- రిక్టర్ స్కేలుపై 7.1 పాయింట్లుగా నమోదైన తీవ్రత
- ఢిల్లీ, బిహార్, అసోం, పశ్చిమ బెంగాల్ లలోనూ కంపించిన భూమి
- 2015 నాటి భూకంపంలో నేపాల్ లో 9 వేల మందికి పైగా మృతి
టిబెట్ లో పెను భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో నేపాల్ – టిబెట్ సరిహద్దుల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1 పాయింట్లుగా నమోదైంది. పలు భవనాలు, భారీ వృక్షాలు నేలమట్టం అయ్యాయి. భూకంపం కారణంగా ఇప్పటి వరకు 32 మంది మరణించారని టిబెట్ అధికారవర్గాలు తెలిపాయి. ఈమేరకు చైనా అధికారిక మీడియా సంస్థ జిన్హువా వార్తా కథనాలు ప్రసారం చేసింది. భూ ప్రకంపనలు అటు నేపాల్ లో, ఇటు ఇండియాలోని పలు రాష్ట్రాల్లోనూ నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో, బిహార్, అసోం, పశ్చిమ బెంగాల్ లోనూ భూమి కంపించింది.
మంగళవారం ఉదయం వెంటవెంటనే మూడుసార్లు భూమి కంపించిందని, మొదటి భూకంపం తీవ్రత 7.1 పాయింట్లు కాగా ఉదయం 7:02 గంటలకు 4.7 తీవ్రతతో మరోసారి భూమి కంపించిందని, తర్వాత 5 నిమిషాలకు 4.9 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ట్వీట్ చేసింది. భౌగోళిక పరిస్థితులు, భూగర్భంలోని టెక్టానిక్ ప్లేట్స్ కదలికల కారణంగా హిమాలయాల పక్కనే ఉన్న నేపాల్ లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2015లో సంభవించిన పెను భూకంపంలో దాదాపు 9 వేల మంది చనిపోగా, 25 వేల మందికి పైగా గాయపడ్డారు. దాదాపు 5 లక్షలకు పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి.
నేపాల్‌ను వణికించిన భారీ భూకంపం
- ఉదయం 6.35 గంటల ప్రాంతంలో భూకంపం
- రిక్టర్ స్కేలుపై 7.1గా తీవ్ర నమోదు
- భారత్‌లోని పలు రాష్ట్రాల్లోనూ భూ ప్రకంపనలు
- పొరుగునే ఉన్న చైనా, భూటాన్, బంగ్లాదేశ్‌పైనా ప్రభావం
భారీ భూకంపం ఒకటి ఈ ఉదయం నేపాల్‌ను కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 7.1గా నమోదైంది. నేపాల్-టిబెట్ సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచె ప్రాంతంలో ఉదయం 6.35 గంటల సమయంలో భూమి కంపించింది. టిబెట్‌లోని షిజాంగ్‌లో భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. నేపాల్ రాజధాని కఠ్మాండూతోపాటు పలు జిల్లాల్లో ప్రకంపనలు కనిపించాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, భూకంపం కారణంగా సంభవించిన నష్టంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.
నేపాల్‌లో సంభవించిన భూకంప ప్రభావం మన దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలపైనా పడింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్, పశ్చిమ బెంగాల్, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. అలాగే, చైనా, భూటాన్, బంగ్లాదేశ్‌లోనూ భూమి ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కాగా, 2015 ఏప్రిల్‌లో నేపాల్‌లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా దాదాపు 9 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.