అంతర్జాతీయం

ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్ లో కాల్పులు… 10 మంది మృతి

  • సిడ్నీలోని ప్రఖ్యాత బాండీ బీచ్‌లో కాల్పులు
  • ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని పోలీసుల హెచ్చరిక
  • ఇద్దరు దుండగులు కాల్పులకు పాల్పడినట్టు సమాచారం
  • కాల్పుల శబ్దాలతో పరుగులు తీసిన పర్యాటకులు

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కాల్పుల కలకలం రేగింది. ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన బాండీ బీచ్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో కనీసం 10 మంది మరణించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు, భారీ భద్రతను ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రజలు అటువైపు రావొద్దని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6:45 గంటల సమయంలో బాండీ బీచ్‌లో పలువురిపై కాల్పులు జరిగాయని సమాచారం అందడంతో న్యూ సౌత్ వేల్స్ అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి, సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఇది ఇంకా కొనసాగుతున్న ఘటన అని, సమీప ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని పోలీసులు సూచించారు.

కాల్పుల శబ్దాలు, పోలీసు సైరన్లతో బాండీ బీచ్ ప్రాంతం దద్దరిల్లింది. ప్రాణభయంతో పర్యాటకులు, స్థానికులు పరుగులు తీస్తున్న దృశ్యాలతో కూడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నల్ల దుస్తులు ధరించిన ఇద్దరు వ్యక్తులు బాండీ బీచ్‌లోని ఒక వంతెన వద్ద కాల్పులు జరిపినట్టు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఈ ఘటనపై ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కార్యాలయం స్పందించింది. పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ప్రజలు పోలీసుల సూచనలు పాటించాలని కోరింది. ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించారు. ఇద్దరు దుండగుల్లో ఒకరిని భద్రతా బలగాలు హతమార్చాయి.

బాండీ బీచ్ కాల్పుల ఘటన దృశ్యాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి: ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్

14-12-2025 Sun 16:38 | International

Anthony Albanese on Bondi Beach Shooting Shocking Scenes
  • ఆస్ట్రేలియా సిడ్నీలో కాల్పుల కలకలం
  • బాండీ బీచ్ వద్ద ఘటనలో 10 మంది మృతి
  • షాకింగ్ ఘటనగా అభివర్ణించిన ప్రధాని అల్బనీస్
  • యూదు వ్యతిరేక దాడిగా ఇజ్రాయెల్, యూదు సంఘాల ఆరోపణ
  • ఒక షూటర్ హతం.. మరొకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బాండీ బీచ్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రధాని ఆంటోనీ అల్బనీస్ అన్నారు. ఈ దృశ్యాలు అత్యంత షాకింగ్‌గా, కలవరపరిచేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 10 మంది మరణించారు.

“బాండీలో చోటుచేసుకున్న దృశ్యాలు దిగ్భ్రాంతికరంగా, కలచివేస్తున్నాయి. ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది రంగంలోకి దిగి పనిచేస్తున్నారు. ఈ ఘటనలో ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడే ఏఎఫ్‌పీ కమిషనర్‌తో, ఎన్‌ఎస్‌డబ్ల్యూ ప్రీమియర్‌తో మాట్లాడాను. మేము ఎన్‌ఎస్‌డబ్ల్యూ పోలీసులతో కలిసి పనిచేస్తున్నాము. మరింత సమాచారం ధ్రువీకరించుకున్న తర్వాత పూర్తి వివరాలు అందిస్తాము. పరిసర ప్రాంతాల ప్రజలు ఎన్‌ఎస్‌డబ్ల్యూ పోలీసుల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అంటూ అల్బనీస్ ట్వీట్ చేశారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఈ కాల్పుల్లో మరో 12 మంది గాయపడ్డారు. యూదుల ప్రార్థనా సమావేశం సమీపంలో ఈ దాడి జరగడం గమనార్హం. ఇద్దరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడగా, వారిలో ఒకరిని పోలీసులు మట్టుబెట్టారు. తీవ్రంగా గాయపడిన రెండో షూటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో పోలీస్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని న్యూ సౌత్ వేల్స్ (NSW) పోలీసులు సూచించారు. అక్కడ ఓ బాంబు ఉన్నట్టు అనుమానిస్తున్నామని, దాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వారు తెలిపారు.

ఈ దాడి యూదు వ్యతిరేక చర్యేనని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ ఆరోపించారు. గత రెండేళ్లుగా ఆస్ట్రేలియాలో యూదు వ్యతిరేకత పెరిగిపోవడమే ఈ ఘటనకు కారణమని ఆయన అన్నారు. యూదు సమాజ రక్షణలో అల్బనీస్ ప్రభుత్వం విఫలమైందని ఆస్ట్రేలియన్ జూయిష్ అసోసియేషన్ సీఈఓ రాబర్ట్ గ్రెగొరీ విమర్శించారు. ఎన్నోసార్లు హెచ్చరించినా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆస్ట్రేలియా బీచ్ లో కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ…

Narendra Modi Condemns Australia Bondi Beach Shooting
  • ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో ఘోర ఉగ్రదాడి
  • యూదుల హనుక్కా పండుగ వేడుకలే లక్ష్యంగా కాల్పులు
  • ఒక ఉగ్రవాదితో సహా 12 మంది మృతి, 29 మందికి గాయాలు
  • ఘటనను తీవ్రంగా ఖండించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ
  • ఇది ఉగ్రవాద చర్యేనని ప్రకటించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో గల ప్రఖ్యాత బాండీ బీచ్‌లో ఘోర ఉగ్రదాడి జరిగింది. యూదుల పండుగ అయిన ‘హనుక్కా’ తొలిరోజు వేడుకలు జరుపుకుంటున్న వారిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఒక ఉగ్రవాదితో సహా 12 మంది మృతి చెందగా, ఇద్దరు పోలీసులతో కలిపి 29 మంది గాయపడ్డారు. ఈ దాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు.

ఈ ఘటనను న్యూ సౌత్ వేల్స్ పోలీసులు ఉగ్రవాద చర్యగా ప్రకటించారు. దాడికి పాల్పడిన వారిలో ఒకరిని సిడ్నీకి చెందిన నవీద్ అక్రమ్‌గా గుర్తించినట్లు ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (ఏబీసీ) న్యూస్ తెలిపింది. ప్రస్తుతం ఇద్దరు అనుమానితులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా పోలీస్ ఆపరేషన్ కొనసాగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఈ దాడిపై ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఆస్ట్రేలియాలోని బాండి బీచ్ వద్ద, యూదుల పండుగ అయిన హనుక్కా తొలిరోజు వేడుకలు జరుపుకుంటున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈరోజు జరిగిన ఘోర ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. భారత ప్రజల తరఫున, ఈ దాడిలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ విషాద సమయంలో ఆస్ట్రేలియా ప్రజలకు మేం అండగా ఉంటాం. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించని భారతదేశం, అన్ని రూపాల్లోని ఉగ్రవాదంపై జరిగే పోరాటానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది” అని ట్వీట్ చేశారు.

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ దీనిని విధ్వంసకర ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ఇది జాతి విద్వేషంతో యూదు సమాజంపై చేసిన దాడి అని, ప్రతి ఆస్ట్రేలియన్‌పై జరిగిన దాడిగా భావిస్తున్నామని అన్నారు. దేశంలో ఇలాంటి ద్వేషానికి, హింసకు తావులేదని, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Related posts

కాల్పుల విరమణకు అంగీకరించిన నెతన్యాహు .. ట్రంప్ కు థ్యాంక్స్

Ram Narayana

వెనెజువెలా మరో ఇరాక్ కాకూడదనే..!: మీడియాకు వివరించి చెప్పిన ట్రంప్

Ram Narayana

అమెరికాలోనూ బర్డ్ ఫ్లూ కలకలం…

Ram Narayana