- వాతావరణం తమకు అనుకూలంగా లేదనే బీజేపీ ఉమ్మడి పౌర స్మృతి అంశాన్ని తెచ్చిందన్న పవార్
- సిక్కులు, జైనులు, క్రిస్టియన్ వర్గాలు తమ అభిప్రాయం వెల్లడించాల్సి ఉందన్న పవార్
- ముందు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని సూచన
ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని గమనించిన కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతి అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చిందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గురువారం ఆరోపించారు. దేశంలో ప్రస్తుత రాజకీయ వాతావరణం తమకు అనుకూలంగా లేనందున ప్రజల దృష్టిని మళ్లించేందుకు మోదీ యూసీసీ అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ఈ అంశాన్ని కేంద్రం లా కమిషన్ కు నివేదించిందని, కమిషన్ వివిధ వర్గాలు, సంస్థల నుండి ప్రతిపాదనలను కోరిందన్నారు.
ఇప్పటి వరకు లా కమిషన్ కు 900 ప్రతిపాదనలు వచ్చాయని, వీటిలో ఏముందనేది తనకు తెలియదన్నారు. ఈ ప్రతిపాదనలను కమిషన్ బహిర్గతం చేయలేదన్నారు. ఇక ఉమ్మడి పౌర స్మృతిపై సిక్కులు, జైనులు, క్రిస్టియన్ వర్గాలు తమ అభిప్రాయం వెల్లడించాల్సి ఉందన్నారు. సిక్కులు దీనిపై భిన్న వైఖరితో ఉన్నట్లు చెప్పారు. ఈ వర్గం వైఖరిని విస్మరించరాదన్నారు. ఉమ్మడి పౌర స్మృతి కంటే ముందు లోక్ సభలో, శాసన సభలలో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని పవార్ సూచించారు.
అంత అవసరం ఏమొచ్చింది?: ప్రధాని మోదీపై స్టాలిన్ తీవ్ర విమర్శలు
- ఉమ్మడి పౌర స్మృతిపై స్టాలిన్ విమర్శలు
- మతపరమైన ఘర్షణలను సృష్టించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నమని ఆరోపణ
- ఎన్నికల్లో నెగ్గేందుకు ప్రజల్ని ఆయన కన్‌ఫ్యూజ్ చేస్తున్నారని వ్యాఖ్య
ఉమ్మడి పౌర స్మృతిపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గురువారం విమర్శలు గుప్పించారు. దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై స్టాలిన్ స్పందించారు. దేశంలో మతపరమైన ఘర్షణలను సృష్టించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని, ఎన్నికల్లో నెగ్గేందుకు ప్రజల్ని ఆయన కన్‌ఫ్యూజ్ చేస్తున్నారన్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు.
పాట్నాలోని జరిగిన విపక్షాల భేటీ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ భయపడ్డారన్నారు. అందుకే ఆయన కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడారని విమర్శించారు. తన తండ్రి, మాజీ సీఎం కరుణానిధి తనను కేవలం ఓ కొడుకులా చూడలేదని, ఆయనకు పార్టీ కార్యకర్తలు అందరూ కుమారులే అన్నారు.
బీజేపీ అధికారంలో ఉన్న మణిపూర్‌లో కలహాలతో అతలాకుతలమవుతోందని స్టాలిన్ చెబుతూ, అక్కడ పర్యటించనందుకు ప్రధాని మోదీపై మండిపడ్డారు. గత 50 రోజులుగా మణిపూర్ కాలిపోతోందని, ఇప్పటి వరకు 150 మంది చనిపోయారని, వేలమంది రాష్ట్రం విడిచి పారిపోయారని, కానీ ప్రధాని ఇప్పటి వరకు అక్కడకు వెళ్లలేదన్నారు. అమిత్ షా 50 రోజుల తర్వాత మాత్రమే అఖిలపక్ష సమావేశం నిర్వహించారన్నారు.