మైనారిటీ మహిళలు ఆర్థికంగా ఎదగాలి…. మంత్రి పొంగులేటి
ప్రతి నియోజకవర్గ పరిధిలో సుమారు 200 కుట్టు మిషన్లు పంపిణీ
క్యాంప్ కార్యాలయంలో కూసుమంచి మండల మస్జిద్ కమిటీలకి రంజాన్ గిఫ్ట్ పాకెట్స్, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద ముస్లిం మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు అందజేసిన మంత్రి పొంగులేటి
మైనారిటీ మహిళలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం కూసుమంచి క్యాంప్ కార్యాలయంలో కూసుమంచి మండలానికి చెందిన మస్జిద్ కమిటీలకు రంజాన్ గిఫ్ట్ పాకెట్స్, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద ముస్లిం మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని మైనారిటీ సోదరులు ఒక్కపొద్దులు రోజా ఉంటూ అల్లాను ప్రార్థిస్తూ, సర్వ మత ప్రజలందరూ చల్లగా ఉండాలని ప్రార్థనలు చేస్తూ, పవిత్రమైన మనస్సు చాటుతున్నందుకు అభినందనలు తెలిపారు. అల్లా మైనార్టీ సోదరుల కోరిక తీర్చాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి పేదవానికి అండదండలుగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, ప్రతి నియోజకవర్గ పరిధిలో సుమారు 200 కుట్టుమిషన్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. మైనారిటీ సోదరీమణులు కుట్టు మిషన్లతో వారి నైపుణ్యాన్ని ఉపయోగించి ఆర్థికంగా ఎదగాలని అన్నారు. మహిళలు కూడా సంపాదించడం ప్రారంభించిన తర్వాత కుటుంబాలు మరింత ఆర్థికంగా స్థిరపడతాయని అన్నారు.
*రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ నెలలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని అన్నారు.
అనంతరం పాలేరు నియోజకవర్గానికి చెందిన 163 మంది ముస్లిం మైనారిటీ మహిళా లబ్ధిదారులకు కుట్టు మిషన్లను, కూసుమంచి మండల మస్జిద్ కమిటీలకి 350 రంజాన్ గిఫ్ట్ పాకెట్స్ లను మంత్రి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాలేరు నియోజక వర్గ ప్రత్యేక అధికారి రమేష్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ముజాహిద్, ఖమ్మం ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.