ప్రధాని మోడీ రిటైర్మెంట్ ఊహాగానాలకు తెరదించిన ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగత్
ప్రధాని మోడీ రిటైర్మెంట్ కాబోతున్నాడని ,ఆర్ ఎస్ ఎస్ నిబంధనల ప్రకారం 75 సంవత్సరాలు నిండిన ఏ వ్యక్తి అధికారిక పదవుల్లో ఉండకూడని ఉందని అందువల్ల మోడీకి 75 ఏళ్ళు నిండుతున్నందున ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకుంటారని ఆర్ ఎస్ ఎస్ మరొకరిని ఆపదవిలో కూర్చోబెడుతుందని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించాయి. అయితే ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో భగత్ మాట్లాడుతూ తమకు 75 ఏళ్లకు రిటైర్మెంట్ అనే నిబంధన ఏమిలేదని స్పష్టం చేశారు …దీంతో ప్రధాని మోడీ వచ్చేనెలలో ప్రధాని పదవి నుంచి తప్పుకుంటారనే జరుగుతున్న వార్తలకు తెరపడినట్లు అయింది …మోడీ ఇప్పటిలో రిటైర్మెంట్ కారనే సంకేతాలను ఆర్ ఎస్ ఎస్ చీఫ్ ఇచ్చారు …
75 ఏళ్ల రిటైర్మెంట్ వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
- తానుగానీ, ఇతరులుగానీ రిటైర్ అవ్వాలని ఎప్పుడూ చెప్పలేదన్న భగవత్
- ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని వెల్లడి
- గతంలో చేసిన వ్యాఖ్యలను తప్పుగా అన్వయించుకున్నారని వివరణ
- సంఘ్ చెప్పినంత కాలం పని చేస్తామని స్పష్టీకరణ
- మోరోపంత్ పింగళి సంఘటనను చమత్కారంగా చెప్పానన్న భగవత్
రాజకీయాల్లో, సంస్థల్లో 75 ఏళ్లకు పదవీ విరమణ చేయాలని తాను వ్యాఖ్యానించినట్లుగా జరుగుతున్న ప్రచారంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ స్పష్టతనిచ్చారు. తాను గానీ, మరే ఇతర రాజకీయ నాయకులు గానీ 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని ఎన్నడూ చెప్పలేదని ఆయన తేల్చి చెప్పారు. వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ 75వ ఏట అడుగుపెడుతున్న నేపథ్యంలో, గతంలో భగవత్ చేసిన వ్యాఖ్యలు ఆయనను ఉద్దేశించినవేనని జరుగుతున్న ప్రచారానికి ఈ ప్రకటనతో తెరపడింది.
గురువారం ఢిల్లీలో జరిగిన “100 వర్ష్ కీ సంఘ్ యాత్ర” కార్యక్రమంలో భగవత్ మాట్లాడుతూ, “నేను రిటైర్ అవుతానని గానీ, ఇంకెవరైనా రిటైర్ అవ్వాలని గానీ ఎప్పుడూ చెప్పలేదు” అని స్పష్టం చేశారు. గతంలో తాను ఆర్ఎస్ఎస్ మాజీ నేత మోరోపంత్ పింగళికి సంబంధించిన ఒక చమత్కారమైన సంఘటనను ఉదాహరించానని, దానిని చాలామంది తప్పుగా అన్వయించుకున్నారని వివరించారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పింగళి జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయనకు సంబంధించిన మూడు, నాలుగు సరదా సంఘటనలను పంచుకున్నానని గుర్తుచేశారు.
“మోరోపంత్ చాలా చమత్కారి. ఆయన మాటలతో కుర్చీలోంచి ఎగిరి గంతేసేలా చేసేవారు,” అని భగవత్ అన్నారు. పింగళికి 75 ఏళ్లు వచ్చినప్పుడు, మరో సీనియర్ నేత హెచ్.వి. శేషాద్రి ఆయనకు శాలువా కప్పి ఇక బాధ్యతల నుంచి తప్పుకోవాలని సున్నితంగా సూచించిన సంఘటనను తాను సరదాగా చెప్పానని, అంతేకానీ దానిని ఒక నిబంధనగా పరిగణించరాదని ఆయన తెలిపారు.
సంఘ్ కార్య పద్ధతిని వివరిస్తూ, “సంఘ్‌లో మేమంతా స్వయంసేవకులం. మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక పని అప్పగిస్తారు. నాకు 80 ఏళ్లు వచ్చినా సరే, శాఖను నడపమంటే నడపాల్సిందే. మాకు ఏది చెప్పారో అది చేస్తాం” అని ఆయన అన్నారు. ప్రస్తుతం తాను సర్ సంఘ్‌చాలక్‌గా ఏకైక వ్యక్తిని అయినప్పటికీ, తన తర్వాత ఆ బాధ్యతలు చేపట్టేందుకు కనీసం 10 మంది సిద్ధంగా ఉన్నారని భగవత్ పేర్కొన్నారు. “సంఘ్ మమ్మల్ని ఎంతకాలం పనిచేయమంటే అంతకాలం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం” అని ఆయన పునరుద్ఘాటించారు.
