రాహుల్ గాంధీ అనర్హతకు గురయినట్టే!: కపిల్ సిబాల్!
- మోదీపై వ్యాఖ్యల కేసులో రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష
- చట్టం ప్రకారం రాహుల్ ఆటోమేటిక్ గా అనర్హతకు గురయినట్టేనన్న కపిల్ సిబాల్
- తీర్పుపై స్టే వస్తేనే ఎంపీగా కొనసాగుతారని వివరణ
ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ లోని కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు ఆయనకు వెంటనే బెయిల్ మంజూరు చేసింది. పైకోర్టుకు అప్పీల్ చేసుకునేందుకు రాహుల్ కు కోర్టు 30 రోజుల సమయాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి కపిల్ సిబాల్ స్పందిస్తూ… కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించడంతో ఆయన ఆటోమేటిక్ గా అనర్హతకు గురయ్యారని చెప్పారు. ఇదొక విచిత్రమైన పరిస్థితి అని అన్నారు. చట్టం ప్రకారం రాహుల్ అనర్హతకు గురయినట్టేనని తెలిపారు.
కోర్టు తీర్పుపై స్టే వస్తేనే లోక్ సభ సభ్యుడిగా రాహుల్ కొనసాగుతారని కపిల్ సిబాల్ చెప్పారు. చట్టం ప్రకారం ఎవరైనా ప్రజాప్రతినిధి రెండేళ్ల జైలు శిక్షకు గురైతే ఆ సభ్యుడి స్థానం ఖాళీ అయినట్టేనని తెలిపారు. చట్టాన్ని అనుసరించి లోక్ సభ స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. 2013లో లిల్లీ థామస్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన గుర్తు చేశారు. ఏదైనా కేసులో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి కనీసం రెండేళ్ల జైలు శిక్షను విధించినట్టయితే తక్షణమే వారి అనర్హత అమల్లోకి వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు.