ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో పాల్గొన్న ఆయన… రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడుస్తున్నా, ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటికీ ఒక శాశ్వత రాజధాని లేకపోవడం దురదృష్టకరమని రాఘవులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైఫల్యానికి సంబంధించి ఒకవైపు సీఎం చంద్రబాబు, మరోవైపు మాజీ సీఎం జగన్ ఇద్దరూ సిగ్గుపడాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజధాని అభివృద్ధికి జరుగుతున్న కృషికి అందరూ సహకరించాలని కోరారు.
జగన్‌కు రాజకీయ పరిణతి లేదని రాఘవులు నేరుగా విమర్శించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఏదో ఒకటి మాట్లాడాలన్నట్టుగా వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. మొన్నటి వరకు ‘మూడు రాజధానులు’ అంటూ కాలక్షేపం చేసిన జగన్, ఇప్పుడు ఆ అంశాన్ని పక్కనపెట్టి ‘మావిగన్’ అంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పడుతున్న తరుణంలో అందరూ ఆనందించి, తోడ్పాటు అందించాలి తప్ప, అడ్డుతగిలేలా మాట్లాడటం రాజకీయ నాయకులకు తగదని చురకలు అంటించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: