జర్నలిస్టుల హక్కుల రక్షణకు ఉద్యమాలు…ఐజేయీ
వర్కింగ్ జర్నలిస్ట్స్ చట్టం పునరుద్ధరణ, కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలి
మీడియా స్వేచ్ఛపై గళమెత్తిన ఐజేయూ సభ్యులు
రెండు దశాబ్దాలుగా వేతన సవరణలేదని ఆవేదన
మీడియాపై నియంత్రణ పెరుగుతోందని ఆందోళన
స్వతంత్ర మీడియా బలోపేతానికి చట్టాలు కావాలని డిమాండ్
వర్కింగ్ జర్నలిస్ట్స్ చట్టాన్ని పునరుద్ధరించడంతో పాటు కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని, మీడియా స్వాతంత్ర్యాన్ని కాపాడేందుకు కొత్త చట్టాలు తీసుకురావాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు కె. శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఐజేయూ 11వ ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత రెండు దశాబ్దాలుగా జర్నలిస్టులకు వేతన సవరణలు జరగకపోవడం వల్ల వారి పరిస్థితి అసంఘటిత రంగ కార్మికుల కంటే దారుణంగా మారిందన్నారు.
“దృఢమైన, స్వతంత్ర మీడియా లేకుండా ప్రజాస్వామ్యం సజావుగా నడవదు. కానీ ప్రస్తుతం మీడియాను నిర్లక్ష్యం చేయడంతో పాటు ప్రభుత్వ నియంత్రణ పెరుగుతోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
పని గంటలు, నైట్ డ్యూటీ నిబంధనలు వంటి ప్రాథమిక అంశాలను యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డిజిటల్ (సోషల్) మీడియా ప్రభావంతో సంప్రదాయ మీడియా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని, పత్రికలు, టీవీ ఛానెల్లు వీక్షకుల కోసం పోటీ పడుతున్నాయని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ లోని యూఎన్‌ఐ కార్యాలయాన్ని అధికార యంత్రాంగం స్వాధీనం చేసుకోవడం పెరుగుతున్న అసహనానికి ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను మరింత అధికారాలతో ‘మీడియా కౌన్సిల్ ఆఫ్ ఇండియా’గా పునర్వ్యవస్థీకరించాలని ప్లీనరీ తీర్మానించిందని తెలిపారు.
ఐజేయూ ప్రధాన కార్యదర్శి బాల్విందర్ సింగ్ జమ్మూ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జర్నలిస్టుల పరిస్థితి దిగజారుతోందని, వారిపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. “దేశంలోనూ, విదేశాల్లోనూ జర్నలిస్టులు తమ విధులు నిర్వహించడంలో ప్రాణాపాయం ఎదుర్కొంటున్నారు. స్వేచ్ఛా భావ వ్యక్తీకరణపై అధికార యంత్రాంగం అసహనంగా వ్యవహరిస్తోంది” అని అన్నారు.
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వై. సత్యనారాయణ (సుజనా చౌదరి) సోషల్ మీడియా నియంత్రణ లేకుండా పెరుగుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. “సోషల్ మీడియా క్రమంగా యాంటీ-సోషల్ మీడియాగా మారుతోంది. జర్నలిజం విలువల ఆధారంగా ఉండాలి. వార్తల నిజానిజాలను నిర్ధారించే విధానాలు అవసరం. నియంత్రణకు నేను అనుకూలం కాదు కానీ సరైన మార్గదర్శకాలు అవసరం” అని చెప్పారు.
సీనియర్ జర్నలిస్టు ఆర్.వి. రామారావు మాట్లాడుతూ యాజమాన్యాల ఆధిపత్యంలో మీడియా స్వతంత్రత దెబ్బతింటోందని, భయభ్రాంతులు లేకుండా అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వతంత్ర మీడియాను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ ఎల్. కృష్ణదేవరాయలు, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ (చిన్నీ) సందేశాన్ని సురేష్ కుమార్ చదివి వినిపించారు.
సభ ప్రారంభానికి ముందు ఐజేయూ నాయకులు మరణించిన సీనియర్ జర్నలిస్టులు అంబటి అంజనేయులు, కె. అమర్నాథ్, ప్రేమ్‌నాథ్ భార్గవ్, మణికొండ చలపతి రావులకు నివాళులు అర్పించారు. అనంతరం కె. శ్రీనివాస్ రెడ్డి ఐజేయూ జెండాను ఆవిష్కరించారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులకు ఏపీయూవీజే అధ్యక్షుడు ఐ.వి. సుబ్బారావు నేతృత్వంలోని స్వాగత కమిటీ ఆతిథ్యం అందించింది.
సాంస్కృతిక కార్యక్రమాలు సభకు ఆకర్షణగా నిలిచాయి. ఐపిటీఏ కళాకారులు దేశభక్తి గీతాలతో అలరించగా, మిమిక్రీ కళాకారుడు సిల్వెస్టర్ వినోదాన్ని పంచారు. నగరానికి చెందిన యువ కళాకారులు కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను మెప్పించారు.