ఏది నిజం ..ఏది అబద్దం …రాష్ట్రంలో గ్యాస్ కొరతపై…
గ్యాస్ కొరత పై ప్రజల గగ్గోలు …అబ్బే అదేంలేదంటున్న మంత్రి ఉత్తమ్
కట్టెల పొయ్యిలతో వంటలు వండుతున్నామంటున్న హోటల్ యజమానులు
ఉస్మానియా యూనివర్సిటీలో సైతం కట్టాలి పొయ్యిలే అంటున్నారు
ఇది మంత్రి ద్రుష్టి రాలేదా …?
రాష్ట్రంలో 810 ఎల్.పి.జి. డిస్ట్రిబ్యూటర్ల
రాష్ట్ర వ్యాప్తంగా కోటి 29 లక్షల ఎల్.పి.జి కనెక్షన్లు
రోజు వారిగా 2.5 లక్షల సిలిండర్ల సరఫరా
రోజు వారిగా 72% బుకింగ్స్ జరుగుతున్నాయి
పశ్చిమాసియా లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కొరత ఉందని ఒక పక్క వినియోగదారులు గగ్గోలు పడుతుండగా అబ్బే అదేంలేదని పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు …అనేక హోటళ్లలో కట్టెలతో వంటలు చేస్తున్నారని వాటిని కూడా రేట్లు పెంచడంతో గగ్గోలు పెడుతున్నారు ..ఉస్మానియా యూనివర్సిటీ లో సైతం విద్యార్థులకు వంట గ్యాస్ అందాకా కట్టెల పొయ్యిపై వంటలు వండుతున్నామని అంటున్నారు యూనివర్సిటీ యాజమాన్యం… దీంతో ప్రజల్లో గందరగోళం ఏర్పడింది ..మంత్రి చెప్పేది నిజామా …?లేక కొరత నిజామా అనేదానిపై ఏది నిజం …ఏది అబద్దం అంటున్నారు
నేడు వివిధ జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్ లో మాట్లాడుతూ రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు
గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని రాష్ట్ర సాగు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.ప్రజల్లో లేని పోనీ అపోహలు సృష్టించి వారిని గందరగోళంలో పడేసేలా జరుగుతున్న ప్రచారంపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో ఎల్.పి.జి. గ్యాస్ సరఫరాపై వినియోగదారులు గందరగోళం చెందుతున్న దృష్టా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఉదయం డాక్టర్ బి.ఆర్. అంబెడ్కర్ సచివాలయంలో, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర లతో కలిసి జిల్లాల కలెక్టర్లు, ఎస్.పి. లు,పోలీస్ కమిషనర్లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఎల్.పి.జి. గ్యాస్ సరఫరా విషయంలో ఎటువంటి గందరగోళానికి గురి కావొద్దని,గృహ వినియోగదారులకు సరిపడా సరఫరా చేస్తామని భరోసా ఇచ్చారు.
సోషల్ మీడియా వేదిక ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారంతోటే కృత్రిమంగా గ్యాస్ కొరత సృష్టించేందుకు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రస్థాయిలో తిప్పి కొట్టారు.ఇటువంటి గందరగోళం ఏర్పడినందునే రోజు వారిగా 72% బుకింగ్స్ జరుగుతున్నాయని అయితే గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రిలకు,విద్యాసంస్థలకు, వృద్దాశ్రమలకు, ప్రభుత్వ సంస్థలకు ప్రాధన్యత క్రమంలో సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 810 ఎల్.పి.జి. డిస్ట్రిబ్యూటర్ల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కోటి 29 లక్షల ఎల్.పి.జి కనెక్షన్లు ఉండగా రోజు వారిగా 2.5 లక్షల సిలిండర్ల సరఫరా జరుగుతుందని ఆయన వివరించారు.ఇప్పటి వరకు రాష్ట్రంలోనీ బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత ఉన్నట్లు ఎక్కడా నమోదు కాలేదని ఆయన చెప్పారు.అపోహలను అడ్డుపెట్టుకుని బ్లాక్ చేయాలని చూస్తే ప్రభుత్వం ఎంత మాత్రం ఉపేక్షించదని, కఠినమైన చర్యలకు ఉపక్రమిస్తుందని ఆయన హెచ్చరించారు.
తాజగా జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా గ్యాస్ నిలువ చేయడం, అక్రమంగా మళ్లించడం, బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడనందుకు గాను ఇప్పటి వరకు 288 కేసులు నమోదు చేశామన్నారు. ఎల్.పి.జి. డిస్ట్రిబ్యూటర్లు ఇదే విధంగా ప్రవర్తిస్తే మరిన్నీ కఠిన చర్యలకు ఉపక్రమించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు, ఎస్.పి. లు, పోలీస్ కమీషనర్లకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.
ఆయా జిల్లాల్లో కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక అధికారుల కమిటీ ఏర్పాటు చేసి రోజువారీ నిల్వలు, సరఫరా పరిస్థితిని సమీక్షించాలని ఆయన సూచించారు.
పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల కొకసారి , గ్రామీణ 45 రోజులకు ఒకమారు ఎల్.పి.జి బుక్ చేసుకోవాలని ఆయన గ్యాస్ వినియోగదారులకు సూచించారు.అదే సమయంలో అపోహలను నమ్మి అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేసుకోవొద్దని, గృహా వినియోగదారులకు సరిపడా గ్యాస సరఫరా చేస్తామని, ప్రభుత్వం దగ్గర ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో పంటలు ఎండి పోకుండా సాగునీరు సరఫరా పై ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పర్యవేక్షించాలని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ, యాసంగి ధాన్యం సేకరణకు గన్నీ లు, ధాన్యం నిల్వ కు స్పేస్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
జిల్లాల్లో వరి సాగు పెరిగిందని,పంటల స్థితి గతులు ననుసరించి సాగు నీరు అందిస్తూ వైవిధ్యత పంటలను ప్రోత్సహించాలని అన్నారు. రాష్ట్రంలో పామాయిల్ సాగుకు జిల్లాలకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, జిల్లాలో 4.96 లక్షల ఎల్. పి.జి. కనెక్షన్లు ఉన్నాయన్నారు. ఆదేశాల మేరకు అన్ని చర్యలు చేపడతామన్నారు.
జిల్లాలో 2.48 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉందని, సాగునీరు సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడతామని అన్నారు. ధాన్య సేకరణ సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. సాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షణ చేయనున్నట్లు కలెక్టర్ అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ శ్రీలత, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, ఇర్రిగేషన్ ఎస్ఇ లు ఎం. వెంకటేశ్వర్లు, వాసంతి, జిల్లా ఇర్రిగేషన్ అధికారి వెంకట్రాం, ఇర్రిగేషన్ ఇ ఇ అననీయ, హార్టికల్చర్ అధికారిణి అనిత, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
గ్యాస్, పెట్రోల్ కొరత…సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు: పొన్నం ప్రభాకర్

ప్రస్తుతం నెలకొన్న గ్యాస్, పెట్రోల్ కొరతకు కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు.
దేశంలో నెలకొన్న గ్యాస్, పెట్రోల్ కొరతకు కేంద్రానిదే పూర్తి బాధ్యతని, అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో కేంద్రం తక్షణమే స్పందించి సరఫరాను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఈ కొరతపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని, వారు తమ బాధ్యతను విస్మరిస్తున్నారని విమర్శించారు.
మూసీ నదిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విజన్ ఉందని, ఈ ప్రాజెక్టుపై ఉన్న అన్ని అనుమానాలను పీపీటీ ద్వారా నివృత్తి చేస్తామని తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని విధాలా న్యాయం చేస్తుందని, వారిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీకి మూసీ ప్రాజెక్టుపై ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని, అందుకే ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
బీజేపీకి రాష్ట్రంలో ఒక అజెండా, దేశంలో మరో అజెండా ఉందని పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని, బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని, దీనిపై అనవసర రాద్ధాంతం చేయవద్దని సూచించారు.
హోటల్ బిల్లులో కొత్త ట్విస్ట్.. టిఫిన్‌తో పాటు గ్యాస్ ఛార్జీలు కూడా!

చెన్నైలో ధరల పెరుగుదల కొత్త పుంతలు తొక్కుతోంది. నిన్న ఉదయం 8:30 గంటల సమయంలో ఒక కస్టమర్ టిఫిన్ చేసి బిల్లు చూసి కంగుతిన్నాడు. అందులో టిఫిన్ ధరల కింద ‘Gas Usage Fee’ పేరుతో అదనపు మొత్తాన్ని వసూలు చేశారు.
“మేము హోటల్‌కు వచ్చేదే వండిన ఆహారం తినడానికి, మళ్ళీ వంట గ్యాస్ ఖర్చు విడిగా కట్టాలా?” అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.
ఇలా గ్యాస్ ఛార్జీలు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని వినియోగదారుల సంఘాలు మండిపడుతున్నాయి.
హైదరాబాద్‌లో తీవ్ర గ్యాస్ కొరత.. పెళ్లి వేడుకలపై నీలినీడలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు దేశీయంగా శుభకార్యాలపై తీవ్రంగా పడుతోంది. అంతర్జాతీయంగా సరఫరా నిలిచిపోవడంతో ఎల్‌పీజీ గ్యాస్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో ఈ నెల 18 నుంచి మొదలుకానున్న పెళ్లిళ్ల సీజన్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్న కుటుంబాలు, అతిథులకు భోజనాలు ఎలా పెట్టాలో తెలియక ఆందోళన చెందుతున్నాయి.
హైదరాబాద్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌లు దాదాపుగా నిలిచిపోయాయి. గ్యాస్ అందుబాటులో లేక నగరంలోని చాలా హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే మూతపడ్డాయి. దీని ప్రభావం నేరుగా క్యాటరింగ్ రంగంపై పడింది. భారీ ఆర్డర్లు తీసుకున్న నిర్వాహకులు, గ్యాస్ లేకుండా వంటలు చేయడం సాధ్యం కాదని చేతులెత్తేస్తున్నారు. తీసుకున్న అడ్వాన్సులను సైతం తిరిగి ఇచ్చేస్తున్నారు.
మార్చి 18 నుంచి మే వరకు పెళ్లిళ్లకు అధికంగా ముహూర్తాలు ఉన్నాయి. కేవలం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే సుమారు 15 వేల వివాహాలు జరగవచ్చని ఒక అంచనా. నగర శివార్లలోని ఫంక్షన్ హాళ్లు, రిసార్టులు జూన్ వరకు బుక్ అయిపోయాయి. అయితే, గ్యాస్ కొరతతో ఇప్పుడు పెళ్లిళ్లు జరపాలా లేక వాయిదా వేసుకోవాలా అని చాలా కుటుంబాలు పునరాలోచనలో పడ్డాయి.
ఈ సంక్షోభం కేవలం పెళ్లిళ్లకే పరిమితం కాలేదు. ఈ సీజన్‌ను నమ్ముకుని జీవించే వేలాది మంది ఉపాధిని దెబ్బతీస్తోంది. క్యాటరింగ్ సిబ్బందితో పాటు పురోహితులు, ఫొటోగ్రాఫర్లు, డెకరేటర్లు, బ్యాండ్ మేళం వంటి ఎన్నో అనుబంధ రంగాల వారికి పని లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. పశ్చిమాసియా నుంచి చమురు, గ్యాస్ దిగుమతులు నిలిచిపోవడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని, యుద్ధం ఇలాగే కొనసాగితే నిత్యావసరాల ధరలు కూడా పెరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సంబంధితశాఖ మంత్రి గ్యాస్ కొరత లేదని అంటున్నారు …మరో మంత్రిగారేమో గ్యాస్ కొరత ఉంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు …ఇందుకు కేంద్రానిదే భాద్యత అని పేర్కొన్నారు… ఇందులో ఏది నిజం ఏది అబద్దం …