ఈ రోజు హైదరాబాద్ హిమాయత్ నగర్లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా నూతన అక్రిడేషన్ కార్డుల పంపిణీ జరిగింది. మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి తో పాటు అక్రిడేషన్ కార్డుల సెలక్షన్ కమిటీ సభ్యులు, పలువురు ప్రముఖ జర్నలిస్టులు కార్డులను అందుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నూతన అక్రిడేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించామన్నారు. రేపటి నుంచి జిల్లాల్లో అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులను జారీ చేసేలా జిల్లా కలెక్టర్లను ఆదేశించామని వెల్లడించారు. కార్డుల పంపిణీ పూర్తయిన తరువాత జర్నలిస్టుల సంక్షేమానికి చేపట్టవలసిన వివిధ కార్యక్రమాల గురించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
అదే విధంగా ఒక సంస్థలో అక్రిడేషన్ కార్డు పొందిన జర్నలిస్టులు మరో సంస్థకు మారినప్పుడు వారు కార్డు రిప్లేస్మెంట్ చేసుకునే అవకాశాన్ని కూడా ప్రజాప్రభుత్వంలో కల్పిస్తున్నామని ప్రకటించారు. కార్డుల పంపిణీలో ఆలస్యమైనా కూడా పారదర్శకమైన విధానాలను అవలంబించడానికే ప్రాధాన్యమిచ్చామని మంత్రి పొంగులేటి గారు స్పష్టం చేశారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా సుమారు 46వేల మందికిపైగా జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులను జారీ చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేశ్ షెట్కర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి , మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి , ఐఅండ్పీఆర్ కమిషనర్ ముకుందరెడ్డి , అక్రిడేషన్ సెలక్షన్ కమిటీ సభ్యులు, అధికారులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టులకు గుడ్ న్యూస్..
రేపటి నుంచి కొత్త అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ
కలెక్టర్లకు కీలక ఆదేశాలు..
తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 1 నుంచి 10లోపు అర్హులైన జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడిటేషన్ కార్డులను అందజేయాలని సమాచార పౌర సంబంధాల శాఖ స్పష్టం చేసింది.
2022-2024 సంవత్సరాలకు గాను గతంలో జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈ నెల 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో జర్నలిస్టులకు ఇబ్బంది కలగకుండా కొత్త కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కలెక్టర్లకు కీలక ఆదేశాలు..
సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి ఏప్రిల్ 28న నిర్వహించిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు, స్పెషల్ కమిషనర్ జి.ముకుంద రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జిల్లాలో జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటి సమావేశాలను ఏప్రిల్ 30లోపు పూర్తి చేయాలని తెలిపారు. ఆయా అక్రిడిటేషన్ కమిటీల ఆమోదం పొందిన అర్హులైన జర్నలిస్టులకు మే 1 నుంచి మే 10లోపు అక్రిడిటేషన్ కార్డులను జారీ చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, ప్రభుత్వానికి నివేదికను పంపాలని కలెక్టర్లకు సమాచారం అందించారు. ఈ మేరకు జిల్లా పౌర సంబంధాల అధికారులు (DPROs) తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది జర్నలిస్టులకు లబ్ధి చేకూరనుంది.