- అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా చేరాలన్న ట్రంప్
- తమ దేశం అమ్మకానికి లేదన్న జగ్మీత్ సింగ్
- ఘర్షణకు ప్రయత్నిస్తే… భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిక
కెనడా తమ దేశంలో 51వ రాష్ట్రంగా చేరాలంటూ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అమెరికాలో విలీనం కావాలని మెజార్టీ కెనడా ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. సరిహద్దు భద్రతను మెరుగుపరచకపోతే కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం సుంకాలను విధిస్తామని హెచ్చరించారు.
ఈ వ్యాఖ్యలపై నేషనల్ డెమోక్రాటిక్ పార్టీ (కెనడా ప్రతిపక్ష పార్టీ) నేత, ఖలిస్థానీ మద్దతుదారుడు జగ్మీత్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ట్రంప్ కు తాను ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నానని… మనం మంచి పొరుగు దేశస్తులమని ఆయన అన్నారు. కెనడాతో మీరు ఘర్షణకు ప్రయత్నిస్తే… దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ దేశం అమ్మకానికి లేదని… ఈ దేశంలో ఉన్నందుకు కెనెడియన్లు ఎంతో గర్విస్తారని చెప్పారు. దేశాన్ని రక్షించుకునేందుకు తమ దేశ ప్రజలు ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధమేనని అన్నారు.