- నెల రోజులు దాటినా ఖననం కాని ఇరాన్ మాజీ నేత ఖమేనీ మృతదేహం
- అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు భయపడి అంత్యక్రియల వాయిదా!
- అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయని ఇరాన్ ప్రభుత్వం
- పాలనాయంత్రాంగం బలహీనపడిందంటున్న అంతర్జాతీయ విశ్లేషకులు
- స్వస్థలం మష్హద్‌లో ఖననం చేసేందుకు ప్రతిపాదనలు
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో మరణించి నెల రోజులు దాటినా, ఆయన మృతదేహానికి ఇంకా అంత్యక్రియలు జరగలేదు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల భయం, దేశంలో అంతర్గత నిరసనల ఆందోళనల నడుమ భారీ ఎత్తున బహిరంగ అంత్యక్రియలు నిర్వహించడానికి ఇరాన్ ప్రభుత్వం వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం దేశంలో నెలకొన్న తీవ్ర రాజకీయ అనిశ్చితికి, ప్రభుత్వ బలహీనతకు అద్దం పడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఖమేనీ (86) మరణించారు. మార్చి 4న అంత్యక్రియలు నిర్వహించాలని తొలుత ప్రణాళిక వేసినా, యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో వాయిదా వేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి తేదీని ప్రకటించలేదు. ప్రజలు లక్షలాదిగా తరలివస్తారన్న కారణంతో ఆలస్యమవుతోందని ప్రచారం జరుగుతున్నా, వాస్తవ పరిస్థితులు వేరేలా ఉన్నాయి. గతంలో 1989లో అప్పటి సుప్రీంనేత ఖొమైనీ అంత్యక్రియలకు లక్షల మంది హాజరైనా, ఇప్పుడు అలాంటి వాతావరణం కనిపించడం లేదు.
“ప్రస్తుత పాలనాయంత్రాంగం భయంతో, బలహీనంగా ఉంది. అందుకే పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడానికి సాహసించడం లేదు” అని ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీస్‌కు చెందిన బెహ్నామ్ తాలెబ్లు పేర్కొన్నారు. అంత్యక్రియల సమయంలో ఇజ్రాయెల్ దాడులు జరగవచ్చనే భయంతో పాటు, ఖమేనీ వారసుడిగా భావిస్తున్న ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ బహిరంగంగా కనిపించకపోవడం కూడా ఈ ఆలస్యానికి కారణమని ఆయన విశ్లేషించారు.
ప్రస్తుతం ఇజ్రాయెల్‌కు దూరంగా, తుర్కమెనిస్తాన్ సరిహద్దు సమీపంలో ఉన్న ఖమేనీ స్వస్థలం మష్హద్‌లో ఖననం చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే దీనిపై కూడా తుది నిర్ణయం తీసుకోలేదు. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ కూడా ముగింపు దశకు రావడంతో భద్రతాపరమైన ఆందోళనలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ప్రభుత్వం ఖమేనీ ఖననం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: