిన అప్పు, వడ్డీకి కలిసి 7 డిసెంబర్ 2023 నుంచి 31 మార్చి 2025 నాటికి 1.52 వేల కోట్లు చెల్లించామని సీఎం తెలిపారు. తాము తెచ్చిన ఏ ఒక్క రూపాయి కూడా ప్రజా సంక్షేమం, ప్రభుత్వ ఉద్యోగుల కోసం వాడలేదన్నారు. కేసీఆర్ తమ ప్రభుత్వంపై మోపిన రూ. 8.29 లక్షల కోట్ల బకాయిలు చెల్లించామన్నారు. ప్రస్తుతం నెలకు రూ. 7 వేల కోట్ల అసలు, వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు.
అణాపైసా అప్పు పుట్టడం లేదు
అణాపైసా అప్పుపుట్టడం లేదని సిఎం రేవంత్ అన్నారు. అప్పుల కోసం బ్యాంకుల వద్దకు వెళితే దొంగలను చూసినట్లు చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా చెబితే ఎవరూ నమ్మడం లేదు.. కానీ పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా ఉందని అన్నారు. స్వీయ నియంత్రణ మాత్రమే దీనికి సరైన పరిష్కారం అని అన్నారు. స్వీయ నియంత్రణ లేకపోతే రాష్ట్రం మరింత దివాళా తీయడం ఖాయమని అన్నారు. తాను నల్లమల బిడ్డను అని.. దోచుకునే స్వభావం తనది కాదని తెలిపారు. వ్యక్తిగత ఆదాయం తనకు అవసరం లేదని.. సీఎంగా పనిచేస్తున్నాను.. బాధ్యతగా ఉంటాను.. ఉన్నదే చెబుతా.. ఏదీ దాచిపెట్టను అని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. ఇప్పటివరకు ఎక్కడా దుబారా ఖర్చు చేయలేదని అన్నారు.. చాలా పొదుపుగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. గత పదేళ్లలో ఎప్పుడూ ఇవ్వని విధంగా.. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని అన్నారు. ఉద్యోగులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారొద్దని సూచించారు. ఉద్యోగుల డిమాండ్ల కోసం ప్రజలపై సమరం చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పుడు అమలు చేస్తున్న ఏ సంక్షేమ పథకం ఆపి మీ డిమాండ్లు నెరవేర్చాలో చెప్పండి అని ఉద్యోగులను సీఎం రేవంత్ రెడ్డి అడిగారు.