ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

చంద్రబాబే టీడీపీ అధ్యక్షులు …ఆయనకు అల్తర్నేటివ్ లేదు …

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు రెండో రోజు స‌మావేశాల్లో ఆయ‌న‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు.

పార్టీ అధ్యక్ష పదవికి చంద్రబాబు ఒక్కరే నామినేష‌న్ వేశారు. దీంతో ఆయ‌న‌ను జాతీయ అధ్య‌క్షుడిగా ఎన్నుకున్న‌ట్లు పార్టీ నాయ‌క‌త్వం ప్ర‌క‌టించింది. ఆయ‌న ఈ ప‌ద‌విలో రెండేళ్ల పాటు కొన‌సాగుతారు.

కాగా, చంద్రబాబు 1995లో తొలిసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి గడిచిన మూడు దశాబ్దాలుగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. 2014 రాష్ట్ర విభజన వరకు పార్టీ అధ్యక్షునిగా ఉన్న ఆయ‌న‌.. ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే కొత్త పదవి సృష్టించి దానికి నారా లోకేష్ ను చేయాలనీ మహానాడులో పలువురు మాట్లాడారు ….అయితే పొలిట్ బ్యూరో పార్టీ ఆఫీస్ బేరర్లు , కార్యవర్గాన్ని నియమించాల్సి ఉంది …అప్పటివరకు లోకేష్ ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశాలు ఉన్నాయి…పార్టీ అధినేత ఈ విషయంలో ఎలాంటి ఆలోచనతో ఉన్నారో దాని ప్రకారమే జరుగుతుందని పలువురు తెలుగుదేశం నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది …

మహానాడు వేదికపై నారా లోకేశ్ ను అభినందించిన చంద్రబాబు

Chandrababu Applauds Nara Lokesh at Mahanadu
  • మహానాడు వేదికపై ‘ది వాయిస్ ఆఫ్ పీపుల్’ పుస్తకావిష్కరణ
  • యువగళం పాదయాత్ర అనుభవాలతో నారా లోకేశ్ రచన
  • సీఎం చంద్రబాబుకు పుస్తకం తొలి ప్రతిని అందించిన లోకేశ్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ తన యువగళం పాదయాత్ర అనుభవాలతో ‘ది వాయిస్ ఆఫ్ పీపుల్’ పేరుతో రూపందించిన కాఫీ టేబుల్ బుక్ ను మహానాడు వేదికపై ఆవిష్కరించారు. ఈ పుస్తకం తొలి ప్రతిని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు.

పుస్తకాన్ని ఆసక్తిగా పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత లోకేశ్ ను అభినందించారు. యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజలలో చైతన్యం తీసుకువచ్చారని, ఆనాటి అనుభవాలను పుస్తక రూపంలో భద్రపరచడం మంచి పరిణామమని ఆయన ప్రశంసించారు.

2023 జనవరి 27న కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి ఆలయం నుంచి నారా లోకేశ్ యువగళం పాదయాత్రను ప్రారంభించారు. మొత్తం 226 రోజుల పాటు సాగిన ఈ యాత్ర, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక మలుపు తిప్పిందని పలువురు విశ్లేషించారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో, 97 శాసనసభ నియోజకవర్గాలు, 232 మండలాలు/మున్సిపాలిటీలు, 2,097 గ్రామాల మీదుగా లోకేశ్ 3,132 కిలోమీటర్లు నడిచారు.

టీడీపీ మహానాడు రెండోరోజు: ఎవరెవరు ఏమన్నారంటే…!

TDP Mahanadu Day 2 Who Said What
  • కడపలో టీడీపీ మహానాడు
  • స్వర్గీయ ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా టీడీపీ నేతల ఘన  నివాళులు
  • ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేశ్ ల నాయకత్వంపై నేతల ప్రశంసల జల్లు
  • తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ ప్రణాళికలపై విస్తృత చర్చ
  • గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రస్తుత అభివృద్ధి కార్యక్రమాల వెల్లడి
  • రాష్ట్ర సమగ్రాభివృద్ధి, తెలుగుజాతి కీర్తి ప్రతిష్ఠలే లక్ష్యమని పునరుద్ఘాటన

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత నేత శ్రీ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా తెలుగు ప్రజలు ఆయనను స్మరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కడపలో జరిగిన మహానాడు వేదికగా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ ఆశయాలను, చంద్రబాబు దార్శనికతను, నారా లోకేశ్ యువ నాయకత్వాన్ని కొనియాడుతూ ప్రసంగించారు. తెలుగుజాతి విశ్వఖ్యాతిని మరింత ఇనుమడింపజేయడమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని వారు స్పష్టం చేశారు.

పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ మంత్రి
ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, “తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని మహోన్నత శిఖరాలపై నిలబెట్టిన మహనీయుడు అన్న ఎన్టీఆర్. మరణించినా తెలుగుజాతి గుండెచప్పుడుగా నిలిచారు. అనితరసాధ్య చరితను సృష్టించిన ప్రజానాయకుడు. తెలుగు గడ్డపైనే కాక యావత్ దేశంలో తెలుగు పతాక కీర్తిని రెపరెపలాడించారు. నిబద్ధత, నిజాయితీకి నిలువెత్తు స్వరూపం ఆయన. తెలుగుజాతి చరిత్రను తిరగరాసి, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అధికారం అందించిన మహోన్నతుడు. ఆయన నటించిన ప్రతి చిత్రం సంచలనమే, ఆయన రాజకీయం రారాజకీయమే. అటువంటి యుగపురుషునికి ఘన నివాళి అర్పిద్దాం” అని అన్నారు.

నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో సభ్యుడు
స్వర్గీయ ఎన్టీఆర్ జయంతిని ప్రపంచవ్యాప్తంగా పండుగలా జరుపుకుంటున్నామని ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అన్నారు. 1982 మార్చి 29న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ 43 వసంతాలు పూర్తి చేసుకుందని గుర్తుచేశారు. సామాన్యులకు అందని ద్రాక్షలా ఉన్న రాజకీయాన్ని అందరికీ చేరువ చేసి, సామాజిక న్యాయం అందించిన ఘనత ఎన్టీఆర్‌దేనని కొనియాడారు. “పేదవాడికి కూడు, గూడు, గుడ్డ అందించడమే ధ్యేయంగా సంక్షేమ అధ్యాయానికి ఆయన శ్రీకారం చుట్టారు. తెలుగుజాతికి, తెలుగు భాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు,” అని ఆనంద్ బాబు తెలిపారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, ఇతర పక్షాలను ఏకం చేసి పోరాడిన యోధుడిగా ఎన్టీఆర్‌ను అభివర్ణించారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తెలుగుజాతి కీర్తి విశ్వవ్యాప్తమైందని అన్నారు. “హైదరాబాద్‌ను సిలికాన్ వ్యాలీగా మార్చారు. హైటెక్ సిటీ, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలను తీసుకొచ్చారు. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటి ప్రపంచ నేతలను రాష్ట్రానికి రప్పించారు” అని వివరించారు. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ వంటి సంస్థల ప్రశంసలు అందుకున్నారని, దావోస్ సదస్సుల ద్వారా పెట్టుబడులు ఆకర్షించారని గుర్తుచేశారు. ఎన్నారై టీడీపీ విభాగం ద్వారా తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటారని అన్నారు.

తండ్రి ఆశయాలకు అనుగుణంగా నారా లోకేశ్ తెలుగుజాతి కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో పెంచుతున్నారని తెలిపారు. ఐటీ చదివిన లక్షలాది మంది విద్యార్థులు దేశ విదేశాల్లో స్థిరపడ్డారని, విదేశాల్లో చదువుకున్న ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారంటే దానికి చంద్రబాబే కారణమని అన్నారు. లోకేశ్ పాదయాత్ర ద్వారా యువత సమస్యలు తెలుసుకుని, 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నారని, ఆయన ఆధ్వర్యంలో తెలుగుజాతి కీర్తి మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

