తెలంగాణ రాజకీయ వార్తలు ..

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేవాళ్లను గెలిపిస్తే గ్రామం అభివృద్ధి చెందదు.. -సిఎం రేవంత్‌ రెడ్డి

బీసీలు ఎంతమంది ఉన్నారో వందేళ్లుగా లెక్కలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సామాజిక కుల సర్వే చేసి అన్ని కులాల లెక్కలు తీసుకున్నామని తెలిపారు. మాజీసీఎం కేసీఆర్‌ రూ.8 లక్షల కోట్ల అప్పు చేసి పోయారని వివర్శించారు. ఓవైపు కేసీఆర్ చేసిన అప్పులు తీరుస్తూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధిని అడ్డుకునే వాళ్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించవద్దని సూచించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేవాళ్లను గెలిపిస్తే గ్రామం అభివృద్ధి చెందదని చెప్పారు. మంత్రుల వద్దకు వెళ్లి గ్రామానికి నిధులు అడిగే నేతలను సర్పంచ్‌లుగా గెలిపించుకోవాలని, ప్రభుత్వంతో కలిసి పని చేసే వారిని గెలిపిస్తేనే గ్రామం బాగుపడుతుందని సూచించారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల బహిరంగ సభలో మాట్లాడారు.
పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పదేళ్ల పాటు నిర్లక్ష్యం చేశారని, ఉమ్మడి రాష్ట్రంలోనూ, ప్రత్యేక తెలంగాణలోనూ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నిర్లక్ష్యానికి గురైందని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాంతానికి ఏదైనా చేయాలని గతంలో ఏ నాయకుడు కూడా అనుకోలేదని విమర్శించారు. అందుకే ఈసారి ఇక్కడి ప్రజలు 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను గెలిపించారని అన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తికావస్తుందని రేవంత్ గుర్తు చేశారు. రెండు సంవత్సరాలు విజయోత్సవ సభను మక్తల్‌లో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని, పాలమూరు బిడ్డను ప్రజలు గెలిపించి అధికారం కట్టబెట్టారని వెల్లడించారు.

ఎకరాకు రూ.20 లక్షల పరిహారం : ఈసారి పాలమూరు జిల్లా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించామని తెలిపారు. పదేళ్లు నిర్లక్ష్యానికి గురైన నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని అన్నారు. నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకంపై కేసులు వేసి అడ్డుకున్నారని ఆరోపించారు. రైతులు నష్టపోవద్దని ఎకరాకు రూ.20 లక్షల పరిహారం ఇచ్చేందుకు ముందుకు వచ్చామని, పాలమూరు జిల్లాలో కృష్ణానది పారుతున్నా, ఇక్కడి నేలకు నీళ్లు అందలేదని, మాయగాళ్ల మాటలు విని ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను అడ్డుకోవద్దని సూచించారు. ఎంత డబ్బు ఖర్చయినా సరే మక్తల్‌ – నారాయణపేట ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ చేశారు.

ఐఐటీ మంజూరు : ఇరిగేషన్, ఎడ్యుకేషన్‌ను ప్రాధాన్య అంశాలుగా తీసుకున్నామని సీఎం తెలిపారు. వలసలు పోవటం వల్ల పాలమూరు జిల్లా బిడ్డలు విద్యకు దూరమయ్యారని అన్నారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజురు చేశామని, ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఐఐటీ మంజూరు చేసుకున్నామని, పాలమూరు యూనివర్సిటీకి అడిగిన కోర్సులన్నీ మంజూరు చేశామని తెలిపారు.

200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ : ఒకప్పుడు మహిళలు ఎక్కడికి వెళ్లాలన్ని ఛార్జీలకు ఇబ్బంది పడేవారని అన్నారు. ఛార్జీ డబ్బుల కోసం భర్త మీద, పిల్లల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేదని, మహిళలు ఉచితంగా బస్సుల్లో తిరుగుతుంటే కొందరు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని విమర్శించారు. మహిళలు బస్సుల్లో ఉచితంగా తిరగటమే కాదు బస్సులకు యజమానులు అయ్యారని అన్నారు. పొదుపు సంఘాల మహిళలు పెట్రోలు బంక్‌లకు యజమానులు అయ్యారని, ధనవంతులు తిన్నట్టే పేదలు కూడా సన్నబియ్యం తినాలని భావించామని చెప్పారు. హైటెక్‌ సిటీలో 150 క్యాంటీన్లను మహిళా సంఘాలకు కేటాయించామని, పేదలందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, 35 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారమైందమని వివరించారు.

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన… నారాయణపేట, వనపర్తి జిల్లాల పర్యటనలో భాగంగా ముందుగా మక్తల్‌లో రూ.200 కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మక్తల్ – నారాయణపేట మధ్య 4 లైన్ల రోడ్డు నిర్మాణానికి, మక్తల్‌లో క్రీడాభవనం, ఇతర అభివృద్ధి పనులకు మంత్రులతో కలిసి శంకుస్థాపన చేశారు. వనపర్తి జిల్లాలో రూ.151.92 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు, జూరాల దిగువన రూ.121.92 కోట్లతో హైలెవెల్ వంతెన నిర్మాణానికి, ఆత్మకూరు మున్సిపాలిటీలో 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

Related posts

తెలంగాణలో మూడ్రోజుల పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక పర్యటన

Ram Narayana

యతి ప్రాసలతో కాంగ్రెస్ ను ఉతికి పారేసిన మంత్రి హరీష్ రావు …

Ram Narayana

25 నుంచి కవిత ‘జాగృతి జనం బాట’.. శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు!

Ram Narayana