Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీలో రెండో అధికార భాషగా ఉర్దూకు గుర్తింపు.. నోటిఫికేషన్ జారీ!

ఏపీలో రెండో అధికార భాషగా ఉర్దూకు గుర్తింపు.. నోటిఫికేషన్ జారీ!

  • అన్ని జిల్లాలలోను అమలు చేయాలని ఆదేశాలు 
  • గత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం
  • ఇకపై తెలుగుతోపాటు ఉర్దూలోనూ ప్రభుత్వ కార్యకలాపాలు
  • ఉర్దూ ఓ మతానికి చెందిన భాష కాదన్న డిప్యూటీ సీఎం అంజాద్ బాషా

ఆంధ్రప్రదేశ్‌లో ఉర్దూకు రెండో అధికార భాషగా గుర్తింపు లభించింది. ఉర్దూను రాష్ట్ర రెండవ అధికారిక భాషగా గుర్తిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని వెంటనే దీనిని అమలు చేయాలని సదరు నోటిఫికేషన్ ప్రభుత్వం ఆదేశించింది.

గత అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశపెట్టిన అధికార భాషల చట్ట సవరణ-2022 బిల్లును సభ ఆమోదించిన సంగతి విదితమే. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఈ బిల్లును ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతోపాటు రాష్ట్రంలో మైనార్టీల భద్రత, సామాజిక అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన ఏపీ మైనార్టీస్ కాంపొనెంట్, ఆర్ధిక వనరులు, వ్యయ కేటాయింపులు, వినియోగ చట్టం 2022కు కూడా నాడు అసెంబ్లీ ఆమోదం లభించింది.

ఇక ఉర్దూకు రాష్ట్ర రెండవ అధికార భాషగా గుర్తింపు దక్కడంపై మంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ.. ఉర్దూ ఓ మతానికి సంబంధించిన భాష కాదన్నారు. తెలుగుతో సమానంగా ఉర్దూకు కూడా సమాన హోదా లభించినందుకు సీఎం జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఉర్దూ ఇప్పటికే రెండో అధికారిక భాషగా కొనసాగుతోంది. ఉర్దూను అధికారిక భాషగా గుర్తించడంతో ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అధికార కార్యకలాపాలు, ఉత్తర, ప్రత్యుత్తరాలు తెలుగుతో పాటు ఉర్దూలో కూడా కొనసాగనున్నాయి.

Related posts

ఓటీటీలో తెలుగు బిగ్‌బాస్ షో.. నాగార్జున‌పై మండిప‌డ్డ సీపీఐ నారాయ‌ణ‌!

Drukpadam

చీమలపాడు ఘటనలో మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకోవాలి: సీపీఐ(ఎం)

Drukpadam

The Healthiest Smoothie Orders at Jamba Juice, Robeks

Drukpadam

Leave a Comment