నన్నూరి నర్సిరెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యుడు
టీటీడీ పాలకమండలి సభ్యుడు నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలాన్ని నమ్ముకుని ముందుకు సాగుతోందని, కార్యకర్తలే పార్టీకి ఇంధనమని అన్నారు. “మా తెలంగాణలో మాకు ముక్కోడు, మీ ఏపీలో మీకు తిక్కోడు పోయాడు” అంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. “ఢిల్లీ పురవీధుల్లో తగ్గుతున్న తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. సాంఘిక దురాచారాలను రూపుమాపి, బడుగు బలహీన వర్గాల పక్షాన నిలిచారు. భారత పార్లమెంటులో టీడీపీకి కీలక భూమిక ఉందని నిరూపించారు” అని తెలిపారు. 20 ఏళ్ల క్రితం చంద్రబాబు తెచ్చిన జీనోమ్ వ్యాలీ కరోనా సమయంలో వ్యాక్సిన్ అందించిందని, ఆయన దూరదృష్టికి ఇది నిదర్శనమని అన్నారు.

కూన రవికుమార్, యూసీ చైర్మన్, అముదాలవలస ఎమ్మెల్యే
అముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ, “ఉత్తరాంధ్రను ఉత్తి ఆంధ్రగా మార్చిన ఘనుడు జగన్ రెడ్డి. నేడు చంద్రబాబు సారథ్యంలో ఉత్తమ ఆంధ్రగా తయారవుతోంది. ఉత్తరాంధ్ర అంటే వెనుకబాటుతనం కాదు, అదొక మహోద్యమం,” అని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాకే ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయని, 60 శాతం భూమికి సాగునీరు అందిందని తెలిపారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేశారని, మంత్రులు జగన్ అరాచకాలకు వత్తాసు పలికారని విమర్శించారు. హుద్‌హుద్ తుఫాను సమయంలో చంద్రబాబు విశాఖలోనే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించారని గుర్తుచేశారు. విశాఖను ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్‌గా మార్చేందుకు చంద్రబాబు కృషి చేస్తే, వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు.

కాలువ శ్రీనివాసులు, పొలిట్ బ్యూరో సభ్యుడు
పొలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ, కడప మహానాడు చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. “అన్నగారు అధికారంలోకి వచ్చాక రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర వంటి వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. నవ్యాంధ్రలో అమరావతి అభివృద్ధి చెందుతూనే, వెనుకబడిన ప్రాంతాలపై ఎన్డీయే ప్రభుత్వం దృష్టి సారిస్తుంది” అని తెలిపారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీరందించారని, అనంతపురం జిల్లాలో వేసవిలోనూ నీరు నింపిన ఘనత చంద్రబాబుదని అన్నారు. 

చంద్రబాబు నాయకత్వంలో రాయలసీమ అభివృద్ధి పథంలో పయనిస్తోందని, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేశ్ గ్రామాల అభివృద్ధికి కృషి చేశారని, పవన్ కల్యాణ్ సారథ్యంలో పంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. రాయలసీమలో ఫ్యాక్షన్‌ను అంతం చేసి, అభివృద్ధి చేసి చూపించిన ఘనత చంద్రబాబుదేనని ఉద్ఘాటించారు.

ఎమ్.ఎస్. రాజు, మడకశిర శాసనసభ్యుడు, టీటీడీ పాలకమండలి సభ్యుడు
మడకశిర ఎమ్మెల్యే ఎమ్.ఎస్. రాజు మాట్లాడుతూ, 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు రాజధాని లేని పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతాలు సకాలంలో అందించారని గుర్తుచేశారు. పట్టిసీమ ద్వారా పంటలకు నీరందించి, పోలవరం పనులను 72 శాతం పూర్తిచేశారని తెలిపారు. “ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన దుర్మార్గుడు రాష్ట్రాన్ని నాశనం చేశాడు. వారు ఎక్కడైతే నాశనం చేశారో అక్కడి నుండే చంద్రబాబు అభివృద్ధి, పునర్నిర్మాణం ప్రారంభించారు” అని విమర్శించారు. 

