- టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే అనుచరుల దాడి
- కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరుల దౌర్జన్యం
- మహిళా ఉద్యోగిని జుట్టు పట్టుకుని కొట్టిన గన్‌మన్
- ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
- దాడికి పాల్పడిన వారిపై కేసులు పెట్టాలని ఆదేశం
చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లాలోని టోల్‌ప్లాజా సిబ్బందిపై కల్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరుల దాడిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధ్యులపై తక్షణమే కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
వివరాల్లోకి వెళితే, కల్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు తన అనుచరులతో కలిసి తిరుమల దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో మదనపల్లె-తిరుపతి జాతీయ రహదారిపై ఉన్న గండబోయినపల్లె టోల్‌గేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ సిబ్బంది ఎమ్మెల్యే వాహనాన్ని గుర్తించినప్పటికీ టోల్ ఫీజు చెల్లించాలని కోరడంతో వివాదం మొదలైంది.
దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే అనుచరులు, గన్‌మన్ రెచ్చిపోయారు. “ఎమ్మెల్యే వాహనాన్నే ఆపుతారా?” అంటూ సిబ్బందిపై దాడికి దిగారు. గన్‌మన్ టోల్ బ్యారియర్‌ను ధ్వంసం చేయడంతో పాటు, టోల్‌ప్లాజా మేనేజర్ రవిపై, మహిళా ఉద్యోగిని శ్రీలతపై చేయి చేసుకున్నాడు. మహిళ జుట్టు పట్టుకుని కొట్టిన దృశ్యాలు సీసీటీవీలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ ఘటన జరిగినంతసేపు ఎమ్మెల్యే సురేంద్రబాబు తన వాహనంలోనే ఉండటం గమనార్హం.