- మహిళల భద్రత కోసం చట్టాలు చేయడమే కాదు అమలు చేయాలన్న ముఖ్యమంత్రి
- ప్రజా ప్రభుత్వంలో అన్ని పథకాలు మహిళల పేరు మీదే అమలు చేస్తున్నామని వెల్లడి
- రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమన్న రేవంత్ రెడ్డి
సోషల్ మీడియా వల్ల మహిళలపై వేధింపులు పెరిగాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల భద్రత కోసం కేవలం చట్టాలు చేయడం మాత్రమే కాదని వాటిని అమలు చేసి తీరాలని అన్నారు. మహిళల భద్రత కోసం పురుషులు ముందుకు రావాలనే సందేశంతో తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గతంలో మహిళలపై వేధింపులు పట్టణాలకే పరిమితమయ్యేవని ఇప్పుడు వాటి పరిధి పెరిగిందని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో అన్ని పథకాలు మహిళల పేరు మీదే అమలు చేస్తున్నామని వెల్లడించారు. మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీలో వెయ్యి బస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు.
రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, అందుకే వారి ప్రతిభను గుర్తించి తమ ప్రభుత్వం మహిళలకు తగిన ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. హైటెక్ సిటీ వంటి ఖరీదైన ప్రాంతం పక్కన మహిళా ఉత్పత్తుల విక్రయం కోసం ఇందిరా మహిళా స్టాల్స్‌కు స్థలం కేటాయించినట్లు తెలిపారు.
గ్రామీణ మహిళల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తూ, వారి ఉత్పత్తులను ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ద్వారా విక్రయించేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. తెలంగాణను అగ్రస్థానంలో నిలపడంలో మహిళల కృషి ఎంతో ఉందని అన్నారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వారికి అన్ని వేళలా అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.