- కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటరత్నం
- తన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ మృతి
- కుమార్తె జ్ఞాపకార్థం సేవాభావంతో ఆసుపత్రి స్థాపన
- జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి
ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణులు, హైదరాబాద్‌లోని ఉషా ముళ్లపూడి కార్డియాక్ సెంటర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ముళ్లపూడి వెంకటరత్నం (89) సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, తాను స్థాపించిన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో వైద్య రంగంలో విషాదం నెలకొంది.
తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నంలో 1937లో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వెంకటరత్నం, వైద్య వృత్తిపై ఆసక్తితో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి కార్డియాలజీలో ఉన్నత పట్టాలు పొందారు. అక్కడ కార్డియాక్ సర్జన్‌గా మంచి పేరు సంపాదించుకున్నాక, నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు స్వదేశానికి తిరిగి వచ్చారు. 1995 నుంచి 97 వరకు నిమ్స్‌లో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఉచితంగా సేవలందించారు.
అమెరికాలో జరిగిన రైలు ప్రమాదంలో తన చిన్న కుమార్తె ఉష (19) మరణించడంతో ఆమె జ్ఞాపకార్థం సమాజ సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే 2000 సంవత్సరంలో హైదరాబాద్‌లో ‘ఉషా ముళ్లపూడి కార్డియాక్ సెంటర్’ను స్థాపించి పేదలకు తక్కువ ఖర్చుతో గుండె సంబంధిత వైద్య సేవలు అందించడం ప్రారంభించారు. తన ఐదు దశాబ్దాల వైద్య జీవితంలో ఆయన 35 వేలకు పైగా గుండె ఆపరేషన్లు నిర్వహించినట్లు ఆసుపత్రి- వర్గాలు తెలిపాయి.
సోమవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో వెంకటరత్నం అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య నళిని, కుమార్తె జ్యోతి ఉన్నారు.