నిరసన జ్వాలల్లో నేపాల్.. ప్రధాని అధికారిక నివాసానికి నిప్పు
ప్రధాని ఓలీ రాజీనామా..అధ్యక్షుడు పౌడెల్ రాజీనామా
నేపాల్‌ను చుట్టుముట్టిన నిరసన జ్వాలలు
ప్రధాని అధికారిక నివాసానికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు
అధ్యక్షుడు, మాజీ ప్రధానుల ఇళ్లు, పార్టీ ఆఫీసులపై దాడులు
సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేసినా శాంతించని యువత
పరిస్థితిపై చర్చకు ప్రధాని ఓలీ అఖిలపక్ష భేటీ
సోషల్ మీడియాపై నిషేధంతో మొదలైన ఆందోళనలు
పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగిన సైన్యం
నేపాల్ ప్రభుత్వాన్నే గడగడలాడించిన 36 ఏళ్ల యువనేత.. ఎవరీ సుడాన్ గురుంగ్?
జెన్‌జెడ్ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన సుడాన్ గురుంగ్
ఉద్యమానికి ఊపిరి పోసిన పిలుపు
పోలీసులు కాల్పులు జరిపినా శాంతియుతంగానే ఉండాలని పిలుపు
నిషేధం ఎత్తివేశామన్న మంత్రి పృథ్వీ సుబా గురుంగ్
నేపాల్ తదుపరి ప్రధాని ఎవరు?… రేసులో ర్యాప్ గాయకుడు!
ర్యాపర్ బలేంద్ర షా, ఆర్థికవేత్త సుమనా శ్రేష్ఠ
అవినీతి, ఆర్థిక సంక్షోభంపై జెన్-జీ ఆగ్రహం
నేపాల్‌లో హింసాకాండ: మాజీ ప్రధాని భార్యను సజీవంగా తగలబెట్టిన నిరసనకారులు

నేపాల్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారి అదుపుతప్పాయి. ఆగ్రహంతో రగిలిపోతున్న యువత ఏకంగా ప్రధానమంత్రి కేపీ ఓలీ అధికారిక నివాసానికే నిప్పు పెట్టడంతో దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ఆందోళనకారులు రాజధాని ఖాట్మండులో విధ్వంసం సృష్టిస్తున్నారు.
ప్రధాని ఓలీ రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో యువత చేపట్టిన నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ఇటీవల ప్రభుత్వం సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ, వారి ఆగ్రహం చల్లారలేదు. ఖాట్మండులోని పార్లమెంట్ వద్దకు వేలాదిగా చేరుకున్న నిరసనకారులు రహదారులను దిగ్బంధించారు. అనంతరం ప్రధాని అధికారిక నివాసంలోకి చొచ్చుకెళ్లి, ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి భవనానికి నిప్పుపెట్టారు.
ఆందోళనకారుల దాడులు కేవలం ప్రధాని నివాసానికే పరిమితం కాలేదు. దేశ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ అధికారిక నివాసం, మాజీ ప్రధానులు పుష్ప కమల్ దహల్ (ప్రచండ), షేర్ బహదూర్ డ్యూబాల ఇళ్లపై కూడా దాడులు చేసి నిప్పుపెట్టారు. మంత్రులు పృథ్వీ సుబ్బ గురుంగ్, రమేశ్ లేఖక్, యూఎంఎల్ నేత మహేశ్ బాస్నేట్, నేపాలీ కాంగ్రెస్ నేత గగన్‌థాపాతో సహా పలువురు కీలక నేతల నివాసాలు, కార్యాలయాలు దాడులకు గురయ్యాయి. ఖాట్మండులోని నేపాలీ కాంగ్రెస్, యూఎంఎల్ పార్టీల ప్రధాన కార్యాలయాలను కూడా ఆందోళనకారులు దహనం చేశారు.
ఈ హింసాత్మక పరిణామాల నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించి, సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ప్రధాని కేపీ ఓలీ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు.
యువతరం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సోషల్ మీడియాపై విధించిన నిషేధంతో మొదలైన నిరసనలు.. అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారి దేశాన్ని అల్లకల్లోలం చేశాయి. ఈ తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. రెండు రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనల్లో 19 మంది ప్రాణాలు కోల్పోగా, 400 మందికి పైగా గాయపడ్డారు.
‘సోషల్ మీడియాపై నిషేధాన్ని ఆపండి, అవినీతిని ఆపండి’ అంటూ వేలాది మంది యువత సోమవారం వీధుల్లోకి వచ్చారు. 24 గంటల్లోనే ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రాజధాని ఖాట్మండు వీధులు రణరంగాన్ని తలపించాయి. నిరసనకారులు పార్లమెంటుతో పాటు ప్రధాని ఓలీ, అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ప్రైవేట్ నివాసాలకు నిప్పుపెట్టారు. ఎదురొచ్చిన పోలీసులతో ఘర్షణకు దిగుతూ, ప్రభుత్వ వాహనాలను తగలబెట్టారు.
నిజానికి ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం నిషేధం విధించడంతో ఈ ఆందోళనలు మొదలయ్యాయి. ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ, యువత శాంతించలేదు. నిరసనల సందర్భంగా 19 మంది పౌరులు మృతి చెందడంతో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. ప్రభుత్వంలో పెరిగిపోయిన అవినీతి, బంధుప్రీతికి వ్యతిరేకంగా యువత తమ నిరసనను కొనసాగించింది. అధికారంలో ఉన్నవారి పిల్లలకు అన్యాయంగా అవకాశాలు కల్పిస్తున్నారంటూ ‘#NepoBabies’ హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
పరిస్థితి చేయి దాటిపోవడంతో ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. ప్రధాని రాజీనామా చేసినప్పటికీ, దేశంలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. అధ్యక్షుడి ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తున్నా, త్వరలోనే అది కూడా కూలిపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు సైన్యం పాలన చేపట్టవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రాజధాని ఖాట్మండు సహా పలు నగరాల్లో ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. ప్రధాని కేపీ శర్మ ఓలీ, అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్‌ల ప్రైవేటు నివాసాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు. భక్తపూర్‌లోని ప్రధాని అధికారిక నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. మాజీ ఉప ప్రధాని రఘువీర్ మహాసేత్ ఇంటిపై రాళ్ల దాడి జరగ్గా, సోమవారం రాజీనామా చేసిన హోంమంత్రి రమేశ్ లేఖక్ నివాసాన్ని ఆందోళనకారులు తగలబెట్టారు.
ఈ హింసాత్మక ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రులు ఒక్కొక్కరిగా తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. హోంమంత్రి రమేశ్ లేఖక్ బాటలోనే వ్యవసాయ శాఖ మంత్రి రామ్‌నాథ్ అధికారి, నీటి సరఫరా శాఖ మంత్రి ప్రదీప్ యాదవ్ కూడా తమ రాజీనామాలను ప్రకటించారు. పలువురు ఎంపీలు కూడా రాజీనామాలు సమర్పించడంతో ఓలీ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.
ఈ రాజకీయ సంక్షోభం నడుమ, ప్రధాని ఓలీ దుబాయ్‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. వైద్య చికిత్స కోసమే ఆయన వెళుతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం హిమాలయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఉప ప్రధానికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు, ఆందోళనల్లో మరణించిన యువతకు న్యాయం జరిగే వరకు, ఓలీ ప్రభుత్వం గద్దె దిగేవరకు తమ పోరాటం ఆగదని నిరసనకారులు స్పష్టం చేస్తున్నారు.
ఉద్యమాన్ని ముందుకు నడిపించిన సామాన్యుడు
ఆవేశపూరిత ప్రసంగాలు చేయకుండానే ఉద్యమాన్ని ముందుకు నడిపించిన సామాన్యుడు
ప్రభుత్వం విధించిన సోషల్ మీడియా నిషేధంపై నేపాల్ యువతరం రగిలిపోతున్న వేళ వారి ఆందోళనకు, ఆగ్రహానికి ఒక రూపం, ఒక గొంతుక ఆవిర్భవించాయి. ఆయనే సుడాన్ గురుంగ్. కేవలం కొన్ని గంటల్లోనే దేశవ్యాప్తంగా యువతను ఏకతాటిపైకి తెచ్చి, శక్తిమంతమైన ప్రభుత్వాన్ని సైతం దిగివచ్చేలా చేసిన 36 ఏళ్ల సామాజిక కార్యకర్త. నేపాల్‌లో చెలరేగిన ఈ జెన్-జడ్ తిరుగుబాటుకు సుడాన్ గురుంగ్ ఇప్పుడు ఒక అధినాయకుడిగా, చోదక శక్తిగా నిలిచారు.
సామాన్య కార్యకర్త నుంచి ఉద్యమ నేతగా…
కొన్ని రోజుల క్రితం వరకు సుడాన్ గురుంగ్ పేరు నేపాల్ రాజకీయ వర్గాల్లో అంతగా పరిచయం లేదు. ‘హామీ నేపాల్’ (అంటే ‘మేము నేపాల్’) అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడిగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. కానీ, ఈ నెల 4న ప్రభుత్వం సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడాన్ని నిరసిస్తూ వేలాది మంది యువత అయోమయంలో ఉన్నప్పుడు సుడాన్ గురుంగ్ వారికి ఒక స్పష్టమైన మార్గాన్ని చూపించారు.
