జగన్ కంచుకోట పులివెందులలో ఆ పార్టీకి డిపాజిట్ గల్లంతు…
పులివెందుల , ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఏకపక్ష విజయం
రెండు పోలింగ్ బూతులతో రీపోలింగ్ తో పాటు కౌంటింగ్ బహిస్కరించిన వైసీపీ
దొంగఓట్లు ,రిగ్గింగ్ , బూతు క్యాప్చరింగ్ చేసి గెలిచారంటున్న వైసీపీ
అనుకున్నట్లుగానే జరిగింది …జగన్ కంచుకోటకు బీటలుబారాయి …తనకు తిరుగులేదనుకున్న పులివెందులలో పార్టీ ఓటమి తెలిసిందే అయినప్పటికీ శ్రేణులను కుంగ దీసింది …పక్కనే ఉన్న ఒంటిమిట్టలో సైతం వైసీపీ ఓటమి ఆపార్టీకి కోలుకోలేని దెబ్బతీసింది …మొదటి నుంచి ఎన్నికల ప్రక్రియ పై తమ అనుమానాలు నిజమైయ్యాయని వైసీపీ అంటుంది … నిన్న రెండు బూతులతో జరిగిన రీపోలింగ్ తోపాటు జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ను పార్టీ బహిష్కరించింది …దొంగఓట్లు , రిగ్గింగ్ , బూతు క్యాప్చరింగ్ లతో గెలిచారని వైసీపీ ఆరోపిస్తుంది …అక్కడ 30 సంత్సరాలుగా పులివెందులలో ప్రజాస్వామ్యమికంగా ఎన్నికలు జరగలేదని ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ గెలిచిందని టీడీపీ అంటుంది …ఇప్పటికే వైసీపీ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై హైకోర్టు ను ఆశ్రయించింది ..
వైఎస్ కంచుకోట పులివెందులలో టీడీపీ ఘన విజయం.. డిపాజిట్ కోల్పోయిన వైసీపీ!
- పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం
- టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6,735 ఓట్లు
- వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 685 ఓట్లు
ఏపీ రాజకీయాల్లో సంచలనం నమోదయింది. నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన పులివెందులలో టీడీపీ సత్తా చాటింది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. జగన్ అడ్డాలో టీడీపీ అందరి అంచనాలకు మించిన ఆధిక్యతతో ఘన విజయాన్ని సాధించింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి (బీటెక్ రవి భార్య) 6,050 ఓట్ల భారీ మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు.
పులివెందుల ఉప ఎన్నికలో మొత్తం 8,103 ఓట్లు పోలయ్యాయి. మారెడ్డి లతారెడ్డికి 6,735 ఓట్లు పడ్డాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 685 ఓట్లు మాత్రమే పడ్డాయి. లతారెడ్డికి, హేమంత్ రెడ్డికి హోరాహోరీ పోరు ఉంటుందని అందరూ భావించారు. కానీ, వైసీపీ అభ్యర్థి కనీసం వెయ్యి ఓట్లు కూడా సాధించలేకపోయారు. జగన్ గడ్డపై ఘన విజయం సాధించడంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఘోర పరాభవంతో వైసీపీ శ్రేణులు డీలా పడ్డాయి.
ఒంటిమిట్టలో కూడా వైసీపీకి ఘోర పరాభవం… టీడీపీ ఘన విజయం…

- వైసీపీ అభ్యర్థిపై టీడీపీ 6,267 ఓట్లతో ఘన విజయం
- టీడీపీ అభ్యర్థి కృష్ణారెడ్డికి 12,780 ఓట్లు
- వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు
కడప జిల్లాలో జరిగిన రెండు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఇప్పటికే పులివెందులలో తిరుగులేని విజయం సాధించి చరిత్ర సృష్టించిన టీడీపీ… ఒంటిమిట్ట జడ్పీటీసీని కూడా కైవసం చేసుకుంది. ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి 12,780 ఓట్లు రాగా… వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి కృష్ణారెడ్డి వైసీపీ అభ్యర్థిపై 6,267 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. వైసీపీ అధినేత జగన్ గడ్డపై రెండు జడ్పీటీసీలను స్వీప్ చేయడంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. పులివెందులలో వైసీపీకి డిపాజిట్ కూడా దక్కకపోవడం గమనార్హం.