Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

బిగ్ బాస్ స్టూడియో మూసివేయండి… కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం!

  • కన్నడ బిగ్ బాస్ స్టూడియో మూసివేతకు ప్రభుత్వ ఆదేశాలు
  • కాలుష్య నియంత్రణ నిబంధనల తీవ్ర ఉల్లంఘన
  • కర్ణాటక కాలుష్య నియంత్రణ మండలి కీలక నిర్ణయం
  • చట్టం ముందు ఎవరూ గొప్పవారు కాదన్న మంత్రి ఈశ్వర్ ఖండ్రే
  • విద్యుత్ సరఫరా నిలిపివేయాలని బెస్కామ్‌కు ఆదేశం

కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ కు ఊహించని షాక్ తగిలింది. పర్యావరణ, కాలుష్య నియంత్రణ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలతో, షో చిత్రీకరిస్తున్న స్టూడియోను తక్షణమే మూసివేయాలని కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (కేఎస్ పీసీబీ) మంగళవారం సంచలన ఆదేశాలు జారీ చేసింది.

బెంగళూరు శివార్లలోని రామనగర జిల్లా, బిడదిలో ఉన్న ‘జాలీవుడ్ స్టూడియోస్ అండ్ అడ్వెంచర్స్’ ప్రాంగణంలో ఈ షో చిత్రీకరణ జరుగుతోంది. స్టూడియోకు విద్యుత్ సరఫరాను తక్షణమే నిలిపివేయాలని బెస్కామ్ (బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ) మేనేజింగ్ డైరెక్టర్‌కు కేఎస్ పీసీబీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ మూసివేత అమలులో ఉంటుందని పేర్కొంది.

ఈ పరిణామంపై రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే స్పందించారు. “నిబంధనల ఉల్లంఘనపై పలుమార్లు నోటీసులు జారీ చేసినా వారు పట్టించుకోలేదు. చట్టం ముందు ఎవరూ గొప్పవారు కాదు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం” అని ఆయన స్పష్టం చేశారు.

షో నిర్వాహకులైన వెల్స్ స్టూడియోస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు 2024 మార్చిలోనే రామనగర ప్రాంతీయ అధికారులు నోటీసులు ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు. “వాయు, జల కాలుష్య నివారణ చట్టాల ప్రకారం అవసరమైన అనుమతులు వారు తీసుకోలేదు. కనీసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. ఇది సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను ఉల్లంఘించడమే” అని ఆయన వివరించారు.

బిగ్ బాస్ షోను పూర్తిగా నిలిపివేస్తారా అని మీడియా ప్రశ్నించగా, “చట్టాన్ని అమలు చేయడం మా బాధ్యత. నిర్వాహకులు కోర్టును ఆశ్రయించే అవకాశం వారికి ఉంది” అని మంత్రి బదులిచ్చారు. కాగా, ఇటీవలే ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 12 భవిష్యత్తు ఈ పరిణామంతో ప్రశ్నార్థకంగా మారింది.

Related posts

ఆపరేషన్ సిందూర్.. బహవల్పూర్ నుంచి కోట్లి వరకు.. ఇక్కడ మాత్రమే దాడులు ఎందుకు?

Ram Narayana

కుర్చీ కోసం గొడవ.. ఆఫీసు బయట సహోద్యోగిపై యువకుడి కాల్పులుl

Drukpadam

వందే భారత్ వర్సెస్ వందే మెట్రో.. తేడాలు ఏమిటి?

Ram Narayana

Leave a Comment