Thummala Nageswara Rao
తెలుగు రాష్ట్రాలు

4 నెలల్లో యాతాలకుంట టన్నెల్ పూర్తి చేయాలి

  • 5 నియోజకవర్గాలకు ఈ ఏడాదే  సీతారామ నీళ్ళు ఇవ్వాలి
  • రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశం

సీతారామ ఎత్తి పోతల పథకంలో భాగమైన యాతాల కుంట టన్నెల్ పనులను 4 నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికార్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన సత్తుపల్లి మండలంలోని యాతాలకుంటలో సీతారామ ప్రాజెక్టు క్రింద నిర్మిస్తున్న టన్నెల్ నిర్మాణ పనులను పరిశీలించి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లు ముజమ్మిల్ ఖాన్, జితేష్ వి. పాటిల్, అశ్వారావు పేట, సత్తుపల్లి ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, మట్టా రాగమయిలతో కలిసి అధికార్లతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ సత్తుపల్లి ట్రంక్ టన్నెల్ 1.8 కిలో మీటర్లకు గాను 1.2 కిలో మీటర్లు పూర్తయిందని, పెండింగ్ ఉన్న 600 మీటర్ల పనులు 4 నెలల్లో పూర్తి చేయాలని, అవసరమైతే మరో నిచ్చెన పెట్టుకోవాలని సూచించారు. అప్పటి లోపు అవసరమైన అక్వడెట్లు, ఇతర నిర్మాణాలు పూర్తి చేయాలని, శాసన సభ్యులను సమన్వయం చేసుకుంటూ అవసరమైన భూ సేకరణ చేపట్టాలన్నారు. రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా, రాబోయే వానా కాలం దుమ్ముగూడెం ఆనకట్టకు గోదావరి నీరు రాగానే వైరా ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలన్నారు. అలాగే, పినపాక నియోజక వర్గంలోని తుమ్మల పల్లి వద్ద గల మారేడు పాక ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి 25 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలని, కొత్తగూడెం నియోజక వర్గంలో యూటిలు ఏర్పాటు చేసి అన్ని చెరువులకు నీళ్ళు వది లేటట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వానా కాలం పంట సమయంలో గోదావరి జలాలు రైతులకు ఉపయోగ పడాలని, ప్రభుత్వం రాజీవ్ కెనాల్, యాతాలకుంటపై చేసిన ఖర్చు సద్వినియోగం కావాలని అన్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు సస్యశ్యామలం కావాలనే ఆకాంక్షతో ఈ ప్రాజెక్టు చేపట్టామని, దీనిని ఎట్టి పరిస్థితిలో పూర్తి చేయాలని చెప్పారు. సత్తుపల్లి, పినపాక, మధిర, వైరా, అశ్వారావు పేట నియోజకవర్గాలకు ఈ సంవత్సరమే సాగు నీరు అందాలని అన్నారు. దీని వల్ల వైరా ప్రాజెక్టు క్రింద లక్ష 30 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని తెలిపారు. నాగార్జునసాగర్ నీళ్లు రాక పోయినా రైతులకు ఇక ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. సీతారామ ప్రధాన కాలువ శుభ్రం చేయాలని, నీరు వదిలితే త్వరగా వైరా ప్రాజెక్టులోకి నీళ్లు వెళ్లేలా చూసు కోవాలని అన్నారు. క్షేత్ర స్థాయిలో ఎటువంటి సమస్యలు వచ్చినా కలెక్టర్ దృష్టికి తీసుకొని పోవాలని సూచించారు. ప్రతి సమస్య వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, అటవీ అభ్యంతరాలు, భూసేకరణ, లీగల్ సమస్యలు త్వరిత గతిన పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో ఇర్రిగేషన్ సిఇ ఏ. శ్రీనివాస రెడ్డి, ఎస్ఇ ఎస్. శ్రీనివాస రెడ్డి, ట్రాన్స్కో ఎస్ఇ శ్రీనివాసా చారి, ఎస్డీసి ఎం. రాజేశ్వరి, కల్లూరు ఆర్డీవో ఎల్. రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు హైదరాబాద్ వాసుల దుర్మరణం

Ram Narayana

తెలుగు రాష్ట్రాల్లో శివ నామస్మరణతో హోరెత్తుతున్న శైవ క్షేత్రాలు…

Ram Narayana

వివేకా హత్య కేసులో ట్విస్ట్.. వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలపై కేసు నమోదు..!

Ram Narayana