ఎంటర్టైన్మెంట్ వార్తలు

శిల్పీనీవే! శిల్పమునీవే! సృష్ఠిలో

శిల్పీ నీవే! శిల్పము నీవే! సృష్ఠిలో
నిన్ను నువ్వు మలుచుకుంటు నిలిచిపో చరితలో
పుడమిలో అణువణువు నీదె పరవశించుట నేర్చుకో
జీవితం ఇక మల్లిరాదు సార్ధకం చేసుకో!

శిలానీవే శిల్పినీవే..!!

పాడిపంటలు పసిడిరాసులు ఆలమందలు పాలధారలు
గరకపువ్వులు గడ్డిపాన్పులు తుమ్మెదలు తూనీగనవ్వు లు
ఎన్నో ఉండి ఏమిలేదని బాదపడతావెందుకో
జీవించటంలో ఉన్నమధురిమ తెలుసుకోలేవెందుకో!

శిలానీవే శిల్పినీవే..!!

పండువెన్నెల నిండుపున్నమి సందెవెలుగులు ఇందధ్రనసులు
సూర్య చంద్రులు క్రాంతిధారాలు విశ్వమున విరబూసె తారలు
పుడమి ఎంత గొప్పదో! మన పుటుకెంత భాగ్యమో!!
పుడమి ఎంత గొప్పదో! మన పుట్టుకెంత భాగ్యమో!!

శిలానీవే శిల్పినీవే..!!

కొండకోనలు వాగువంకలు జంటగువ్వలు జుంటుతేనెలు
రామచిలుకలు గోరువంకలు కోయిలలు కోనంగులాటలు
తనివి తీరదు, తనువు చాలదు, జీవితంపై ఆశ సడలదు
తనివి తీరదు, తనువు చాలదు, జీవితంపై ఆశ సడలదు!

శిలానీవే శిల్పినీవే..!!

వెలుగులను వేటాడు చీకటి చీకటిని చండాడు వెలుగులు
పగలురాత్రి రాత్రిపగలు జననమరణం మరణంజననం
క్షణము క్షణమొక మధురగానం, జీవితం చిగురాకు తరుణం!
క్షణము క్షణమొక మధురగానం, జీవితం చిగురాకు తరుణం!

శిలానీవే శిల్పినీవే..!!

నీటిలో మన జన్మ ఉన్నది, నిప్పులో చైతన్యమున్నది,
గాలిలో మకరందమున్నది, భూమిపైనే జీవమున్నది,
అమ్మతనమే అంతరాత్మగా సాగిపోతుందీ ధరణి!
సృష్టికి ప్రతిసృష్టినిస్తూ కదిలిపోతుందీ జననీ!!

శిలానీవే శిల్పినీవే..!!

పక్రృతే మన పంచప్రాణం, పక్రృతేమన హరితహారం,
పక్రృతే మన కల్పవల్లి, పక్రృతేమన కన్నతల్లీ,
పక్రృతిని కాపాడినపుడే ప్రగతిసాగెనో,
పక్రృతి విధ్వంసమయితే ప్రాణామాగెనో!

శిలానీవే శిల్పినీవే..!!

కలలు కనకుండా సంద్రం అలలుమీటేనా,
కదలిరాకుండా మేఘం నదిగామారేనా,
చినుకుచినుకు ఓడిసిపడితెనే సిరులుపండేదీ!
శమ్రకు జీవం పోసినవుడే కడుపునిండేదీ!!

శిలానీవే శిల్పినీవే..!!

కాలమన్నది తిరిగిరానిది కాలచక్రము ఆగిపోనిది
కాలముకు వెలకట్టగలమా కాలమును భయపెట్టగలమా
కాలమన్నది దాచిపెడితే దాగివుంటుందా?!
కాలగమనం తెలియకుండా ఫలితముంటుందా?!!

శిలానీవే శిల్పినీవే..!!

కొట్టినా నీ మేలు మరవని గట్టి గుణమీ చెట్టులో,
ఆకు తెంచితే పాలుకారే అమ్మతనమీ కొమ్మలో,
సృష్టిలో ప్రతి జీవజాతికి సృజన ఉన్నదినేర్చు కో!
పక్రృతిని కాపాడి నేలకు పర్యావరణం ఇచ్చి పో…!!

శిలానీవే శిల్పినీవే..!!

కడుపులో పదినెలలు మోసి కంటికి రెప్పోలేకాసి,
బరువుబాధ్యతలెన్నొ చూసి బతుకునంతా ధారపోసి,
తల్లిదండ్రికి మించినా దైవముంటుందా?!
అమ్మానాన్నల కంటే మించిన ఆస్తులుంటాయా ?!!

శిలానీవే శిల్పినీవే..!!

ప్రేమకు కొలమానముందా? పెళ్ళికి ఒక రూపముందా?
భార్యాభర్తల బంధమన్నది బతుకునా విడదీయ్యలేనిది,
ఒకరి బాధ్యత ఒకరు మోసెబలముఉన్నది ప్రేమలో!
ఒకరికోసం ఒకరు బతికే త్యాగమున్నది చెలిమిలో!!

శిలానీవే శిల్పినీవే..!!

తల్లిదండ్రులు, భార్యపిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు,
కొడుకులు, కోడళ్ళు, వాళ్ల మనవలు, మునిమనమరాళ్ళు,
పాతతరమే కొత్తతరముగా ప్రతిఫలిస్తుందో!
జన్మకు ప్రతిజన్మగా సాగిపోతుందో!!

శిలానీవే శిల్పినీవే..!!