ఆ పిలుపే నిరసనల నిప్పు కణిక!
సుడాన్ గురుంగ్ ఇచ్చిన ఒక్క పిలుపు ఈ ఉద్యమానికి ఊపిరి పోసింది. ఆయన చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. హింసకు తావులేకుండా, ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా తన ప్రణాళికను రచించారు. “మన నిరసన శాంతియుతంగా ఉండాలి. విద్యార్థులంతా తమ స్కూల్ యూనిఫామ్‌లలో, చేతిలో పుస్తకాలతో పార్లమెంట్ వద్దకు తరలిరండి. మన ఆయుధాలు అక్షరాలు, మన డిమాండ్ ప్రజాస్వామ్యం” అంటూ ఆయన ఇచ్చిన పిలుపు సామాజిక మాధ్యమాల్లో (నిషేధానికి ముందు) దావానలంలా వ్యాపించింది. ఈ పిలుపులోని నిబద్ధత, అహింసా మార్గం యువతను కదిలించింది. వేలాది మంది విద్యార్థులు తమ పాఠశాల దుస్తులతో, పుస్తకాలతో ఖాట్మండు వీధుల్లోకి రావడం ప్రభుత్వానికే కాదు, అంతర్జాతీయ మీడియాకు కూడా ఒక బలమైన సందేశాన్ని పంపింది.
‘నెపో కిడ్’ ప్రచారానికి సారథ్యం
సోషల్ మీడియా నిషేధం అనేది కేవలం పైకి కనిపించే కారణం మాత్రమే. అంతర్లీనంగా రాజకీయ నాయకుల పిల్లలు, వారి విలాసవంతమైన జీవితాలు, అవినీతిపై యువతలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ‘నెపో కిడ్’ (రాజకీయ పలుకుబడితో ఎదిగిన పిల్లలు) అనే హ్యాష్‌ట్యాగ్‌తో జరుగుతున్న ప్రచారానికి సుడాన్ గురుంగ్ తన గొంతును జోడించారు. “సామాన్యుడికి ఇంటర్నెట్ దూరం చేసి, మీ పిల్లలు మాత్రం విదేశాల్లో ప్రజాధనంతో సుఖపడతారా?” అని ఆయన సంధించిన ప్రశ్నలు యువతను నేరుగా తాకాయి. దీంతో ఈ ఉద్యమం కేవలం సోషల్ మీడియా పునరుద్ధరణకే పరిమితం కాకుండా, ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా రూపుదిద్దుకుంది.
సుడాన్ గురుంగ్ సంప్రదాయ రాజకీయ నాయకుడిలా ఆవేశపూరిత ప్రసంగాలు చేయలేదు. నిశ్శబ్దంగా, దృఢంగా, స్పష్టమైన లక్ష్యంతో యువతను నడిపించారు. ఆయన విధానం వల్లనే అంతర్జాతీయంగా ఈ ఉద్యమానికి మద్దతు పెరిగింది. పోలీసుల కాల్పుల తర్వాత కూడా శాంతియుతంగానే ఉండాలని, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని ఆయన పదే పదే విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం దిగివచ్చి నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ సుడాన్ గురుంగ్ నేపాల్ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికారు. ఆయన ఇప్పుడు కేవలం ఒక ఎన్‌జీవో అధ్యక్షుడు కాదు, నేపాల్ యువత ఆకాంక్షలకు, వారి పోరాట స్ఫూర్తికి ఒక ప్రతీక. భవిష్యత్తులో ఆయన రాజకీయ ప్రవేశం చేస్తారా? లేదా? అనేది పక్కన పెడితే నేపాల్ యువతరం తమ హక్కుల కోసం ఎలా పోరాడాలో నేర్పిన ఆధునిక నాయకుడిగా మాత్రం చరిత్రలో నిలిచిపోతారు.
ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలో సోమవారం రాత్రి జరిగిన అత్యవసర క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం, సమాచార, ప్రసార శాఖ మంత్రి పృథ్వీ సుబా గురుంగ్ మీడియాతో మాట్లాడుతూ, “సామాజిక మాధ్యమాలపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం అధికారికంగా ఎత్తివేస్తోంది. మళ్లీ ఈ మాధ్యమాలు సాధారణంగా పనిచేయనున్నారు” అని ప్రకటించారు.
