Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీఆర్ యస్ బలహీనపడింది …మండలి చైర్మన్ గుత్తా ఆసక్తికర వ్యాఖ్యలు …

 బీఆర్ఎస్ ఓటమికి కారణాలు చెబుతూ బ్లాస్టింగ్ కామెంట్స్ చేసిన నేత గుత్తా

  • నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో పార్టీ బలహీనపడిందన్న గుత్తా
  • ఆయా జిల్లాలకు చెందిన గత మంత్రుల అహంకారపూరిత వ్యాఖ్యలే అందుకు కారణమని వ్యాఖ్యలు
  • పరిస్థితి ఇలా ఉన్నా పార్టీ సమీక్షించుకోవడం లేదని విమర్శ
  • అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందే కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం మానేశారని ఆరోపణ
  • జేబులో రూ. 500 కూడా లేనోళ్లు నేడు కోట్లకు అధిపతులయ్యారని ఆరోపణ
  • ఉద్యమకారుల ముసుగులో కోట్లు సంపాదించుకున్నారని ఆగ్రహం

బీఆర్ఎస్‌పై సొంత పార్టీ నేత, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నేడు ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం కావడానికి.. నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో పార్టీ దారుణంగా దెబ్బతినడానికి ఆయా జిల్లాలకు చెందిన గత మంత్రులే కారణమని చెప్పారు. వారి అహంకారపూరిత వ్యాఖ్యలే పార్టీని ఈ పరిస్థితికి తీసుకొచ్చాయని మండిపడ్డారు. పరిస్థితి ఇలా ఉన్నా ఇప్పటికీ సమీక్షించుకోకపోవడం దురదృష్టకరమని వాపోయారు. పార్టీలో అంతర్గత సమస్యలు ఉన్న మాట వాస్తవమేనన్న ఆయన శాసనసభ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే పార్టీ నేతలకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం మానేశారని ఆరోపించారు.

ఒకప్పుడు జేబులో రూ. 500 కూడా లేని నేతలు ఇప్పుడు కోట్ల రూపాయలకు అధిపతులయ్యారని పేర్కొన్నారు. ఉద్యమకారుల ముసుగులో కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని ఆరోపించారు. జిల్లాకు చెందిన నేతలు కొందరు తాను కేసీఆర్‌ను కలవకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అప్పట్లో తనను 16సార్లు కలిసి, మంత్రి మండలిలోకి తీసుకుంటానని హామీ ఇచ్చాకే పార్టీ మారానని గుర్తుచేసుకున్నారు. తన కుమారుడు అమిత్ పోటీకి ఆసక్తి చూపిస్తే, జిల్లాకు చెందిన కొందరు నేతలు సహకరించలేదని, అందుకనే పోటీనుంచి తప్పుకున్నాడని తెలిపారు. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

బీఆర్ఎస్‌లో నిర్మాణ లోపం, అంతర్గత ప్రజాస్వామ్యం లోపించాయన్నారు. ఎమ్మెల్యే కేంద్రంగా రాజకీయాలు చేయడం వల్లే బీఆర్ఎస్ కష్టాల్లో పడిందని అభిప్రాయపడ్డారు.

ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఆ పార్టీ చేసిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. న్యాయబద్ధంగా… రాజ్యాంగబద్ధంగా తన నిర్ణయం ఉంటుందన్నారు.

తన కొడుకు అమిత్ రెడ్డికి బీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వలేదనేది వాస్తవం కాదన్నారు. అమిత్‌ను పోటీలోకి దించాలని అధినేత కేసీఆర్ స్వయంగా కోరినట్లు చెప్పారు. లోక్ సభకు పోటీ చేసేందుకు అమిత్ కూడా సిద్ధపడ్డారని, కానీ జిల్లా నాయకుల నుంచి సహకారం అందలేదన్నారు. కొందరు నేతలు అయితే తాము పార్టీని వీడుతున్నట్లు చెప్పారని… దీంతో అమిత్ పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు.

Related posts

తెలంగాణ బీజేపీకి మరో షాక్.. సొంతగూటికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

Ram Narayana

పొంగులేటి టార్గెట్ గా …గులాబీ ఆకర్ష్ మంత్రం ….!

Ram Narayana

ధర్నా పేరుతో ట్రాఫిక్ జాం చేసిన సీఎంపై సీవీ ఆనంద్ కేసు పెట్టాలి: హరీశ్ రావు

Ram Narayana

Leave a Comment