మట్టిలో మమకారమున్నది, చెట్టులో మన ప్రాణమున్నది,
పుట్టుకకు ఓ లెక్కవున్నది, పట్టుదలకో లక్ష్యమున్నది,
సాధనె నీ ఊపిరై సాగిపోవాలీ!
ధైర్యమే నీ బలముగా గెలిచితీరాలీ!!

శిలానీవే శిల్పినీవే..!!

గాయపడకుండా హృదయం గేయమవుతుందా?
కలత పడకుండా మెదడు కావ్యమౌతుందా?
ఉలికి భయపడితే శిలలు శిల్పా మౌతాయా?
అలకు భయపడితె నావ దరికిచేరినా?
ఆటుపోటులు ఎదురుదెబ్బలు లేనిజీవితమున్నదా?!
ఓర్పు నుచవిచూడకుండా మార్పు కుతాఉన్నా దా ?!!

శిలానీవే శిల్పినీవే..!!

వెన్ను నిమిరితే ఎగిరిపడకు, వెన్నుపోటుకు బెదిరిపోకు,
నమ్మి నువ్వు మోసపోకు, నమ్మి నోళ్లను వదులుకోకు
ఏదిధర్మమో, ఏదధర్మమో, ఏదిసత్యమో, ఏదసత్యమో,
ఏదిస్వా ర్థమో, ఏదివ్యర్ధమో తెలిసినడవాలో!!

శిలానీవే శిల్పినీవే..!!

కత్తితో సాధించలేనిది కరుణతో సాధించవచ్చు,
పోరులో నువ్వు గెలవలేనిది ప్రేమతో నువ్వు గెలవవచ్చు,
మంచిపనులే మనిషికి గీటురాయీ!
మనిషి పోయినంక మిగిలె గురుతులోయీ!!

శిలానీవే శిల్పినీవే..!!

దేవుడిని చేసింది నీవు, దైవముగ కొలిచింది నీవు,
మతములను సృస్టించి జనుల మతులను మార్చింది నీవు,
మానవత్వమే మనిషికీ మతము కావాలో!
మనుషులంతా ఒక్కటేనని హితము పలకలో!!

శిలానీవే శిల్పినీవే..!!

మత్తులో పడి మాసిపోకు, మరణమును కొని తెచ్చుకోకు,
వస్తువుకు నువ్వు బానిసవకు, స్వార్ధముతో దిగజారిపోకు,
బానిసత్వం వదలకుండా బాగుపడలేమో!
బతుకు అర్థం తెలియకుండా మసలుకోరాదో!!

శిలానీవే శిల్పినీవే..!!

కులములన్నియు కూలిపోవును, మతములన్నియు మాసిపోవును,
జ్ఞానమొకటే మిగిలిపోవును, త్యాగమొకటే నిలిచిపోవును,
విజ్ఞానమే విశ్వాంతరాలను దాటివస్తుందో!
త్యాగమే నీ చరితను తిరిగిరాస్తుందో!!

శిలానీవే శిల్పి నివే..!!

విజ్ఞానమొక్కటే చాలాదు వివేకమును అలవరచుకో,
ధనము ఒక్కటే చాలదు నీ గుణమును సరిచేసుకో,
కలిమిలేములు కష్టసుఖములు కాలగమనం తెలుసుకో,
మనిషి రుషిగా మారేటందుకు మార్గమన్నది ఎంచుకో!!

శిలానీవే శిల్పినీవే..!!

కన్ను మిన్ను ఎరుగకుండా కండకావరమొచ్చినా,
అదుపుతప్పి మదుపుతప్పి ఆస్తుపాస్తులు పెరిగినా,
అంగబలమూ, అర్ధబలమధికారబలముతో ఊగినా,
మానవత్వం విడిచినంకా మనిషి విలువేముండునా!!

శిలానీవే శిల్పినీవే..!!

ఇల్లు శుభత్ర, ఒళ్ళు శుభత్ర, మనసు శుభత్ర, మాట శుభత్ర, 
నడిచినా నీ నడత శుభత్ర, బతికినా నీ బతుకు శుభత్ర,
శుభ్రతే సువిశాల హృదయం కలిగిఉంటుందో!
శుభ్రతే ఈ మలినమంతా శుద్ధిచేస్తుందో!!

శిలానీవే శిల్పినీవే..!!

ఆడపిల్లను పుట్టనివ్వు, ఆడపిల్లను పెరగనివ్వు,
ఆడపిల్లను చదవనివ్వు, ఆడపిల్లను ఎదగనివ్వు,
ఆడపిల్లలే పుడమికి ఆనవాళ్లు!
ఆడజన్మే లేకపోతే అమ్మలేదు!!

శిలానీవే శిల్పినీవే..!!

స్నేహమే మన జిందగీ, స్నేహమే మన బందగీ,
స్నేహమే మన సన్నిధి, స్నేహమే మన పెన్నిది,
స్నేహమేలే జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా!
స్నేహమే మన దారిపొడుగునా నీడనిచ్చే తోడులా!!

శిలానీవే శిల్పినీవే..!!

పాడిపంటలు కల్లదేశము పస్తులతో అల్లాడు తరుణం,
పేదలే నిరుపేదలై, ధనవంతులే ధనవంతులై,
ఆకలితో జనమొక్కటైతే ఆగమేనోయీ!
అంతరాలు లేని లోకమే శాంతివనమోయీ!!

శిలానీవే శిల్పినీవే..!!

Related posts

గద్దర్ అవార్డుల ప్రకటన.. చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం…

Ram Narayana

గన్నవరం విమానాశ్రయంలో జగన్ తో సినీ నటుడు బ్రహ్మానందం…

Ram Narayana

వివాదంలో జన నాయగన్ మూవీ.. ఎందుకు రిలీజ్ కాలేదో ప్రజలకు తెలుసన్న విజయ్ తండ్రి!

Ram Narayana