ఖమ్మం వార్తలు

కల్లూరు గడ్డపై ‘గులాబీ’ గూండాయిజం సాగనివ్వం… మంత్రి పొంగులేటి

​కల్లూరు : “అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని అసమర్థులు.. ఇప్పుడు రంగురంగుల కండువాలు వేసుకుని మాయ మాటలతో వస్తున్నారు. గతంలో మనం ఒక వ్యక్తిని నమ్మి గెలిపించుకుంటే.. పాముకు పాలు పోసినట్లు అయ్యింది. ఆ పాము ఇప్పుడు విషం కక్కుతోంది!” అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై ధ్వజమెత్తారు. బుధవారం కల్లూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో ఆయన ప్రసంగం విపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.

​సొల్లు పురాణాలు చెప్తే సరిపోతుందా?
​వార్డుల్లోకి వస్తున్న బీఆర్ఎస్ నాయకులను నిలదీయాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. “మీ దగ్గర ఎమ్మెల్యే లేడు, మంత్రి లేడు, పోనీ నిధులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి లేడు. మరి ఏముందని ప్రగల్భాలు పలుకుతున్నారు? ఎలా అభివృద్ధి చేస్తారో ప్రజలకు స్పష్టంగా చెప్పండి” అని సవాల్ విసిరారు. మభ్యపెట్టే మాటలు, సొల్లు పురాణాలు చెప్పి ఓట్లు కొల్లగొట్టాలని చూస్తే కల్లూరు ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.

​చందాలకి.. దందాలకి ఇక సెలవు!
​గత ప్రభుత్వంలో సాగిన చందాల, దందాల రాజకీయాలకు ఈ గడ్డపై ఇక స్థానం లేదని మంత్రి స్పష్టం చేశారు. విపక్ష నాయకులు, వారి తొత్తులు అహంకారంతో మాట్లాడుతున్నారని, వారి అహంకారాన్ని అణిచివేయాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. “ఇది నా గడ్డ.. నా ఊరు. ఇక్కడ పుట్టి పెరిగిన వాడిగా చెప్తున్నా.. అభివృద్ధి చేసే సత్తా నాకుంది. చేతకాని వారు పగటి కలలు కంటున్నారు” అని ఎద్దేవా చేశారు.

​అసమర్థులకు బుద్ధి చెప్పే విప్లవం..
​20కి 20 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా బీఆర్ఎస్ అసమర్థతకు చరమగీతం పాడాలని మంత్రి పిలుపునిచ్చారు. నాయకులు రానక్కర్లేదని, ప్రజలే ఒక విప్లవంలా కదిలి హస్తం గుర్తుకు ఓటు వేసి విపక్షాల అడ్రస్ గల్లంతు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Related posts

ఉపేందర్ రెడ్డి కన్నీళ్లకు కరిగితే ఐదు సంత్సరాలు కన్నీళ్లు పెట్టాల్సిందే…పొంగులేటి

Ram Narayana

పామాయిల్‌లో అంతర పంటగా పసుపు, మంత్రి తుమ్మల ప్రయోగం సూపర్‌ హిట్..

Ram Narayana

పాలేరు అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి : మంత్రి పొంగులేటి

Ram Narayana