తెలంగాణ వార్తలు

త్వరలో లెక్కలన్నీ చెబుతాం …

  • ప్రతి ఇంటికి, ఊరికి ప్రభుత్వం చేసిన ఖర్చును వెల్లడిస్తాం
  • ఇందిర గిరి జల వికాసం ద్వారా బోర్లు, పంపు సెట్లు
  • రూ. 9 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం అమలు
  • ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం  
  • త్వరలో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చర్యలు
  • ఎర్రుపాలెం సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

రాష్ట్రంలోని ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి ప్రజా ప్రభుత్వం చేసిన ఖర్చును లెక్కలతో సహా త్వరలో వెల్లడిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం మధిర నియోజక వర్గంలోని ఎర్రుపాలెం మండల కేంద్రంలో నిర్మించనున్న 50 పడకల సామాజక ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రైతు రుణ మాఫీ, రైతు భరోసా, రాజీవ్ యువ వికాసం, సన్న బియ్యం ఇలా అనేక పథకాలను అమలు చేస్తూ ప్రతి ఇంటికి వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే, పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని గాలికి వదిలేసి, రూ. 7 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్లి పోయారని విమర్శించారు. ఆదాయం లేక పోయినా, అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ మొదటి ఏడాదిలోనే ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలును అమలు చేస్తుందన్నారు. అటవీ హక్కు చట్టం ద్వారా పట్టాలు  పొందిన రైతులందరికీ ఇందిర గిరి జల వికాసం ద్వారా బోర్లు, పంప్ సెట్లు, సోలార్ విద్యుత్తు యూనిట్లతో పాటు పామ్ ఆయిల్, అవకాడో మొక్కలను కూడా ఉచితంగా అందజేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు యువత తమ కాళ్లపై తాము నిలబడేందుకు 9,000 కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకానికి ప్రారంభించామని, జూన్ 2న సాంక్షన్ లెటర్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని చెప్పారు. అందులో భాగంగా మొదటి సంవత్సరం స్వయం సహాయక సంఘాలకు రూ. 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది వైద్యానికి రూ.11,600 కోట్లు ఖర్చు పెడుతున్నామని, రాబోయే రోజుల్లో వైద్య రంగానికి మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి, ఇప్పటికే 56 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. మరో 30 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నామని వెల్లడించారు. ఇళ్ళు ఇస్తామని గత పాలకులు10 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తే, ప్రజా ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలో ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించబోతుందన్నారు. మొదటి సంవత్సరంలోనే ప్రతి నియోజక వర్గంలో 3500  ఇల్లు నిర్మిస్తున్నామని, ఇందుకు రూ. 22,500  కోట్లు కేటాయించామని తెలిపారు. రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని, వారందరికీ రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు పెంచి, ఆధనంగా కొత్త చికిత్సలను జాబితాలో చేర్చామన్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు ప్రజా ప్రభుత్వం ఇస్తున్న పెద్ద భరోసా అని పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి వంద రోజుల పని కల్పిస్తున్నామని, అదే కుటుంబంలో పిల్లలు చదువుకునేందుకు ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభింస్తున్నామని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా స్కూల్ నిర్మిస్తామని, ఈ పాఠశాల నిర్మాణానికి రూ.11,600 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు.  తెల్ల రేషన్ కార్డు ఉన్న పిల్లలు చదువుకుంటే వారికి ఫీజు రియంబర్స్మెంట్ కూడా చేస్తున్నామని అన్నారు. అంతే కాకుండా తెల్ల రేషన్ కార్డు వున్న 90 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు. అలాగే, రూ. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 2 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహిళలకు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలిగిస్తున్నామని భట్టి ఈ సనాదర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కళావతి బాయి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ ఘన విజయం

Ram Narayana

రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపును ఎవరు ఆపలేరు … 80 కి పైగా సీట్లు ఖాయం సీఎల్పీ నేత భట్టి…

Drukpadam

గోదావరి-బనకచర్ల వివాదం : అన్ని పార్టీల ఎంపీలతో రేపు సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ

Ram Narayana