తాను ఎలాంటి గాడ్‌ఫాదర్‌లు లేకుండా, కష్టపడి ఈ స్థాయికి వచ్చానని, చంద్రబాబు, లోకేశ్ తనను ప్రోత్సహించారని అన్నారు. దళిత కుటుంబంలో పుట్టిన తనకు టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించి ఆత్మగౌరవాన్ని నిలిపారని కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ నేతల బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

గౌతు శిరీష, ఎమ్మెల్యే
ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఊపిరి పోసిన టీడీపీ 40 ఏళ్లుగా తెలుగువారి గుండెల్లో స్థానం సంపాదించుకుందని అన్నారు. “సీఎం పదానికి సరైన అర్థం సీబీఎన్ అని పేరు తెచ్చుకున్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా పార్టీని మొక్కవోని దీక్షతో నడిపించారు. అన్న అంటే అర్ధరాత్రి అయినా నేనున్నానంటూ లోకేష్ ముందుంటారు,” అని కొనియాడారు. మౌలిక సదుపాయాల కల్పనకు చంద్రబాబు పెద్దపీట వేశారని, ఆయన ప్రతి అడుగు రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలపడానికేనని అన్నారు. 

హైదరాబాద్ సృష్టికర్త చంద్రబాబేనని, నేడు అమరావతిని అంతకంటే గొప్ప రాజధానిగా నిర్మిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ నష్టాన్ని ఏడాదిలోనే పూడ్చి అభివృద్ధి చేసి చూపించారని, రోడ్లు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు కేంద్ర సహకారంతో నిర్మిస్తున్నారని వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు పోర్టుకు మళ్లీ శ్రీకారం చుట్టామని, పలాసలో విమానాశ్రయం రాబోతోందని తెలిపారు. విదేశీ విద్యా పథకం ద్వారా సామాన్యుల పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారని, ఇది చంద్రబాబు ఘనతేనని అన్నారు.

ఏలూరి సాంబశివరావు, పర్చూరు ఎమ్మెల్యే
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ, రాజకీయ సభలో యోగాపై తీర్మానం చేయడం అరుదైన సంఘటన అని అన్నారు. “తెలుగుజాతి ఉన్నతంగా ఎదగాలి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని తపించే వ్యక్తి చంద్రబాబు. యోగా అంటే శరీరానికి, ఆత్మకు, మనసుకు ముడివేసే ప్రక్రియ,” అని వివరించారు. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రధాని మోదీ ప్రతిపాదిస్తే ప్రపంచ దేశాలు అంగీకరించాయని, ఈ ఏడాది విశాఖ వేదికగా యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారని తెలిపారు. తెలుగుజాతి శక్తివంతంగా మారడానికి యోగా ఉపయోగపడుతుందని చంద్రబాబు నమ్ముతారని అన్నారు.

లోకేశ్‌కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి ఇవ్వాలి: ఎమ్మెల్యే ధూళిపాళ్ల‌

Nara Lokesh should be given Working President post says MLA Dhulipalla
  • టీడీపీలో యువనేత నారా లోకేశ్‌కు మరింత కీలకమైన బాధ్యతలు అప్పగించాలనే చర్చ
  • పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌ను నియమించాలని పార్టీ శ్రేణుల డిమాండ్ 
  • తాజాగా మహానాడు వేదికగా ఈ అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన‌ ధూళిపాళ్ల‌

గ‌త కొంత‌కాలంగా టీడీపీలో యువనేత నారా లోకేశ్‌కు మరింత కీలకమైన బాధ్యతలు అప్పగించాలనే చర్చ జోరుగా సాగుతున్న విష‌యం తెలిసిందే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌ను నియమించాలనే డిమాండ్ పార్టీ శ్రేణుల నుంచి బలంగా వినిపిస్తోంది. 

ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం క‌డ‌ప‌లో జరుగుతున్న మహానాడు వేదికగా ఈ అంశాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి ఎమ్మెల్యే ధూళిపాళ్ల‌ తీసుకెళ్లారు. లోకేశ్‌కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి ఇవ్వాలని కోరారు. ఈ విష‌య‌మై గుంటూరు జిల్లా స్థాయిలో జ‌రిగిన మినీ మహానాడులో తీర్మానం చేసిన‌ట్లు చంద్ర‌బాబుతో ఎమ్మెల్యే తెలియ‌జేశారు. 

ఇక, ప్రభుత్వ విప్, టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మరో టీడీపీ సీనియ‌ర్‌ నేత ఆనం వెంకటరమణారెడ్డి కూడా ఇదే అంశాన్ని మహానాడులో మా అధినేత చంద్రబాబు గారి దృష్టికి కచ్చితంగా తీసుకెళతామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా యువశక్తితో పార్టీకి కొత్త ఊపు తీసుకురావాలన్నదే అందరి లక్ష్యమని జీవీ ఆంజనేయులు తెలిపారు.