నిషేధం ఎందుకు వచ్చిందంటే?
గడువు లోపు ఫేస్‌బుక్, వాట్సప్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్), రెడిట్, లింక్డిన్ వంటి 26 సామాజిక మాధ్యమాలు నేపాల్ కమ్యూనికేషన్ శాఖలో రిజిస్టర్ అవ్వకపోవడంతో, గత గురువారం నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది.
ఈ చర్యపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో ఖాట్మండు సహా పలు పట్టణాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు ప్రారంభమయ్యాయి. నిరసనకారులు పార్లమెంట్ వైపు దూసుకెళ్లారు.
హింసాత్మక ఘటనలు – భద్రతా బలగాల జోక్యం
భద్రతా బలగాలు ఆందోళనకారులను అడ్డుకునేందుకు జలఫిరంగులు, టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించాయి. ఈ ఘటనల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు, 300 మందికి పైగా గాయపడ్డారు.
మళ్లీ యాక్టివ్ అయిన సామాజిక మాధ్యమాలు
ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేయడంతో సోమవారం అర్ధరాత్రి దాటాక ఫేస్‌బుక్, ఎక్స్, వాట్సప్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాలు మళ్లీ నెట్‌వర్క్‌లోకి వచ్చాయి. ప్రజల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని, సమాచార మంత్రిత్వ శాఖ సంబంధిత ఏజెన్సీలతో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి గురుంగ్ తెలిపారు.
మంత్రి పిలుపు:
“ప్రభుత్వం ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తోంది. అందుకే నిషేధాన్ని ఎత్తివేస్తున్నాం. ప్రజలు ఇక ఆందోళనలు విరమించాలి,” అని మంత్రి పృథ్వీ సుబా గురుంగ్ కోరారు.

నేపాల్‌లో పరిస్థితులు అదుపు తప్పాయి. ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై విధించిన నిషేధానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఆందోళనల మధ్య, మంగళవారం జరిగిన ఒక దారుణ ఘటనలో నేపాల్ మాజీ ప్రధానమంత్రి ఝాలానాథ్ ఖనాల్ భార్య రాజ్యలక్ష్మి చిత్రకార్ సజీవ దహనమయ్యారు.
రాజధాని ఖాట్మండులోని డల్లు ప్రాంతంలో ఉన్న ఝాలానాథ్ ఖనాల్ నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టారు. ఇంట్లో ఉన్న రాజ్యలక్ష్మిని బయటకు రానివ్వకుండా అడ్డుకుని ఇంటికి నిప్పు పెట్టారు. తీవ్రంగా గాయపడిన ఆమెను కీర్తిపూర్ బర్న్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.

మరోవైపు, దేశవ్యాప్తంగా పెల్లుబికిన నిరసనల సెగ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ప్రభుత్వాన్ని తాకింది. ఆందోళనకారులు ఆయన ఇంటికి కూడా నిప్పు పెట్టడంతో తీవ్రమైన ఒత్తిడి నడుమ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. సామాజిక మాధ్యమాలపై నిషేధంతో మొదలైన ఈ నిరసనలు ప్రభుత్వ వ్యతిరేకతగా, అవినీతి ఆరోపణలుగా మారి దేశాన్ని అల్లకల్లోలం చేశాయి.
మన పొరుగు దేశం నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరింది. యువత (జెన్-జీ) చేపట్టిన తీవ్ర ఆందోళనల ధాటికి ప్రధాని కేపీ శర్మ ఓలీ (73) ప్రభుత్వం మంగళవారం కుప్పకూలింది. ఆయనతో పాటు దేశ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ కూడా రాజీనామా చేయడంతో దేశం అనిశ్చితిలో పడింది. ఈ నేపథ్యంలో, దేశ తదుపరి ప్రధాని ఎవరు అనే చర్చ మొదలైంది. ఈసారి ప్రధాని పదవి రేసులో ఓ ర్యాపర్, అమెరికాలో చదువుకున్న ఆర్థికవేత్త వంటి అనూహ్యమైన పేర్లు వినిపిస్తుండటం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.

రేసులో ఉన్నది వీరే…!
ప్రస్తుతం ప్రధాని పదవికి ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిలో మొదటి వ్యక్తి ఖాట్మండూ మేయర్, ప్రముఖ ర్యాప్ గాయకుడు అయిన బాలేంద్ర షా (బాలెన్ షా). సోషల్ మీడియాలో యువత నుంచి ఆయనకు విపరీతమైన మద్దతు లభిస్తోంది. శాంతియుతంగా ఉండాలంటూ ఆయన చేసిన విజ్ఞప్తికి “బాలెన్ అన్నయ్యే మా నాయకుడు” అంటూ యువత స్పందించింది.
