- ఇరాన్, గల్ఫ్ పరిణామాలపై స్పందించిన భారత విదేశాంగ శాఖ
- అన్ని పక్షాలు సంయమనం పాటించాలని భారత్ విజ్ఞప్తి
- ఇరాన్, ఖతార్, యూఏఈలోని భారతీయులకు ఎంబసీల హెచ్చరికలు
- అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచన
- ఇరాన్‌పై భారీ దాడులు చేస్తున్నామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
ఇరాన్, గల్ఫ్ ప్రాంతంలో శనివారం చోటుచేసుకున్న తాజా పరిణామాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తన వైఖరి వెల్లడించింది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, పరిస్థితులు మరింత దిగజారకుండా చూడాలని భారత్ కోరింది. ముఖ్యంగా పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని భారత విదేశాంగ శాఖ విజ్ఞప్తి చేసింది.
సమస్యల పరిష్కారానికి చర్చలు, దౌత్య మార్గాలే శరణ్యమని విదేశాంగ శాఖ పేర్కొంది. “ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చల ద్వారా ముందుకెళ్లాలి. అన్ని దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను అందరూ గౌరవించాలి” అని ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.
ఆయా ప్రాంతాల్లోని భారతీయ పౌరులతో తమ దౌత్య కార్యాలయాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
మరోవైపు టెహ్రాన్, దోహా (ఖతార్), అబుదాబి (యూఏఈ)లోని భారత రాయబార కార్యాలయాలు అక్కడి భారతీయులకు అత్యవసర అడ్వైజరీలు జారీ చేశాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇరాన్‌లోని భారతీయులు అనవసర ప్రయాణాలు మానుకోవాలని, సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని టెహ్రాన్ ఎంబసీ సూచించింది. అలాగే ఖతార్, యూఏఈలోని భారతీయులు కూడా అప్రమత్తంగా ఉండాలని, సైనిక స్థావరాలకు దూరంగా ఉంటూ స్థానిక అధికారుల ఆదేశాలను పాటించాలని అక్కడి ఎంబసీలు కోరాయి. ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే ఎంబసీలను సంప్రదించాలని హెల్ప్‌లైన్ నంబర్లను వెల్లడించాయి.
ఇరాన్ క్షిపణి వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసే లక్ష్యంతో అమెరికా దళాలు భారీ దాడులు చేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.