మహానాడులో అందరినీ ఆకట్టుకున్న ఎన్టీఆర్ ఏఐ స్పీచ్

  • మహానాడులో ఏఐ రూపంలో ఎన్టీఆర్ ప్రసంగం
  • పార్టీ ఆవిర్భావం, పథకాలపై మాట్లాడిన ఎన్టీఆర్ ఏఐ
  • చంద్రబాబు పాలన, లోకేశ్ సేవలను ప్రశంసించిన ఎన్టీఆర్

తెలుగుదేశం పార్టీ మహానాడు రెండో రోజు కడపలో ఉత్సాహంగా కొనసాగుతోంది. పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 102వ జయంతిని పురస్కరించుకుని, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సభా ప్రాంగణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత ద్వారా ఎన్టీఆర్ ప్రసంగించడం సభికులను విశేషంగా ఆకట్టుకుంది.

“మహా వేడుకలా, పసుపుమయమై జరుగుతున్న ఈ మహానాడు పండుగ వేళ 10 కోట్ల తెలుగు తమ్ముళ్లకు, ఆడపడుచులకు, రైతన్నలకు, శ్రమజీవులకు, దేశవిదేశాల్లో తెలుగు కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తున్న మన బిడ్డలకు, వివిధ రంగాలలో ప్రతిభ చూపిస్తున్న కళాకారులకు, మేధావులకు, శాస్త్రవేత్తలకు, ముఖ్యంగా నా పసుపు జెండాను గుండెల మీద మోస్తున్న తెలుగుదేశం కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి” అంటూ ఏఐ ఎన్టీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. “సరిగ్గా 43 ఏళ్లు అయ్యింది నా తెలుగువారి కోసం, నా తెలుగువారి ఆత్మగౌరవం నిలపడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించాను అనేకంటే, పుట్టిందని చెప్పడమే సరైంది” అని పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసిన పథకాలు, సాధించిన అభివృద్ధి గురించి ఏఐ ఎన్టీఆర్ ప్రస్తావించారు. తాను ప్రారంభించిన పథకాలను గుర్తుచేస్తూ, చంద్రబాబు నాయకత్వంలో రూపుదిద్దుకున్న ప్రస్తుత సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపించారు.

అంతేకాకుండా, “మానవసేవలో పార్టీ కార్యకర్తలు, సామాన్యులకు అండగా ఉంటున్న నా మనవడు లోకేశ్ ను చూస్తుంటే ముచ్చటేస్తోంది. భళా మనవడా.. భళా” అంటూ నారా లోకేశ్ ను అభినందించారు. ఈ ఏఐ ప్రసంగం మహానాడుకు హాజరైన ప్రతినిధులు, కార్యకర్తలను ఎంతగానో ఉత్తేజపరిచింది.

మహానాడును నారా లోకేశ్ ఒక మలుపు తిప్పారు: చంద్రబాబు

Nara Lokeshs Vision Praised by Chandrababu at Mahanadu
  • లోకేశ్ ప్రతిపాదించిన ఆరు శాసనాలు గొప్పగా ఉన్నాయన్న చంద్రబాబు
  • ఈ శాసనాలు సరికొత్త చరిత్రకు నాంది అన్న టీడీపీ అధినేత
  • కోవర్టుల పట్ల పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజలు, పార్టీ భవిష్యత్తు కోసం నారా లోకేశ్ ప్రతిపాదించిన ఆరు శాసనాలు గొప్పగా ఉన్నాయని ప్రశంసించారు. మహానాడును లోకేశ్ ఒక మలుపు తిప్పారని కితాబునిచ్చారు. భవిష్యత్తు కోసమే ఆ శాసనాలని అన్నారు. ఈ ఆరు శాసనాలు సరికొత్త చరిత్రకు నాంది అని చెప్పారు. ఆర్థికంగా కార్యకర్తలను బలోపేతం చేసే దిశగా ఆలోచిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని చెప్పారు. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మహానాడులో రెండో రోజు ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వివేకా హత్య కేసులో నారాసుర రక్త చరిత్ర అంటూ తనపై నెపం మోపాలని చూశారని వైసీపీపై మండిపడ్డారు. ఏమీ తెలియనట్టు గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. మెదడు చితికిపోయేలా వివేకాను దారుణంగా నరికి చంపారని అన్నారు. నేరస్తుల ఆటలు సాగబోవని చెప్పారు.

కోవర్టుల పట్ల పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. టీడీపీలో వర్గపోరు అంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఖబడ్దార్… మీ ఆటలు నా దగ్గర సాగవు అంటూ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో మహిళలపై అనుచిత పోస్టులు పెట్టేవారి తాట తీస్తామని హెచ్చరించారు. 

ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు అండగా ఉంటామని చంద్రబాబు చెప్పారు. బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. ఆగస్ట్ నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు. కార్యకర్తలే టీడీపీ అధినేత అనేది టీడీపీ సిద్ధాంతమని తెలిపారు. వలస పక్షులు వస్తుంటాయి, పోతుంటాయని… కార్యకర్తలే శాశ్వతంగా ఉంటారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు పదవులు ఇచ్చిన ఘనత టీడీపీదేనని అన్నారు. లక్ష మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేస్తామని చెప్పారు. 

మహానాడు వేదికపై ఎన్టీఆర్ కు చంద్రబాబు నివాళి

Chandrababu Pays Tribute to NTR at Mahanadu Venue
  • తెలుగుజాతి గుండెల్లో పెట్టుకున్న ఏకైక నాయకుడు ఎన్టీఆర్
  • రెండు రంగాల్లో రారాజుగా రాణించడం ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమైన ఘనత
  • సమాజంలో అన్ని వర్గాలు కీర్తించే నాయకుడని కొనియాడిన చంద్రబాబు

తెలుగుజాతి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఎన్టీఆర్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు వేదిక పైనుంచి నివాళులు అర్పించారు. ఒకే వ్యక్తి రెండు రంగాల్లో రారాజుగా రాణించడం కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమైన ఘనత అని చెప్పారు. సాధారణ రైతు బిడ్డగా పుట్టిన ఎన్టీఆర్ నటుడిగా, రాజకీయ నాయకుడిగా రాణించారని గుర్తు చేశారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన నాయకుడు ప్రపంచంలో ఎన్టీఆర్ మాత్రమేనని చంద్రబాబు చెప్పారు.

పదవికి కొత్త భాష్యం..
అధికారం అంటే బాధ్యత అని, పదవి అంటే సేవ చేసే అవకాశమని, పాలకులు అంటే సేవకులని చెప్పి దేశ రాజకీయాల అర్థాలే మార్చిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. సాధారణ ప్రభుత్వ ఉద్యోగి స్థాయి నుంచి తెలుగు సినీరంగంలో ఎవరెస్టుగా ఎదగడం, ప్రజల కోసం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం అనితర సాధ్యమని, మన కళ్లముందు కనిపించిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని చెప్పారు. ఎన్టీఆర్ జీవితమేమీ పూలపాన్పు కాదని, నిరంతరం పోరాటాలతోనే ఆయన ఎదిగారని చెప్పుకొచ్చారు. స్వీయక్రమశిక్షణ, నీతి నిజాయితీ, పట్టుదల ఆయన ఆయుధాలని చంద్రబాబు తెలిపారు.

పసుపు జెండా శాశ్వతం..
43 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ రూపొందించిన పసుపు జెండా దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని చంద్రబాబు చెప్పారు. ఈ జెండా శాశ్వతంగా ఉంటుందని, తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ గుర్తుంటారని అన్నారు. సినీ రంగంలో 33 ఏళ్లు, రాజకీయ రంగంలో 13 ఏళ్ల పాటు ఎన్టీఆర్ అద్వితీయ చరిత్ర సృష్టించారని తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహం చూస్తూ ఏ సంకల్పం చేసినా దానిని సాధించే శక్తి, సామర్థ్యం మీకు వస్తుందని చంద్రబాబు వివరించారు.

ఆయన ప్రసంగమే ఓ గర్జన..
చైతన్యరథంపై రాష్ట్రంలో తిరుగుతూ ఎన్టీఆర్ గర్జించారని చెప్పారు. ఎన్టీఆర్ ప్రసంగిస్తుంటే గర్జించినట్లే ఉండేదని గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలో మరెవ్వరికీ సాధ్యం కాని ఘనతలు ఎన్నో ఆయన అలవోకగా సాధించారని చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ అంటే పేదలకు భరోసా అని, యువతకు భవిష్యత్తు అని, కార్మిక లోకానికి అండ అని చెప్పారు. సమాజంలో అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు పేర్కొన్నారు.

సుపరిపాలనకు ఆద్యులు ఎన్టీఆర్..
సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన తో పాలనలో కొత్త ఒరవడికి ఎన్టీఆర్ ఆద్యులుగా నిలిచారని చంద్రబాబు చెప్పారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టాలని రెండు రూపాయలకు కిలో బియ్యం తెచ్చారని, అందరికీ పక్కా ఇళ్లు, బడుగులకు జనతా వస్త్రాలు అందించారని గుర్తు చేశారు. వృద్ధాప్య పెన్షన్లు, రూ.50కే హార్స్‌ పవర్‌ విద్యుత్‌, గురుకుల పాఠశాలల ఏర్పాటు, పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం, మహిళలకు ఆస్తి హక్కు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఉద్యోగాల కల్పన, పరిశ్రమల ఏర్పాటు, రోడ్ల నిర్మాణం… ఇలా సంక్షేమాన్ని- అభివృద్ధిని సమతుల్యం చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. పటేల్‌ పట్వారి వ్యవస్థను రద్దు చేసి, సింగిల్ విండో విధానానికి రూపకల్పన చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. స్థానిక సంస్థల్లో బీసీలకు, మహిళలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది ఎన్టీఆరేనని గుర్తుచేశారు.

రాజకీయాల్లోకి రాకముందు కూడా..
ఎన్టీఆర్ నిరంతరం ప్రజల కోసమే ఆలోచించేవారని, రాజకీయాల్లోకి రాకముందు కూడా ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానంటూ ముందుకొచ్చి సాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. 1952 సంవత్సరంలో రాయలసీమలో కరువు వచ్చినప్పుడు,1962లో భారత్‌ చైనా మధ్య యుద్ధం జరిగినప్పుడు ఎన్టీఆర్ జోలె పట్టి విరాళాలు సేకరించారని చెప్పారు. 1965లో భారత్‌ పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం జరిగినప్పుడు, 1972లో రాష్ట్రంలో కరువు వచ్చినప్పుడు, 1977లో దివిసీమ ఉప్పెన సంభవించినప్పుడు… వేల మంది మృత్యువాత పడి, లక్షలాది మంది నిరాశ్రయులైతే ఎన్టీఆర్ స్వయంగా దివిసీమ వెళ్లి సేవా కార్యక్రమాలు చేపట్టారు. 

ఎన్టీఆర్ స్ఫూర్తితో పనిచేద్దాం…స్వర్ణాంధ్ర సాధిద్దాం..
ఈ నాలుగు దశబ్దాల్లో ఎన్నో మైలురాళ్లు దాటొచ్చామని చంద్రబాబు తెలిపారు. ఎన్నో విజయాలు, మరెన్నో అనుభవాలు మూటగట్టుకున్నామని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలు, సిద్ధాంతాలు ముందుకు తీసుకువెళ్తున్నామని, ఆయన స్ఫూర్తితోనే సంక్షేమానికి, సంస్కరణలకు, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. 2024లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టామని చంద్రబాబు పేర్కొన్నారు. పేదరికం లేని సమాజం కోసం ఎన్టీఆర్ తపించారని, ఆయన ఆశయ సాధన కోసం పీ4 విధానాన్ని తీసుకువచ్చామన్నారు. దీని ద్వారా జీరో పావర్టీ లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు. ఆర్ధిక అసమానతలు తగ్గించి జీవన ప్రమాణాలు పెంచుతామని వివరించారు. పార్టీ సిద్దాంతాల్లో నూతనత్వాన్ని తెచ్చేందుకు తీసుకొచ్చిన 6 సూత్రాలు గేమ్ చేంజర్ అవుతాయని అన్నారు. ఎన్టీఆర్ ఆశీస్సులతో 2047 నాటికి తెలుగుజాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.