మరొకరు సుమనా శ్రేష్ఠ (40). అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి ఎంబీఏ చేసిన ఈమె, గతంలో నేపాల్ విద్యా, సైన్స్, టెక్నాలజీ మంత్రిగా పనిచేశారు. మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా తనను తాను పరిచయం చేసుకుని, పార్లమెంటులో లింగ సమానత్వం గురించి మాట్లాడి వార్తల్లో నిలిచారు. ఇక డార్క్ హార్స్‌గా మాజీ జర్నలిస్ట్, రెండుసార్లు ఉప ప్రధానిగా పనిచేసిన రవి లామిచ్ఛానే (49) పేరు కూడా వినిపిస్తోంది. అయితే, సహకార సంఘాల పొదుపు కేసులో ఆయన ఏప్రిల్‌లో అరెస్ట్ కావడం ప్రతికూలాంశంగా మారింది.
సంక్షోభానికి కారణం ఇదే…!
ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో 36 గంటల క్రితం ఆందోళనలు మొదలయ్యాయి. ప్రభుత్వం వెంటనే నిషేధాన్ని ఎత్తివేసినా, నిరసనలు ఆగలేదు. దేశంలో పెరిగిపోయిన అవినీతి, ఆర్థిక అభివృద్ధి లేకపోవడంపై జెన్-జీ యువత భగ్గుమంది. కాఠ్‌మాండూ వీధుల్లో మొదలైన ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారి, ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టే స్థాయికి చేరాయి. ఈ ఘర్షణల్లో సోమవారం 19 మంది, మంగళవారం మరో ఇద్దరు మరణించారు. యువత ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో ప్రధాని ఓలీ తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు.
ప్రస్తుతం ఓలీ నేతృత్వంలోని అధికార కూటమి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. నేపాలీ కాంగ్రెస్, మావోయిస్ట్ సెంటర్ వంటి భాగస్వామ్య పక్షాలు కూడా కూటమి నుంచి వైదొలగే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే ప్రభుత్వం పడిపోయి, బాలేంద్ర షా లేదా సుమనా శ్రేష్ఠ వంటి యువ నాయకులకు దేశాన్ని ముందుకు నడిపే అవకాశం దక్కవచ్చు..
హింసాత్మకంగా నేపాల్… ఇండియా-నేపాల్ బోర్డర్ లో హైఅలర్ట్ ప్రకటించిన కేంద్రం

నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. అవినీతికి వ్యతిరేకంగా యువత ఆధ్వర్యంలో జరుగుతున్న దేశవ్యాప్త నిరసనలతో నేపాల్ అట్టుడుకుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇండియా-నేపాల్ సరిహద్దు వెంబడి భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు, నేపాల్‌లో నివసిస్తున్న భారత పౌరులకు కీలక సూచనలు జారీ చేసింది.
నేపాల్‌లో అవినీతికి వ్యతిరేకంగా, గతంలో విధించిన సోషల్ మీడియా నిషేధానికి నిరసనగా యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. ఈ నిరసనలు హింసాత్మకంగా మారడంతో, అక్కడి ప్రభుత్వం రాజధాని ఖాట్మండు సహా పలు ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ విధించింది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో ఉన్న పానీటంకి ఇండియా-నేపాల్ సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద భద్రతను గణనీయంగా పెంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు గస్తీని ముమ్మరం చేశామని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని జిల్లా ఎస్పీ ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. “సరిహద్దు ప్రాంతంలో ప్రత్యేక పోలీస్ పోస్ట్ ఏర్పాటు చేసి బలగాలను మోహరించాం. భద్రతా ఏజెన్సీలు, నేపాల్ పోలీసుల సహకారంతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం” అని ఆయన వివరించారు.
మరోవైపు, నేపాల్‌లోని పరిణామాలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నేపాల్‌లో చోటుచేసుకుంటున్న సంఘటనలను నిశితంగా గమనిస్తున్నామని, నిరసనల్లో పలువురు యువకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. “నేపాల్‌లోని భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలి. స్థానిక అధికారులు జారీ చేసే మార్గదర్శకాలను, సూచనలను తప్పనిసరిగా పాటించాలి” అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
సన్నిహిత పొరుగు దేశంగా, నేపాల్‌లో అన్ని వర్గాలు సంయమనం పాటిస్తూ, శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నట్లు భారత్ తన ప్రకటనలో పేర్కొంది.