దేశానికి ఆదర్శవంతంగా తెలంగాణ విద్యా వ్యవస్థ అభివృద్ధి….. డిప్యూటీ సీఎం భట్టి
జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్
దేశానికి ఆదర్శవంతంగా తెలంగాణ విద్యా వ్యవస్థ అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన, ప్రణాళిక శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు.డిప్యూటీ సి.ఎం. మంగళవారం మధిర నియోజకవర్గంలో తన క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, ఇంటర్మీడియట్ విద్యా శాఖ కమిషనర్ కృష్ణ ఆదిత్య,ఎన్పిడిసిఎల్ సిఎండి వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పాఠశాల విద్య సంచాలకులు నవీన్ నికోలస్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ జిల్లాలో విద్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మధిర ప్రాంతంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు పర్యటించారని తెలిపారు.
దేశంలోనే ఆదర్శవంతంగా విద్యాశాఖను అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుందని అన్నారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు, ఐటీఐ లను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా, పాలిటెక్నిక్ కళాశాలలను ఇంజనీరింగ్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసామని అన్నారు. రాష్ట్రంలో అనేక కోర్సులను ప్రస్తుత పరిశ్రమల అవసరాల మేరకు డిజైన్ చేసి విద్యార్థులకు అందించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో డిగ్రీ కళాశాల లేదా జూనియర్ కళాశాలలో ఒక అంబేద్కర్ నాలెడ్జి సెంటర్ ఏర్పాటు చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపిక చేసి ప్రతిపాదనలను వెంటనే తయారు చేయాలని అధికారులకు సూచించారు. దేశంలో జరిగే అన్ని రకాల పోటీ పరీక్షలకు ఇక్కడి నుంచే విద్యార్థులు సన్నద్ధమయ్యేందుకు వీలుగా అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. హైదరాబాద్ నుంచి నిపుణులు చెప్పే పాఠాలు ఇక్కడ విద్యార్థులు వినే లాగా డిజిటల్ లైబ్రరీలను అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ లలో ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాలయాలపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం తెలిపారు. 200 కోట్ల ఖర్చు చేస్తూ 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొనేలా విద్యార్థులను తయారు చేసేందుకు యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు గేమ్ చేంజర్ గా నిలుస్తాయని అన్నారు. మధిర నియోజకవర్గ పరిధిలో రాబోయే విద్యా సంవత్సరం నుంచి యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు ప్రారంభించేలా పనులు పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. మధిర ప్రాంతంలో ప్రతి మండలంలో 3 క్లస్టర్ పాఠశాలలను గుర్తించి అక్కడ 10 గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు అవసరమైన మేర తరగతి గదులు, ఇతర ఇన్ ఫ్రా, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఏర్పాటు చేస్తూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. మధిర నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా మూడు తెలంగాణ పబ్లిక్ స్కూల్ పాఠశాలలను గుర్తించామని, అక్కడ అభివృద్ధి పనులు చేపట్టి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తామని అన్నారు. జిల్లాలో ఉన్న కేజిబీవిలో కూడా అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం తెలిపారు. విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా మాట్లాడుతూ మధిర నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక చేపట్టామన్నారు. అన్ని విద్యా సంస్థల్లో ఇన్ఫ్రాష్ట్రక్చర్ తో పాటు అన్ని విధాలా సౌకర్యాలు కల్పనకు చర్యలు చేపడతామన్నారు.
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాకు ఫుల్ టైం డిఈఓ, ఏడి స్థాయి అధికారినీ కేటాయించాలని అన్నారు. ఎఫ్.ఆర్.ఎస్. అమలులో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని, ప్రతి రోజు విద్యార్థుల, ఉపాధ్యా యుల హాజరు, ఎఫ్.ఆర్.ఎస్ పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలలో చదివే ప్రతి విద్యార్థికి ఆధార్, అపార, కుల ధృవీకరణ పత్రం, బర్త్ సర్టిఫికెట్ ఉండేలా చర్యలు చేపట్టామనన్నారు. మండల స్థాయిలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి నెల రోజుల వ్యవధిలో సాచురేషన్ పద్ధతిలో వంద శాతం ప్రతి విద్యార్థికి 4 సర్టిఫికెట్లు జారీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, విద్యాశాఖ సిఇ గణపతి రెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, నియోజకవర్గ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

