అంతర్జాతీయం

నెతన్యాహు తనయుడు ‘మిస్సింగ్’.. వారం రోజులుగా కనిపించని యాయిర్ నెతన్యాహు!

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెన్యామిన్ నెతన్యాహు కుటుంబంపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నెతన్యాహు పెద్ద కుమారుడు యాయీర్ నెతన్యాహు (Yair Netanyahu) గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడా కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, విపక్షాలపై విరుచుకుపడే యాయీర్.. ఈ క్లిష్ట సమయంలో మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

యాయీర్ నెతన్యాహు ఎక్స్ వేదికగా రోజుకు సగటున 30 నుంచి 40 పోస్టులు చేస్తుంటారు. అయితే, మార్చి 8వ తేదీ తర్వాత ఆయన నుంచి ఒక్క పోస్ట్ కూడా రాలేదు. మార్చి 9న ఒక చిన్న రీపోస్ట్ తప్ప, ఆయన సొంతంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఒకవైపు నెతన్యాహు ఆరోగ్యంపై, ప్రాణహానిపై ఇరాన్ అనుకూల మీడియా వార్తలు ప్రసారం చేస్తున్న వేళ, యాయీర్ ఇలా ‘మాయం’ అవ్వడం “కుటుంబంలో ఏదైనా విషాదం జరిగిందా?” అనే పుకార్లకు దారితీసింది.

ప్రస్తుతం యాయీర్ నెతన్యాహు అమెరికాలోని మయామిలో నివసిస్తున్నట్లు సమాచారం. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో అమెరికాలోని ఇజ్రాయెల్ ప్రముఖుల కుటుంబ సభ్యులకు భద్రతా ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా మాజీ నిఘా అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఇలాంటి ఉద్రిక్త సమయాల్లో యాయీర్ వంటి వ్యక్తులు బహిరంగంగా తిరగడం లేదా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం ప్రమాదకరమని, అందుకే ఆయనకు ‘లో ప్రొఫైల్’ మెయింటైన్ చేయాలని సూచించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

నెతన్యాహు మరణించారని వస్తున్న వార్తలను ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తీవ్రంగా ఖండించింది. అవన్నీ ‘ఫేక్ న్యూస్’ అని, ప్రధాని క్షేమంగా ఉన్నారని స్పష్టం చేసింది. యాయీర్ మౌనం కేవలం భద్రతా జాగ్రత్తల్లో భాగంగా తీసుకున్న నిర్ణయమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, ఒక ‘ట్విట్టర్ అడిక్ట్’ ఇలా వారం రోజులు సైలెంట్‌గా ఉండటం మాత్రం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

నెతన్యాహుకు ఇరాన్ ‘డెత్ వార్నింగ్’!

Israel Iran War Escalates Death Threat to Netanyahu

ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా కూటమి మధ్య జరుగుతున్న యుద్ధం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. తమ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహును ‘వేటాడి చంపుతామని’ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్ జీసీ) శనివారం ప్రతిజ్ఞ చేశాయి. నెతన్యాహు ఆచూకీపై సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వస్తున్న తరుణంలో ఆయన ఎక్కడ ఉన్నా వదిలిపెట్టబోమని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. ‘‘అతను బతికే ఉంటే.. అతన్ని వెంబడిస్తాం, పట్టుకుంటాం, చంపేస్తాం’’ అంటూ టెలిగ్రామ్ ఛానల్ వేదికగా ఐఆర్ జీసీ సంచలన ప్రకటన చేసింది.

యుద్ధం 16వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై మరోసారి క్షిపణి దాడి జరిగింది. ఎంబసీ ఆవరణలోని హెలిప్యాడ్‌పై మిస్సైల్ పడటంతో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. మరోవైపు, ఇరాన్‌లోని వ్యూహాత్మక ‘ఖర్గ్ ఐలాండ్’పై అమెరికా జరిపిన బాంబు దాడులను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. ఖర్గ్ ఐలాండ్‌లోని సైనిక స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశామని, అవసరమైతే మరిన్ని దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రపంచ దేశాలన్నీ హర్మూజ్ జలసంధిలో నౌకల రక్షణకు ముందుకు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు.

ఇరాన్ సైన్యం కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ఇజ్రాయెల్‌పై ఐదు సార్లు బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మాట్లాడుతూ.. తమ దేశ చమురు క్షేత్రాలపై దాడి జరిగితే పశ్చిమాసియాలో అమెరికా వాటాలున్న ప్రతి చమురు కేంద్రాన్ని బూడిద చేస్తామని హెచ్చరించారు. ఈ యుద్ధ ప్రభావంతో బహ్రెయిన్, సౌదీ అరేబియాలో జరగాల్సిన ఫార్ములా-1 రేసింగ్‌లు కూడా రద్దయ్యాయి. ఇరు పక్షాల మధ్య దాడులు, ప్రతిదాడులు తీవ్రం కావడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Related posts

నేపాల్ లో లోయలో పడ్డ బస్సు.. ఆరుగురు భారతీయులు సహా ఏడుగురి మృతి

Ram Narayana

పాకిస్థాన్‌కు పాకిన ఇరాన్ సెగ… కరాచీలో కాల్పులు, 9 మంది మృతి…

Ram Narayana

అమెరికా అతిపెద్ద యుద్ధనౌకలో వింత కష్టాలు… టాయిలెట్లతో తిప్పలు!

Ram Narayana