దేశ జనాభా, మతమార్పిడులపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు…

- మతమార్పిడులు, అక్రమ వలసలే ప్రధాన కారణాలని వెల్లడి
- ప్రభుత్వ ప్రయత్నాలకు సమాజం కూడా తోడుగా నిలవాలని పిలుపు
- సరిహద్దు రాష్ట్రాల్లో వనరులపై తీవ్ర భారం పడుతోందని ఆందోళన
- అక్రమ వలసదారులకు కాకుండా దేశ పౌరులకే ఉద్యోగాలు ఇవ్వాలని స్పష్టం
- ఉపాధి విషయంలో ముస్లింలను కూడా కలుపుకుపోవాలని సూచన
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ దేశ జనాభాపై కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా క్షీణతను నివారించి, దేశ స్థిరత్వాన్ని కాపాడేందుకు ప్రతి భారతీయ జంట ముగ్గురు పిల్లలను కనాలని ఆయన పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో గురువారం జరిగిన “100 వర్ష్ కీ సంఘ్ యాత్ర” కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈ సూచన చేశారు.
సంతానోత్పత్తి రేటు మూడు కంటే తక్కువగా ఉన్న సమాజాలు క్రమంగా అంతరించిపోతాయని నిపుణులు చెబుతున్నారని ఆయన గుర్తుచేశారు. “మన దేశంలో సంతానోత్పత్తి రేటు 2.1గా ఉండాలని సిఫార్సు చేస్తున్నారు. ఇది సగటు లెక్కల్లో బాగానే ఉన్నా, ఆచరణలో 0.1 బిడ్డకు జన్మనివ్వడం సాధ్యం కాదు కదా? అందుకే రెండు తర్వాత మూడో బిడ్డ తప్పనిసరి అవుతుంది” అని ఆయన వివరించారు.
సరైన వయసులో వివాహం చేసుకుని ముగ్గురు పిల్లలను కంటే తల్లిదండ్రులు, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తనకు వైద్యులు చెప్పినట్లు భగవత్ తెలిపారు. అంతేకాకుండా, ముగ్గురు తోబుట్టువులు ఉన్న ఇంట్లో పిల్లలకు అహం అదుపులో ఉంటుందని, భవిష్యత్తులో వారి కుటుంబ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రావని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశ శ్రేయస్సు దృష్ట్యా ప్రతి జంట ముగ్గురు పిల్లల లక్ష్యాన్ని పెట్టుకోవాలని ఆయన కోరారు. అయితే, జనాభా అదుపు తప్పకూడదని కూడా హెచ్చరించారు. “జనాభా ఒక వరం, కానీ అదే సమయంలో భారం కూడా కావచ్చు. అందరికీ ఆహారం అందించాల్సి ఉంటుంది. జనాభా నియంత్రణలో ఉంటూనే, తగినంత సంఖ్యలో ఉండేలా చూసుకోవాలి. దీనికోసం ప్రతి కుటుంబానికి ముగ్గురు పిల్లలు ఉండాలి, అంతకుమించి మరీ ఎక్కువగా వద్దు. అప్పుడే వారి పెంపకం కూడా సరిగ్గా ఉంటుంది” అని భగవత్ నొక్కిచెప్పారు.
ప్రస్తుతం అన్ని వర్గాల్లోనూ జననాల రేటు తగ్గుతోందని, అయితే హిందువుల్లో ఇది మొదటి నుంచి తక్కువగా ఉండటంతో మరింత స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. వనరులు తగ్గి, జనాభా పెరిగినప్పుడు ప్రకృతి సహజంగానే ఇలా చేస్తుందని, ఈ వాస్తవికతకు యువతరాన్ని సిద్ధం చేయాల్సిన బాధ్యత సమాజంపై ఉందని భగవత్ పేర్కొన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ, మతమార్పిడులు, అక్రమ వలసలతోనే అసలు సమస్య వస్తోందని అన్నారు. అక్రమ వలసదారులకు మన దేశంలో ఉద్యోగాలు ఇవ్వవద్దని పిలుపునిచ్చారు. ఉపాధి విషయంలో మన దేశానికి చెందిన ముస్లింలను కూడా కలుపుకుని వెళ్లాలని ఆయన అన్నారు.