మార్చి నెలాఖరుకు లక్ష ఇందిరమ్మ ఇళ్లు పూర్తి
- కామేపల్లి మండలంలో రూ. 12.48 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన

కామేపల్లి : రాష్ట్రంలోని నిరుపేదలందరికీ సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం కామేపల్లి మండలంలో స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి పర్యటించిన ఆయన సుమారు 12.48 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు, పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు.
అభివృద్ధి పనుల హోరు
మండల వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మంత్రి పలు బీటీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. జాస్తిపల్లి నుంచి కెప్టెన్ బంజర వరకు రూ. 3.15 కోట్లతో చేపట్టే పనులతో పాటు, లాల్యతండ నుంచి జగన్నాథ తండ వరకు రూ. 3.33 కోట్లు, ఊటుకూరులో ముత్యాలంపాడు గుడి నుంచి శ్మశాన వాటిక వరకు రూ. 1.80 కోట్లు, తాళ్ళగూడెం పరిధిలో టేకులతండ, పింజరిమడుగు మీదుగా డోర్నకల్ రోడ్డు వరకు రూ. 4.20 కోట్లతో నిర్మించనున్న రహదారులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలు మంత్రికి ఘనస్వాగతం పలికారు.
గత ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజం
ముచ్చర్ల, పింజరమడుగు గ్రామాల్లో గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించిన అనంతరం మంత్రి సభలో మాట్లాడారు. గత పాలకుల పదేళ్ల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్లు కూడా నిర్మించలేకపోయారని ఆయన విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో పేదలను ఊరించి మోసం చేశారని మండిపడ్డారు. వైఎస్సార్ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను అవహేళన చేసిన వారు, తాము అధికారంలో ఉండి కనీసం ఇళ్లు పూర్తి చేయలేకపోయారని ధ్వజమెత్తారు.

ఏప్రిల్‌లో రెండో విడత
ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని మంత్రి పొంగులేటి తెలిపారు. యుద్ధప్రాతిపదికన పనులు సాగుతున్నాయని, మార్చి చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్లను పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేస్తామని ప్రకటించారు. వచ్చే ఏప్రిల్ నెలలో మరో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని, అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చి తీరుతామని భరోసా ఇచ్చారు.
సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి వివరించారు. ముఖ్యంగా పేదింటి మహిళల కష్టాలను గుర్తించి సన్న బియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల జారీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఊటుకూరులో జరుగుతున్న అభివృద్ధి పనులను వర్షాకాలం లోపే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడంతో పాటు, స్థానిక ఎమ్మెల్యే కోరిన మరిన్ని రహదారి పనులను ఏప్రిల్‌లో మంజూరు చేస్తానని సభాముఖంగా హామీ ఇచ్చారు.