ఎన్‌టీఆర్‌ ఆశయాలను కొనసాగిస్తున్న చంద్రబాబు బాటలో అందరం నడవాలి: అశోక్ గజప‌తి రాజు

  • క‌డ‌ప‌లో రెండో రోజు టీడీపీ మ‌హానాడు స‌భ‌లు
  • మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజప‌తి రాజు ప్రసంగం
  • తెలుగువారి ఘనతను చాటి చెప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అంటూ ప్ర‌శంస‌
  • ఆ ఘనతను స్ఫూర్తిగా తీసుకొని భావితరాలకు ఆదర్శంగా ఉండాలని పిలుపు

క‌డ‌ప‌లో రెండో రోజు టీడీపీ మ‌హానాడు స‌భ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఎన్‌టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా నేత‌లు ఆయ‌న‌కు నివాళులు అర్పించారు. అనంత‌రం మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజప‌తి రాజు ప్రసంగించారు. తెలుగువారి ఘనతను చాటి చెప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని అన్నారు. ఆ ఘనతను స్ఫూర్తిగా తీసుకొని భావితరాలకు ఆదర్శంగా ఉండాలని పిలుపునిచ్చారు. 

జీవించాక మరణించక తప్పదు.. మరణించినా ప్రజల గుండెల్లో నిలబడటం చాలా గొప్ప విషయం అన్నారు. అలా ఉన్న వ్యక్తే అన్న నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఎన్‌టీఆర్‌ ఆశయాలను కొనసాగిస్తున్న నారా చంద్రబాబు బాటలో అందరం నడవాలని అశోక్ గజప‌తి రాజు తెలిపారు. మహాత్ములని స్ఫూర్తిగా తీసుకొని నడిచిన నందమూరి నేడు మనందరికి స్ఫూర్తిగా నిలిచారన్నారు.

పసుపు అంటే పుణ్యమైన రంగు.. ఆ చక్రం శ్రమ జీవులకోసం, ఆ నాగలి రైతులకోసం ఆ గుడిసే అందరికి ఇళ్లకోసం ఇది పేదలకోసం పుట్టిన జెండా.. ప్రజలకోసం నిలిసిన పార్టీ అని చెప్పారు. ఆత్మగౌరవంతో ఉండాలని ఎన్టీఆర్ ఆకాంక్షించేవారని ఈ సంద‌ర్భంగా మాజీ కేంద్ర మంత్రి గుర్తు చేశారు. మనం నిర్భయంగా పనిచేయగలితే మన ఆత్మగౌరవాన్ని పెంచుకోగలుగుతామ‌న్నారు. 

నాడు అన్నగారిపై కూడా  అక్రమ కేసులు పెట్టార‌ని, అయినా ముఖ్యమంత్రి హోదాలో కోర్టుకు వెళ్లి సమాధానం ఇచ్చార‌ని తెలిపారు. అలాగే చంద్రబాబును అక్రమంగా 52 రోజులు జైల్లో పెట్టినా ఆయన అధైర్య పడలేదన్నారు. గత ప్రభుత్వం లాంటి పాలన‌ను తానేప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. తెలుగు భాష, తెలుగు సంస్కృతి ఉన్నంత వరకు తెలుగుదేశం ఉంటుంద‌న్నారు. 

ప్రజలకోసం పనిచేసే పార్టీ.. ఆత్మగౌరవాన్ని పెంచే పార్టీ టీడీపీ అని తెలిపారు. ఎక్క‌డున్నా తెలుగువారి కీర్తిని చాటి చెప్పాల‌న్నారు. భవిష్యత్తు మన యువకులది.. అందరు కలిసి పనిచేయాలని అశోక్ గజప‌తి రాజు పిలుపునిచ్చారు.  

Related posts

బాలకృష్ణకు ఎక్స్ వేదికగా అంబటి రాంబాబు కౌంటర్

Ram Narayana

మూడు పార్టీల అజెండా ఒక్కటే: చంద్రబాబు

Ram Narayana

మంచి లాజిక్ పట్టుకున్న సినీ నటుడు పృధ్వి …

Ram Narayana